144 section in Komaram Bheem District : కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనుర్ మండల కేంద్రంలో ఇరువర్గాల మధ్య జరిగిన గొడవ కారణంగా గత నాలుగు రోజుల నుంచి 144 సెక్షన్ కొనసాగుతోంది. జైనుర్‌లో ఈ 13 తేదీ నుంచి అధికారులు సెక్షన్ 144ను విధించారు. ఈ నేపథ్యంలో పోలీసులు మండలంలోని భారీ బందోబస్తు మధ్య ఇరువైపులు బారికేడ్లు గేట్లు ఏర్పాటు చేసి రహదారిని మూసివేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా ఆదివాసీ నాయకులను అరెస్టు చేసి జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
అసలేం జరిగిదంటే : విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ నెల 13న కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనుర్‌లో నడుచుకుంటూ వెళుతున్న ఓ వ్యక్తికి మరోవ్యక్తి బైక్ తగలడంతో గొడవ జరిగింది. చిన్న గొడవ కాస్త ఇరువర్గాల మధ్యలోకి చేరి కొట్లాట జరిగింది. ఈ క్రమంలో ఓ ఆదివాసీ వ్యక్తిపై ఒక వర్గం వారు దాడి చేయగా ఆ వ్యక్తి గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీంతో జిల్లాలోని ఆదివాసీలందరూ ఒక్కటై గాయపడిన వ్యక్తికి మెరుగైన వైద్యం అందించాలంటూ, అదేవిధంగా ఆ వ్యక్తికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో ఇవాళ ఉట్నూరులోని పీవోకి గొడవ గురించి వినతి పత్రం ఇచ్చేందుకు కుమురం భీం జిల్లాకు చెందిన కోవ విజయ్, కోట్నాక విజయ్, ఆసిఫాబాద్ జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ కనక యాదవ్ రావులను ఉదయం ఐదు గంటలకే పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారిని బేషరతుగా విడుదల చేయాలని ఆదివాసీలు ధర్నా చేపట్టారు. ఈ విషయంలో ఎంత దూరమైనా వెళ్లడానికి సిద్ధమని పేర్కొన్నారు. జైనుర్‌లో ఇద్దరి మధ్య జరిగిన చిన్న గొడవ కాస్త ఇరువర్గాల మధ్య చేరడమే కాకుండా అది కాస్త చిలికి చిలికి గాలి వాన అయినట్టుగా 144 సెక్షన్‌కు దారి తీసింది.
గత 3 రోజులుగా ఎలాంటి ఘర్షణలు జరగలేదని పోలీసులు చెబుతున్నారు. అయితే ముందు జాగ్రత్త చర్యగా 144 సెక్షన్ కొనసాగిస్తున్నట్లు తెలిపారు. వివాదం ఇంకా పరిష్కారం కాకపోవడం, ఆదివాసీలు తమ డిమాండ్లపై వెనక్కి తగ్గకపోవడంతో ఏ క్షణం ఏమైనా జరిగే అవకాశం లేకపోలేదని పోలీసులు భావిస్తున్నారు. ఆదివాసీలు శాంతించే వరకు ఇదే పరిస్థితి కొనసాగించక తప్పదని చెబుతున్నారు.