Train Ticket Reservation for Sankranti Festival : సంక్రాంతి పండుగ ప్రయాణాలు అంటే ఎలా ఉంటుందో తెలుగు ప్రజలకు చెప్పనక్కర్లేదు. పండుగకు రెండు మూడు నెలల ముందే సొంతూళ్లకు వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటారు. సమయానికి టికెట్లు దొరకవని మూణ్నెళ్ల ముందుగానే టికెట్లు బుక్ చేసుకుంటారు. అయితే ఈసారి నాలుగు నెలల ముందే టికెట్లు బుక్ చేసుకుందామనుకున్నా ఒక్క ట్రైన్ టికెట్ దొరకడం లేదు.
ఈసారి దసరా, దీపావళి పండగలు రాకముందే సంక్రాంతి రైలు టిక్కెట్లకు పెద్దఎత్తున డిమాండ్ పెరిగింది. సంక్రాంతికి ఊళ్లకు వెళ్లే ప్రయాణికులకు నెలల ముందు నుంచే గుబులు పుడుతోంది. సంక్రాంతి పండుగకు కుటుంబంతో కలిసి హాయిగా గడిపేందుకు సుదూర ప్రాంతాల్లో ఉన్నవారు స్వస్థలాలకు వెళ్తారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే వారి సంఖ్య ఎక్కువ. ఆంధ్రా వాసులు ఎక్కువగా రైలు ప్రయాణాన్నే ఎంచుకుంటారు. దీంతో ప్రధాన రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు టికెట్ బుక్ చేసుకుందామని చూస్తే చాంతాడంతా లిస్టు కనిపిస్తోంది. ఏ రైలు చూసినా వందల సంఖ్యలో వెయిటింగ్ లిస్ట్ అని చూపిస్తోంది.
4 నెలల ముందే పూర్తయిన రిజర్వేషన్లు : ఇప్పుడు వెయిటింగ్ లిస్ట్ టికెట్లయినా తీసిపెట్టుకుంటే సంక్రాంతి నాటికి రిజర్వేషన్ అవుతుందని ఆశపడేవారికీ నిరాశే మిగులుతోంది. జనవరి 10,11,12 తేదీల్లో గరీబ్‌రథ్, విశాఖ, ఫలక్‌నుమా వంటి ప్రధాన రైళ్లన్నీ రిగ్రెట్ చూపుతున్నాయి. గరిష్ఠంగా 120 రోజుల ముందు రైళ్లకు టిక్కెట్ రిజర్వేషన్ చేసుకోవచ్చు. జనవరిలో మొదలయ్యే సంక్రాంతి పండుగ ప్రయాణానికి సెప్టెంబరు నెల నుంచే లక్షల మంది ప్రయత్నించారు. సికింద్రాబాద్, హైదరాబాద్, కాచీగూడ స్టేషన్ల నుంచి ఏపీ వైపు వెళ్లే అన్ని రైళ్లలో రిజర్వేషన్లు పూర్తయ్యాయి. కొన్ని ప్రధాన రైళ్లలో వెయిటింగ్ జాబితా కూడా రిగ్రెట్ వస్తోంది.
భారీ వెయిటింగ్ లిస్ట్ : వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లోనూ సంక్రాంతి పండుగకు రిజర్వేషన్లు ముందే చేసుకున్నారు. ఒక్కో రైల్లో వందల సంఖ్యలో వెయిటింగ్ లిస్టు ఉంది. ప్రయాణికులు బస్సుల బాట పట్టాలని చూస్తున్నారు. జనవరి 11న ప్రయాణానికి విశాఖ ఏసీ ఎక్స్‌ప్రెస్‌లో థర్డ్ ఏసీలో 341, జన్మభూమిలో 238, ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో 197 వెయిటింగ్ లిస్టు చూపుతోంది.
- జనవరి 10న జన్మభూమిలో 100, ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో 160 మంది నిరీక్షణలో ఉన్నారు.
- 12వ తేదీన రెండు వందే భారత్ రైళ్లలో 255 మంది ఈస్ట్‌కోస్ట్‌లో అన్ని తరగతుల్లో 221 మంది వెయిటింగ్‌లిస్టు జాబితాా ఉంది.
- పద్మావతి, నారాయణాద్రి, చెన్నై ఎక్స్‌ప్రెస్ రైళ్లలో 10,12 తేదీల్లో చాలా వెయిటింగ్ లిస్టు ఉంది.
- సికింద్రాబాద్ నుంచి వరంగల్, ఖమ్మం వెళ్లేవారికీ విశాఖ గరీబ్‌రథ్, ఈస్ట్‌కోస్ట్, చార్మినార్, సింహపురి, కోకనాడ, గోదావరి, ఎక్స్‌ప్రెస్ వంటి రైళ్లలో రిజర్వేషన్ అసలే దొరకట్లేదు. కొన్ని రైళ్లలో రిగ్రెట్ చూపుతోంది.
- శాతవాహన, గుంటూరు ఇంటర్‌సిటీ, గోల్కొండ, కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లలో మాత్రం 10, 11, 12 తేదీల్లో కొద్ది సంఖ్యలో సీట్లున్నాయి.