Old Age Pensioners Problems In Andhra Pradesh : ప్రకాశం జిల్లా త్రిపురాంతకానికి చెందిన ఈ వృద్ధురాలు పింఛన్ నగదు తీసుకొనేందుకు బ్యాంకుకు వచ్చి స్పృహ తప్పి పడిపోయారు. ఏలూరు జిల్లా చాగరపల్లికి చెందిన ఈమె పింఛన్ కోసం బ్యాంకుకు రాగా ఎవరూ సమాధానం చెప్పక వేచి చూసి చూసీ స్పృహ తప్పారు. విజయవాడలో ఓ వృద్ధురాలు బ్యాంకులోనే కూలబడిపోయారు. ఇది జగన్ నడిపిన అసలు సిసలు కుట్ర.
గుంటూరు నగరంలో నడవలేని వారికి ఇంటికే పింఛను అందిస్తామని చెప్పి ఇలా బ్యాంకు వరకు రప్పించి తీవ్ర ఇబ్బందికి గురిచేశారు. ఇది జగన్ పన్నాగం. చిత్తూరు జిల్లా కార్వేటి నగరం పద్మసరస్సులో పింఛను కోసం మండుటెండలో బ్యాంకుకు వెళుతూ వడదెబ్బకు గురై వృద్ధుడు గోపాలయ్య మృతి చెందారు. బుధవారమూ ఇలానే ఇద్దరిని పొట్టన పెట్టుకున్నారు. ఇది జగన్‌కు పన్నిన కుయుక్తి.
సామాజిక మాధ్యమాల్లోనూ తప్పుడు ప్రచారం : జగన్ సర్కార్ తీరు వల్ల పింఛన్లు తీసుకొనేందుకు వృద్ధులు, లబ్ధిదారులు పడుతున్న కష్టాలు 46 డిగ్రీలను దాటి ఉష్ణోగ్రత ఠారెత్తిస్తుంటే వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు కనీసం తాగునీరు కూడా అందుబాటులో ఉంచలేదు. దీంతో గొంతు తడారిపోతూ వేదన చెందారు. బ్యాంకుల్లో కూర్చోవడానికి సరిపడా కుర్చీలు లేక గంటల తరబడి నిల్చోలేక నరకయాతన అనుభవించారు. కొన్ని చోట్ల బ్యాంకులు నిండిపోవడంతో తలుపులు మూసి వృద్ధుల్ని బయటే ఎండలో ఉంచారు. ఇలా ఒకటి, రెండు కాదు రాష్ట్రవ్యాప్తంగా పింఛనుదారుల్ని అష్టకష్టాలు పెట్టి వికృత ఆనందం పొందారు. 1.35 లక్షల మంది గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటికీ పింఛన్ల పంపిణీకి తేలికైన మార్గం ఉన్నా కాలదన్నారు.
గత నెలలో గ్రామ, వార్డు సచివాలయాల వద్దకు పింఛనుదారుల్ని రప్పించినా రెండు రోజుల్లోనే 90 శాతంపైగా పంపిణీ పూర్తవడంతో ఈ సారి సచివాలయాలకు, బ్యాంకులకు పదే పదే తిప్పించి మరిన్ని ఇక్కట్లకు గురిచేసేలా ఎత్తుగడ వేసి అమలు చేశారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు ఇబ్బందులు కలగకపోతాయా? దాన్ని టీడీపీ, మిత్రపక్షాలపై వేయకపోతామా? అని గోతికాడ నక్కల్లా ఎదురుచూసేలా గురువారం ఉదయం నుంచే వైఎస్సార్సీపీ సైన్యాన్ని రంగంలోకి దింపి బ్యాంకుల వద్ద మోహరింపజేశారు. కుటిల రాజకీయ క్రీడను నడిపించారు. పేటీఎం బ్యాచ్‌ను పెట్టి సామాజిక మాధ్యమాల్లోనూ తప్పుడు ప్రచారం చేశారు. దీన్ని కొన్ని చోట్ల పింఛనుదారులే తిప్పికొట్టారు. ఇంటింటికీ పింఛన్లు అందించేందుకు సరిపడా సిబ్బంది ఉన్నా పంపిణీ చేయకపోవడం ప్రభుత్వ తప్పిదం కాదా? అని ఎదురుతిరిగారు. గత నెల మాదిరిగా గ్రామ, వార్డు సచివాలయాల్లోనే అందించకుండా బ్యాంకుల వద్దకు రప్పించడమేంటని మండిపడ్డారు.
