TGSRTC Bus Facility Not Available in Many Villages of Telangana : రాష్ట్రంలోని అనేక గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల అవసరాలకు అనుగుణంగా ఆర్టీసీ బస్సులను నడపలేకపోతోంది. ఓవైపు ప్రయాణికుల సంఖ్య పెరుగుతుంటే, మరోవైపు ఆర్టీసీ బస్సుల సంఖ్య తగ్గుతూ వస్తోంది.
- ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో 33 గ్రామాలకు అసలు బస్సు సౌకర్యం లేదు. ఎప్పట్నుంచో ఉన్న ఖమ్మం - జక్కేపల్లి సర్వీసు కూడా ఆర్టీసీ రద్దు చేసింది. రఘునాథపాలెం మండలంలో 15 పంచాయతీలకు, చింతకాని మండలంలో మండల కేంద్రం సహా 21 గ్రామాలకు బస్సులే లేవు.
- నల్గొండ జిల్లా మిర్యాలగూడ నుంచి పూసలపాడు, ముల్కలకాల్వకు వెళ్లే రెండు బస్సుల్ని ఈ సంవత్సరం ఏప్రిల్‌లో ఆర్టీసీ రద్దు చేసింది. మిర్యాలగూడ నుంచి తడకమళ్ల, ఇరికిగూడెం, త్రిపురారం-అడవిదేవులపల్లి, కేశవపురం మార్గాల్లో రోజూ 8 ట్రిప్పులు బస్సులు నడిచేవి. అయితే తక్కువ ఆదాయం వస్తోందని రెండు నెలల క్రితం రద్దు చేశారు. ప్రజాప్రతినిధుల విజ్ఞప్తితో ప్రస్తుతం ఉదయం, సాయంత్రం ఒక్కో ట్రిప్పు నడిపిస్తున్నారు.
- జనగామ నుంచి నిజామాబాద్ మీదుగా బాసరకు వెళ్లే ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికులు బాగా ప్రయాణించేవారు. ఈ బస్సును కూడా ఫిబ్రవరిలో రద్దు చేయడంతో బాసరకు వెళ్లేవారు బస్సులు మార్చుకుంటూ వెళ్లాల్సి వస్తుంది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
ఏటా తగ్గుతున్న బస్సులు : ప్రతి సంవత్సరం బస్సుల సంఖ్య తగ్గుతూ వస్తుంది. సంవత్సరం వారీగా చూసుకుంటే 2014-15లో ఆర్టీసీలో 10,479 బస్సులుండగా, 2024 వచ్చే సరికి 8,574 మాత్రమే ఉన్నాయి. తెలంగాణలో బస్సులు తిరగని గ్రామాలు ఏకంగా 1,497 వరకు ఉన్నాయి. దీంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు.
మంత్రికి ఎమ్మెల్యేల వినతులు : పలుచోట్ల ఏళ్ల తరబడి నడుస్తున్న బస్సులను తగినంత ఆదాయం లేదన్న కారణంతో డిపో అధికారులు రద్దు చేస్తున్నారు. దీంతో స్థానిక ఎమ్మెల్యేలపై ప్రజలు ఒత్తిడి తీసుకొస్తున్నారు. వారి నియోజకవర్గాల్లో రద్దు చేసిన బస్సుల్ని పునరుద్ధరించాలని కోరుతున్నారు. దాదాపు 60 నియోజకవర్గాల నుంచి ఈ తరహా ఫిర్యాదులు వచ్చాయి. మహబూబాబాద్ ఎమ్మెల్యే వారి నియోజకవర్గానికి 15 బస్సులు కావాలంటూ ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్‌నను కలిసి వినతి పత్రం ఇచ్చారు. రూట్ల వారీగా వివరాలను కూడా అందజేశారు. ఇలా చాలా మంది ఎమ్మెల్యేల నుంచి బస్సుల గురించి మంత్రికి వినతిపత్రాలు అందాయి.
సమస్యపై చర్చ: బస్సుల డిమాండ్‌పై రవాణా శాఖ మంత్రి ఆర్టీసీ ఉన్నతాధికారి మధ్య ఇటీవల ప్రధానంగా చర్చ జరిగింది. పరిస్థితిని ఎలా అధిగమించాలి అన్న అంశాలపై చర్చించారు. దీనిపై మరోసారి సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు. మహిళలకు ఉచిత ప్రయాణంతో ఆర్డీసీ బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. జిల్లాల నుంచి హైదరాబాద్ వచ్చే బస్సులు తొలి రెండు, మూడు గ్రామాల్లోనే నిండిపోతున్నాయి. దీంతో తర్వాత వచ్చే గ్రామాల వారు ఎక్కలేని పరిస్థితి వస్తోంది. గతేడాది డిసెంబరు వరకు ఆర్టీసీ బస్సుల్లో నిత్యం సగటున 45 లక్షల మంది ప్రయాణించగా, ఇప్పుడా సంఖ్య 55 లక్షలు దాటుతోంది. ప్రయాణికలకు సరిపడా బస్సుల మాత్రం లేవు. కొత్త బస్సులు దశలవారీగా వస్తాయని యాజమాన్యం వివరించింది.
ఇదిలా ఉండగా సంస్థలో ఉప్పుడున్న బస్సుల్లో చాలావరకు కాలం చెల్లినవే ఉన్నాయి. కొత్త బస్సులను తీసుకువచ్చి పాతవాటి స్థానంలో వీటిని సర్దుబాటు చేస్తుండటంతో కొత్తవాటి సంఖ్య అస్సలు పెరగటం లేదు. ఉదాహరణకు 2017-18లో 915 కొత్త బస్సులు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో 757 డొక్కు బస్సుల స్థానంలో సర్దుబాటు చేశారు. అంటే అదనంగా వచ్చిన బస్సులు 158 మాత్రమే. తర్వాత 2020-2023 మూడేళ్లలో వచ్చిన కొత్త బస్సులు 133 మాత్రమే. అవీ పాత బస్సుల స్థానంలో మార్చినవే. ఈ క్రమంలో అదనంగా పెద్ద సంఖ్యలో కొత్త బస్సులను అందుబాటులోకి తెస్తే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని పలువురు సూచిస్తున్నారు.
ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు, ఉద్యోగులు : రాష్ట్రంలోని అనేక గ్రామాలకు బస్సు సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు, కూలీలు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అవసరాలరీత్యా ప్రయాణాలు చేస్తున్న ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. బస్సులు సమయానికి లేకపోవడం, తక్కువగా ఉండడంతో వారంతా ఆటోలు, ప్రైవేటు వాహనాల్లో వెళ్లడం తప్పడం లేదు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల ప్రయాణికులు మాత్రం బస్టాండ్లలో గంటల తరబడి వేచిచూడాల్సి వస్తోంది.
ఆర్టీసీలో 100 శాతం దాటుతోన్న ఆక్యుపెన్సీ - రిపేర్ల కోసం షెడ్లకు క్యూ కడుతోన్న బస్సులు