Nominations Scrutiny Issue in AP: గుడివాడ వైసీపీ అభ్యర్థి కొడాలి నాని నామినేషన్ పత్రాల్లో లోపాలున్నా కనీసం పరిశీలించకుండా, అభ్యంతరాలు వినేందుకు ఆసక్తి చూపించకుండా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఆర్డీవో పద్మావతి ఏకపక్షంగా వ్యవహరించి సంతకం పెట్టేయడం తీవ్ర వివాదాస్పదమైంది. కొడాలి నాని అఫిడవిట్‌లో అభ్యంతరాలున్నాయని తెలుగుదేశం నేతలు చెబుతున్నా ఆమె పట్టించుకోలేదు. పైగా ప్రశ్నిస్తే బయటకు పంపేస్తానంటూ, మీపై చర్యలు తీసుకుంటానంటూ పెద్దగా అరుస్తూ బెదిరించారు. ఆర్వో తీరుతో తెలుగుదేశం నేతలు ఆగ్రహానికి గురయ్యారు. ఎన్నికల అఫిడవిట్‌లో ఎమ్మెల్యే కొడాలి నాని తప్పుడు సమాచారం పొందుపరిచారని వారు ఆరోపించారు. తమ అభ్యర్థనను ఆర్వో పట్టించుకోకుండా ఏక పక్షంగా వ్యవహరించారని ధ్వజమెత్తారు.
గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని నామినేషన్ పత్రాలలో తప్పుడు సమాచారం ఇచ్చారని సాగుతున్న వివాదంలో కృష్ణా జిల్లా ఎన్నికల అధికారి డి.కె. బాలాజీ స్పందించారు. ఆయన ఆదేశాలతో గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి పి. పద్మావతి స్పందించి, కొడాలి నాని నామినేషన్ తిరస్కరణకు తమ వద్ద ఉన్న ఆధారాలు సమర్పించాలని శుక్రవారం రాత్రి టీడీపీ నాయకుడు కె.తులసిబాబుకు నోటీసులిచ్చారు.
రజిని అఫిడవిట్‌లో లెక్కలేనన్ని తప్పులు: మంత్రి విడదల రజిని అఫిడవిట్‌లో లెక్కలేనన్ని తప్పులున్నాయని తెలుగుదేశం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు కనపర్తి శ్రీనివాసరావు, మద్దిరాల మ్యాని విమర్శించారు. విడదల రజిని అఫిడవిట్‌లో 2021లో వార్షికాదాయం 3లక్షల 96 వేల 400గా మాత్రమే పేర్కొన్న రజిని, పెదపలకలూరులో 4 కోట్ల 55 లక్షల 56 వేల 500 విలువ కలిగిన భూమిని ఎలా కొన్నారో చెప్పాలన్నారు. శ్యామలనగర్లో స్థలం కొని, అత్యాధునికంగా ఇంటీరియర్ వర్క్ చేయించారని, ఎన్నికల అధికారిణికి తాము సాక్ష్యాధారాలతో విన్నవించినా ఏక పక్షంగా ఆమె నామినేషన్‌ను ఆమోదించడం దుర్మార్గమని వారు ధ్వజమెత్తారు.
గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా ఈనెల 25న నామినేషన్ దాఖలు చేయడానికి సిద్ధమైన ఏసుభక్తనగర్‌కు చెందిన విడదల రజిని అనే ఎస్సీ మహిళను వైసీపీ నేతల ఒత్తిడితో నగరంపాలెం పోలీసులు అపహరించారని పేర్కొంటూ శుక్రవారం హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలైంది. రజినిని అభ్యర్థిగా బలపరుస్తూ సంతకం చేసిన వ్యక్తి, గుంటూరుకు చెందిన పఠాన్ అస్మతుల్లా ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఆమెను కోర్టులో హాజరు పరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరారు. బాధ్యులైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. రాజకీయ ఒత్తిడితో పోలీసులు రజనిని వేధిస్తున్నారని, నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రజినిని, ఆమె భర్తను ఎక్కడ నిర్బంధించారో పోలీసులు చెప్పడంలేదని చెప్పారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని రజని తోపాటు ఆమె భర్త అనురాగరావును కోర్టులో హాజరు పరిచేలా ఆదేశించాలని కోరారు.
వేమిరెడ్డి నామినేషన్‌పై విజయసాయిరెడ్డి అభ్యంతరాలు: నెల్లూరు లోక్‌సభ టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నామినేషన్‌పై వైసీపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి పలు అభ్యంతరాలు తెలిపారు. ఆస్తులన్నీ చూపలేదని, అందువల్ల తిరస్కరించాలని కోరారు. తర్వాత నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్‌కుమార్ యాదవ్ చేరుకుని వివరణ ఇవ్వడంతో కలెక్టర్ హరినారాయణన్ విజయసాయిరెడ్డి అభ్యంతరాలను తోసిపుచ్చి వేమిరెడ్డి నామినేషన్‌ను ఆమోదించారు.
ఉత్కంఠ నడుమ ఆమోదం: నంద్యాల జిల్లా డోన్ అసెంబ్లీ స్థానానికి వైసీపీ అభ్యర్థి, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి నామినేషన్‌ను తీవ్ర ఉత్కంఠ నడుమ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆమోదించారు. ఈ సందర్భంగా డోన్‌లో రోజంతా హైడ్రామా నడిచింది. బుగ్గన ఈనెల 22వ తేదీన నామినేషన్ పత్రాలతో పాటు సమర్పించిన అఫిడవిట్లో కొన్ని కాలమ్స్‌ను నింపకుండా ఖాళీగా వదిలేశారు. ఇది నిబంధనలకు విరుద్ధమని టీడీపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తరఫు న్యాయవాదులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
నామినేషన్ తిరస్కరించడానికి బలమైన కారణాలున్నాయని వాదించారు. జిల్లా ఎన్నికల అధికారికి సమాచారమిచ్చి తగిన నిర్ణయం తీసుకుంటానని ఆర్వో తొలుత పెండింగ్‌లో పెట్టారు. అధికారులు ఇచ్చిన నోటీసులకు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తరఫు న్యాయవాదులు సాయంత్రం సమాధానాలిచ్చారు. వాటి ఆధారంగా నామినేషన్ను ఆమోదిస్తున్నట్లు సాయంత్రం 6 గంటలకు ఆర్వో ప్రకటించారు.