దివ్యాంగుల నరకయాతన : రాష్ట్ర వ్యాప్తంగా పింఛనుదారుల్ని జగన్ ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలో అన్నీ పెట్టారు. దివ్యాంగులు, నడవలేని వారికి ఇంటింటికీ పంపిణీ చేస్తామని ప్రకటించి చాలా చోట్ల వారినీ బ్యాంకుల వద్దకు రప్పించి కష్టాలకు గురిచేశారు. చాలా మందికి ఖాతాలున్నా నగదు జమ కాలేదు. ఎందుకు జమ కాలేదో స్పష్టత ఇచ్చే వారు కనిపించలేదు. 2, 3 ఖాతాలున్న వారికి ఏ ఖాతాలో జమైందో చెప్పేవారే లేరు. గంటల తరబడి బ్యాంకుల్లో నిల్చుని తీరా నగదు జమ కాలేదని తెలిసి పింఛనుదారులు తీవ్ర నిరాశకు గురయ్యారు. వారు మళ్లీ సచివాలయాలకు వెళ్లారు. అక్కడా సరైన సమాచారం ఇవ్వలేదు. రెండు రోజుల తర్వాత చెబుతామంటూ తిప్పిపంపించారు.
బ్యాంకుల దగ్గర దివ్యాంగులు నరకయాతన అనుభవించారు. కొన్ని బ్యాంకుల వద్ద జనాల తాకిడి ఎక్కువగా ఉండటంతో వృద్ధులు, దివ్యాంగులు గంటలకొద్దీ పడిగాపులు కాశారు. పింఛను నగదు కోసం దివ్యాంగులు మండల కేంద్రాలకు వచ్చి ఆరా తీశారు. బ్యాంకు సిబ్బంది ఖాతాల్లో పడలేదని చెప్పడంతో వెనుదిరిగారు. కొందరు బ్యాంకు ఖాతాలు పనిచేయక ఏం చేయాలో అర్థంకాక తీవ్రంగా ఇబ్బందిపడ్డారు.
విజయనగరం జిల్లా బుడతానపల్లికి చెందిన ఓ వ్యక్తి మంచనపడగా బ్యాంకులో ఆయన డబ్బులు వేశారు. మంచంతో సహా ఆయన్ని బ్యాంకుకు తరలిస్తుండగా దారిలో అస్వస్థతకు గురయ్యారు. దీంతో పింఛన్ తీసుకోకుండానే ఇంటికి తీసుకెళ్లారు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో ఓ మహిళకు రెండు కిడ్నీలు చెడిపోయాయి. ఈమెకూ బ్యాంకులోనే డబ్బులు వేశారు.
దరఖాస్తు పూర్తి చేయడం రాక నానా అవస్థలు : రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని బ్యాంకుల ఎదుట గురువారం ఉదయం నుంచే పింఛను కోసం బారులు తీరారు. ఎక్కడా కనీస సౌకర్యాలు కల్పించలేదు. చాలా మంది 5 నుంచి 40 కిలోమీటర్ల వరకు వ్యవప్రయాసలు కోర్చి వచ్చారు. ఒక్కొక్కరికి 50 నుంచి 400 వరకు ఖర్చయింది. కొన్ని చోట్ల మెయింటెనెన్స్ ఛార్జీలు వసూలు చేశారు. గ్రామాల్లో ఉండే వినియోగదారుల సేవా కేంద్రాల్లో 1000కి 10 చొప్పున తీసుకుని నగదు అందించారు. కొందరి ఖాతాల్లో నగదు జమైనా వేలిముద్రలు ఈకేవైసీ చేయించుకోవాలని చెప్పడంతో వెనుదిరిగారు. కొన్ని చోట్ల బ్యాంకులు, బ్యాంకింగ్ సేవా కేంద్రాల్లో పింఛను తీసుకోడానికి 4 నుంచి 5 గంటలు పట్టింది. వృద్ధులు డబ్బులు తీసుకునే దరఖాస్తు పూర్తి చేయడం రాక నానా అవస్థలు పడ్డారు.
