Officials Take Steps to Reopen Anna Canteens: ఎందరో పేదవాళ్ల కడుపు నింపిన అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభ పనులు చకాచకా సాగుతున్నాయి. తెలుగుదేశం హయాంలో నెలకొల్పిన క్యాంటీన్లులో కొన్ని పాడవగా మరికొన్ని చోట్ల వేర్వేరు ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన కార్యకలపాలు సాగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలోకి రాగానే అన్న క్యాంటీన్లు ప్రారంభించేందుకు ఆయన సంతకం చేశారు. చంద్రబాబు ఆదేశాలతో వీటిని వినియోగంలోకి తీసుకొచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. మరోవైపు అన్న క్యాంటీన్ల పునఃప్రారంభం చేసే నిర్ణయం తీసుకున్న చంద్రబాబుపై ప్రజల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది.
పేదోడి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లను మళ్లీ తెరిచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. పాత క్యాంటీన్లు తెరవడంతో పాటు మరికొన్ని కొత్తగా ప్రారంభించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. గతంలో 184 వరకు అన్న క్యాంటీన్లు ఉండేవి. మరో 19 క్యాంటీన్లకు సంబంధించి షెడ్ పనులు పెండింగ్‌లో ఉండిపోయాయి. ఇప్పుడు వాటిని పూర్తిచేసి మొత్తం 203 క్యాంటీన్లను సెప్టెంబర్ 21లోగా ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో పేద ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గత టీడీపీ పాలనలో నిత్యం 30వేల నుంచి 35 వేల మంది అన్నా క్యాంటీన్లలో భోజనం చేసేవారు. ఒక్కో పూటకు రూ.5 చొప్పున అల్పాహారంతో పాటు మధ్యాహ్నం, రాత్రి భోజనం అందించేవారు. ఆటో, రిక్షా డ్రైవర్లు, హమాలీలు, కూలీలు, చిరుద్యోగులు ఇలా ఎంతో మంది వీటిని ఆశ్రయించి ఆకలి తీర్చుకునేవారు. హోటళ్లు, మెస్‌లకు వెళ్లి ఎక్కువ డబ్బు ఖర్చుపెట్టి తినలేని వారికి అన్న క్యాంటీన్ భరోసాగా ఉండేది. అనంతరం అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం వీటిని మూసివేయడంతో నిరుపేదలకు అన్నం ముద్ద దొరక్కుండాపోయింది. ఇతర ప్రాంతాల నుంచి పనుల నిమిత్తం పట్టణాలకు వచ్చిన పేదలు ఆకలి తీర్చుకునేందుకు ఎక్కువ డబ్బులు వెచ్చించి హోటళ్లను ఆశ్రయించాల్సి వచ్చేది.
దట్ ఈజ్ చంద్రబాబు- 'ఇక నుంచి మీకు చాలా పని ఉంటుంది' - Chandrababu Ended Curtain Rule
క్యాంటీన్లలో అల్పాహారం, భోజనం సరఫరా చేసే ఏజెన్సీలు, ఐఓటీ పరికరాల సమీకరణ, స్మార్ట్ బిల్లింగ్ సాఫ్ట్‌వేర్ కోసం సంస్థలను ఖరారు చేయాలి. విరాళాల నిర్వహణ వ్యవస్థ ఏర్పాటు చేయాలి. నిర్మాణ పనులు చేపట్టాల్సిన చోట టెండర్లు పిలిచి గుత్తేదారు సంస్థలతో అగ్రిమెంట్ చేయాలి. ఇప్పటికే నగరపాలక సంస్థలు, మున్సిపాలిటి పరిధిలోని ఇంజనీరింగ్ అధికారులు క్యాంటీన్లను పరిశీలించి భవనం తాజా పరిస్థితి, ఫర్నిచర్, ఐఓటీ పరికరాలు, ఇతర అవసరాలపై నివేదికలు సిద్ధం చేస్తున్నారు.