Nuziveedu IIIT was Destroyed by YCP Government : ఏలూరు జిల్లాలోని నూజివీడు ట్రిపుల్ ఐటీని గత పాలకులు భ్రష్టు పట్టించారు. ప్రతి విషయంలో కాంట్రాక్టుల వద్ద కమీషన్లు నొక్కి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు. అందినకాడికి దోచుకుని క్యాంపస్ ప్రాంగణాన్ని అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చేశారు. గత ఐదేళ్లుగా ఏదో ఒక వివాదంతో వార్తల్లో ఉంటున్న నూజివీడు ట్రిపుల్ ఐటీ గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
కాసులు కురిపించే కామధేనువు : నూజివీడు ట్రిపుల్‌ఐటీని వైఎస్సార్సీపీ హయాంలో కాసులు కురిపించే కామధేనువులా వాడుకున్నారు. నిబంధనలకు తిలోదకాలిచ్చి టెండర్ల పేరుతో ఇష్టారాజ్యంగా నిధులు కాజేశారు. నిబంధనలు అనుకూలంగా మార్చుకుని కాసులు దండుకున్నారు. లక్ష రూపాయల విలువ దాటిన పనికి ఈ-టెండర్లు పిలవాలన్న నిబంధనలున్నా దాన్ని రెండున్నర లక్షలకు పెంచారు.
A-4 పేపర్ల బండిళ్ల దగ్గరి నుంచి విద్యుత్ వైరింగ్ పనుల వరకు అన్నింటా దోపిడీకి పాల్పడ్డారు. క్యాంపస్‌లో సుమారు 7 వేల మంది విద్యార్థులు ఉండగా నిత్యం వెయ్యి నుంచి 2 వేల మంది మెస్‌లో భోజనం చేయట్లేదు. మెస్ నిర్వాహకులు మాత్రం 7 వేల మంది భోజనం చేస్తున్నట్లు లెక్కలు చూపుతున్నారు. ఇలా ఒక్కో విద్యార్థిపై సుమారు 120 రూపాయల చొప్పున రోజూ జేబుల్లో వేసుకుంటున్నారు.
వీసీ రాజకీయం - అధ్యాపకులకు తలనొప్పి- విద్యార్థులకు వేధింపులు - Nuziveedu IIIT Professors Problems
వసతిగృహాల్లో మత్తు పదార్థాలు : ఈ దోపిడీ అంతా ఒకెత్తయితే ఇటీవల వెలుగుచూసిన విషయాలు క్యాంపస్ ప్రతిష్ఠను మరింత దిగజార్చుతున్నాయి. ట్రిపుల్‌ఐటీ ప్రాంగణంలో కొంతకాలం క్రితం పెద్ద సంఖ్యలో మద్యం సీసాలు దొరికాయి. వసతిగృహాల్లో ఇప్పటికీ మద్యం, సిగరెట్లు, మత్తు పదార్థాల వినియోగం విచ్చలవిడిగా సాగుతోంది. ఇంత జరుగుతున్నా యాజమాన్యం తరఫున దిద్దుబాటు చర్యలు నామమాత్రమైనా కనిపించడం లేదు.
"వసతిగృహాల్లో సిగరెట్లు, మద్యం, మత్తు పదార్థాల వినియోగం విచ్చలవిడిగా సాగుతోంది. గత పాలకులు ట్రిపుల్ ఐటీని ఎంతలా భ్రష్టుపట్టించారో అంచనా వేయడానికి ఇవే నిదర్శనం. ఫుడ్ కాంక్రాక్టుల నుంచి క్యాంపస్ లోపల పనిచేసే అన్ని వ్యవస్థలను సర్వ నాశనం చేశారు. ప్రతి విషయంలో కాంట్రాక్టుల వద్ద కమీషన్లు నొక్కి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు. చివరికి విద్యార్థులకు అందించే పుస్తకాలను సైతం నాశిరకంగా అందిస్తున్నారు." - వెంకటరామారావు, నూజివీడు
గత ఐదేళ్లలో స్థానిక వైసీపీ నేత చెప్పిందే వేదంగా యాజమాన్యం ఉద్యోగాలివ్వగా కనీస అర్హతల్లేని సిబ్బంది చాలా మంది ఉన్నారు. వైసీపీకి చెందిన వ్యక్తికి ప్రాంగణంలో అప్పగించిన ఓ ఫుడ్ కోర్టు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని బయటి నుంచి విద్యార్థులకు మద్యం, సిగరెట్లు, మత్తుపదార్థాల సరఫరా ఇక్కడి నుంచే సాగుతోందన్న విమర్శలున్నాయి. ప్రతిష్టాత్మక నూజివీడు ట్రిపుల్ ఐటీ దుస్థితిపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించి క్యాంపస్‌ను ప్రక్షాళన చేయాలని ప్రజలు కోరుతున్నారు.