విశాఖ జిల్లా పద్మనాభంలో ఓ బ్యాంకు బయట ఎండలోనే ఫించన్లు పంపిణీ చేశారు. కొన్ని బ్యాంకుల్లో నగదు ఇవ్వాలంటే సాక్షి సంతకం కావాలని బ్యాంకు సిబ్బంది ఆంక్షలు పెట్టారు. ఆధార్, ఫోన్ నంబరు.. బ్యాంకు ఖాతాకు అనుసంధానం కాలేదని చాలా మందిని వెనక్కి పంపారు. ఆధార్ అనుసంధానం చేసిన తర్వాతే నగదు ఇస్తామని బ్యాంకు సిబ్బంది చెప్పడంతో ఉసూరుమంటూ వెనుదిరిగారు. కొన్ని బ్యాంకుల వద్ద విత్ డ్రా ఫారాలు నింపడం రాక అవస్థలు పడ్డారు. కర్నూలులో విత్‌డ్రా ఫాం పూర్తి చేయడానికి పది రూపాయల చొప్పున తీసుకున్నారు.
కళ్లు తిరిగి పడిపోయిన వృద్ధురాలు : ప్రజారవాణా వ్యవస్థ, ప్రైవేటు వాహనాలు లేక వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లోని ఏజెన్సీ ప్రాంతాలకు చెందిన పింఛన్‌దారులు కొండలు, గుట్టలు దాటుకుంటూ కాలినడకన మండల కేంద్రాలకు వచ్చారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలంలోని సాకిగూడకు చెందిన వృద్ధురాలు మండుటెండలో మండల కేంద్రానికి వచ్చారు. బ్యాంకు ఖాతాలో నగదు పడలేదని చెప్పడంతో ఉసూరుమంటూ వెనుదిరిగారు.
నంద్యాల జిల్లా ఆత్మకూరులో పింఛన్ల కోసం గ్రామాల్లోని చెంచులు మండల కేంద్రానికి తరలివచ్చారు. ఖాతా మనుగడలో లేక కొందరు ఆధార్ అనుసంధానం కాక మరికొందరు పింఛను నగదు అందక వెనుదిరిగారు. ఆలస్యంగా వెళితే నగదు అందదనే ఆందోళనతో ఉదయం 7 గంటల నుంచే బ్యాంకు దగ్గర పింఛన్‌దారులు పడికాపులు కాస్తూ కనిపించారు. తీరా బ్యాంకులు తీసే సమయానికి జనం పెరిగిపోవటంతో జంగారెడ్డిగూడెం భీమిలి వంటి చోట్ల తోపులాటలు జరిగాయి. నెల్లూరు నగరం స్టోన్‌హౌస్‌పేటలోని ఓ బ్యాంకు దగ్గర పింఛను కోసం వచ్చిన వృద్ధురాలు కళ్లు తిరిగి పడిపోయారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ఓ వృద్దుడు సొమ్మసిల్లి పడిపోయారు.
