Police Negligence in Sand Smuggling : రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణా కట్టడిలో విఫలమైన పోలీసులపై ఆ శాఖ పైఅధికారులు చర్యలు తీసుకున్నారు. మల్టీజోన్-2 పరిధిలోని తొమ్మిది జిల్లాల్లో ఇందుకు కారణమైన వారిని గుర్తించి వారిపై వేటు వేశారు. 13 మంది ఎస్సైలు, ముగ్గురు సీఐలను వేకెన్సీ రిజర్వ్(వీఆర్)లో పెడుతూ జోన్ ఐజీపీ వి.సత్యనారాయణ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ జాబితాలో తాండూరు రూరల్, సంగారెడ్డి రూరల్, తాండూరు టౌన్ ఇన్‌స్పెక్టర్లతో పాటు బిజినేపల్లి, వీపనగండ్ల, తెలకపల్లి, ఉప్పునూతల, వంగూరు, సంగారెడ్డి రూరల్, పెద్దేముల్, ఆత్మకూర్(ఎస్), యాలాల్, తుంగతుర్తి, వాడపల్లి, పెన్‌పహాడ్, హాలియా ఎస్సైలు ఉన్నారు.
సమగ్ర దర్యాప్తు అనంతరం ఈ వ్యవహారంలో ప్రత్యక్ష, పరోక్ష సహకారం అందించిన వారిని గుర్తించి శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నారు. రాష్ట్ర ఇంటెలిజెన్స్ నివేదికలు, ఇన్వెస్టిగేషన్ ఆధారంగా ఎస్సై, సీఐలపై చర్యలు చేపట్టినట్లు ఐజీ కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. వీరే కాకుండా గతంలో కూడా ఇసుక అక్రమ రవాణా నియంత్రించడంలో విఫలమైన ఒక సీఐను బదిలీ చేశారు.
అలాగే వేములపల్లి, నార్కట్‌పల్లి, అడవిదేవిపల్లి, చండూర్, మాడుగులపల్లి, తిరుమలగిరి, నాగారం, బాజిరెడ్డిగూడెం, తిప్పర్తి, చింతలపాలెం, అచ్చంపేట, బొంరాస్‌పేట్, తాండూరు, చిన్నంబావి ఎస్సైలను బదిలీ చేశారు. ఇసుక అక్రమ రవాణాలో చేతివాటం చూపారని, వసూళ్లకు పాల్పడినట్లు తేలడంతో జడ్చర్ల హెడ్ కానిస్టేబుల్, కొండమల్లేపల్లి హోంగార్డు కూడా ఇప్పటికే జిల్లా ఆర్మ్‌డ్ రిజిర్వ్‌డ్ కార్యాలయాలకు అటాచ్ చేశారు.
వికారాబాద్ టౌన్ ఇన్‌స్పెక్టర్ సస్పెన్షన్ : జోగిపేట ఎస్‌హెచ్‌వోగా పనిచేస్తున్న సమయంలో మైనర్ బాలికపై అత్యాచారం కేసులో అలసత్వం చూపడంతో పాటు ఇన్వెస్టిగేషన్‌లో అవకతకవలకు పాల్పడినట్లు తేలడంతో వికారాబాద్ టౌన్ ఇన్‌స్పెక్టర్ నాగరాజును సస్పెండ్ చేస్తూ ఐజీ వి. సత్యనారాయణ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
మరికొన్నింటిపైనా నిఘా : చౌక ధరల దుకాణాల ద్వారా పేదలకు పంపిణీ చేసే పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాతోపాటు మట్కా, గాంబ్లింగ్ లాంటి అక్రమ దందాలపైనా సైతం ఉన్నతాధికారులు నిఘా పెట్టారు. వాటిపై అంతర్గత దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటికే వికారాబాద్ మర్పల్లి గెస్ట్‌హౌస్‌లో పేకాట నిర్వహించిన రఫీక్, ప్రభాకర్ అనే వ్యక్తులను ఐజీ, ఎస్పీలు హెచ్చరించారు. రఫీక్‌పై సస్పెక్ట్ షీట్ సైతం తెరిచారు.
హైదరాబాద్ ఊరేగింపుల్లో డీజేలపై నిషేధం : సీపీ సీవీ ఆనంద్ - DJ Sound Ban in Hyderabad