టీడీపీనే కారణమంటూ ప్రచారం : ప్రకాశం జిల్లాలో వైసీపీ నాయకులు, కొందరు సచివాలయ సిబ్బంది పింఛన్‌దారులను తప్పుదోవ పట్టించారు. బ్యాంకులో నగదు పడనివారినీ, నడవలేని వృద్ధులనూ బ్యాంకులకు పంపించారు. యర్రగొండపాలెంలో నడవలేని వృద్ధురాలిని, త్రిపురాంతకంలో దివ్యాంగురాలిని పింఛన్ కోసం స్థానిక వైసీపీ నాయకులు బ్యాంకులకు పంపించారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో సచివాలయాల వద్దకు వెళ్లి ఇంటింటికీ పంపిణీ నిలిచిపోవడానికి టీడీపీనే కారణమంటూ పింఛనుదారులకు రాజీనామా చేసిన వాలంటీర్లు చెప్పారు.
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో పింఛను నగదు అందించేందుకు డ్వాక్రా ఆర్పీలను వినియోగించారు. ప్రతిపక్షాల కుట్ర వల్లే ఈ పరిస్థితి వచ్చిందంటూ పింఛనుదారులకు ఆర్పీలు చెప్పారు. ఎన్నికల్లో వైకాపాకు ఓటేయాలని ప్రచారం చేశారు. కుప్పం మండలం వసనాడులో వైకాపా రెబల్ ఎమ్మెల్యే అభ్యర్థి మురళి పింఛన్లు పంపిణీ చేశారు. తనకే ఓటు వేయాలని కోరారు.
టీడీపీపై నెట్టేందుకు విశ్వప్రయత్నం : పింఛన్ల కోసం మండుటెండల్లో వృద్ధులు ఇక్కట్లపాలు కాకుండా ఇంటివద్దే ఇచ్చేలా చర్యలు తీసుకోవటం అత్యవసరమంటూ 'ఈనాడు-ఈటీవీ-ఈటీవీ భారత్' ముందే హెచ్చరించాయి. అయినా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి పూర్తి నిర్లక్ష్యం వల్లే రాష్ట్ర వ్యాప్తంగా పింఛను అందుకోవడమన్నది లబ్ధిదారులకు పెద్ద శిక్షలా పరిణమించింది. వృద్ధులను ఇబ్బందులకు గురిచేయకూడదనే ఆలోచన ఏమాత్రం ఉన్నా ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చేవారు కాదు. ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేయకుండా పింఛనుదారుల్ని ఇబ్బందులకు గురిచేసింది చాలక ఆ నెపాన్ని టీడీపీపై నెట్టేందుకు విశ్వప్రయత్నం చేస్తారా? పింఛనుదారుల ఇళ్ల వద్దనే నగదు పంపిణీ చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా జగన్ కి ఉంది కదా ?
సచివాలయ సిబ్బంది ద్వారా సులువుగా పంపిణీ చేయచ్చన్న విషయం 5 ఏళ్లు సీఎంగా ఉన్న ఆయనకు తెలియదా? అయినా బ్యాంకుల వద్దకు రప్పించి ఇక్కట్ల పాలు చేయడం కుట్ర కాక మరేంటి? ఆ నెపాన్ని టీడీపీపై నెడుతూ సామాజిక మాధ్యమాల్లో వైఎస్సార్సీపీ సైన్యంతో పోస్టులు పెట్టిస్తారా? ఫోన్ల ద్వారా ఆడియో మెసేజ్‌లను పంపుతారా? రాజీనామా చేసిన వాలంటీర్లను బ్యాంకులు, సచివాలయాల వద్దకు పంపి విష ప్రచారం చేయిస్తారా? ఇవన్నీ తెలుసుకోలేనంత అమాయకులనుకుంటున్నారా పింఛనుదారులు. మీరు వేసే ఎత్తులన్నీ వారికి తెలుసు. సమయం వచ్చినప్పుడు కీలెరిగి వాతపెట్టేందుకు సిద్ధంగా ఉన్నరాన్న వాదన సర్వత్రా వినిపిస్తోంది.
మండుటెండలో పండుటాకుల పాట్లు- పింఛన్ సొమ్ము అందక కన్నీళ్లతో ఇళ్లకు - Pensioners FACING PROBLEMS