No AC in Cabs Telangana : ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జనాలు వేసవి తాపానికి వేడెక్కిపోతూ ఉంటే నగరంలో నడిచే క్యాబ్ డ్రైవర్ల తీరు వారికి నెత్తిన కుంపటి పెట్టినట్లు మారింది. అసలే గ్రేటర్ పరిధిలో ఉష్ణోగ్రతలు రోజుకు 42 డిగ్రీలు దాటుతున్నాయి. ఈ వేడికి నగరంలోని ప్రయాణికులు ఎయిర్‌పోర్టు, రైల్వే స్టేషన్లు, వేరే ఎక్కడికైనా చేరుకోవాలన్నా చాలా మంది క్యాబ్‌ల మీదే ఆధారపడాల్సిన పరిస్థితి వస్తోంది. ఎందుకంటే ఉబర్, ఓలా, ర్యాపిడో సంస్థలు అందించే అతి తక్కువ ఖర్చుతో సౌకర్యవంతంగా ఏసీ కారులో ఏం చక్కా ఎండకు దొరక్కుండా వెళ్లేందుకు అవే ది బెస్ట్ అని వాటినే చాలా మంది ప్రయాణికులు కోరుకుంటున్నారు.
T Cab Drivers No AC Campaign : ఇక్కడే ఒక చిక్కుముడి వచ్చి పడింది. క్యాబ్ బుక్ చేసుకున్న తర్వాత తీరా అది వచ్చాక అందులో కూర్చుంటే ఏసీ లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏసీ ఆన్ చేయమంటే టిప్ లేదా అదనపు ఛార్జీలు చెల్లిస్తే వేస్తామని క్యాబ్ డ్రైవర్లు చెబుతున్నారు. ఈ విషయంలో మాత్రం తమను అర్థం చేసుకోవాలని ప్రయాణికులను కోరుతున్నారు. జంట నగరాల్లోని ఓలా, రాపిడో(Rapido), ఉబర్ అగ్రిగేటర్ సంస్థల తరఫున క్యాబ్‌లు నడుపుతున్న డ్రైవర్లు రెండు రోజులుగా ఈ నో ఏసీ క్యాంపెయిన్(No AC Campaign in Cabs)ను నడిపిస్తున్నారు.
ఏసీతో నడిపించాలంటే అగ్రిగేటర్ సంస్థలు చెల్లించే కమీషన్ సరిపోవడం లేదని తెలంగాణ గ్రిగ్ అండ్ ప్లాట్‌ఫాం వర్కర్ల యూనియన్(TGPWU) తమ వాదనలు వినిపిస్తోంది. ఈ విషయంలో కమీషన్లు పెంచాలని వారి దృష్టికి తీసుకెళ్లినట్లు యూనియన్ చెబుతోంది. లేదంటే పక్క రాష్ట్రం కర్ణాటక మాదిరి క్యాబ్‌లకు యూనిఫాం ధరలు(Uniform Prices for Cabs) అమలు చేయాలని కోరుతుంది.
రాష్ట్రంలో పట్టపగలే చుక్కలు చూపిస్తోన్న సూరీడు - గడప దాటేందుకు జంకుతున్న ప్రజలు
ప్రయాణికులు అసహనం : క్యాబ్ డ్రైవర్లు(Cab Drivers) ఇలా చేయడం పట్ల ప్రయాణికులు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పీక్ అవర్స్, ఇతర ఛార్జీల పేరుతో కొన్నిసార్లు తక్కువ దూరానికి కూడా అధిక ఛార్జీలను వసూలు చేస్తున్నారన్నారు. ఇప్పుడు ఏసీ సేవల పేరుతో అదనంగా ఎలా చెల్లిస్తామని ప్రశ్నిస్తున్నారు. డ్రైవర్లతో వాదనలకు దిగుతూ ఆయా సంస్థలకు ఫిర్యాదు చేస్తున్నారు. ఛార్జీ సరిపోకపోతే ఆయా అగ్రిగేటర్ సంస్థలతో తేల్చుకోవాలని, తీరా క్యాబ్ బుక్ చేసుకున్న తర్వాత ఏసీ ఆన్ చేయం అంటే ఎలా అని ఈ చర్యలతో తాము తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని అసహనం వ్యక్తం చేశారు.
క్యాబ్ డ్రైవర్లకు అగ్రిగేటర్ సంస్థల వార్నింగ్ : ప్రయాణికులే తమకు కీలకమని, వారిని ఇబ్బందులు పెట్టాలని కాదని దయచేసి అర్థం చేసుకోవాలని క్యాబ్ డ్రైవర్లు కోరుతున్నారు. తక్కువ కమీషన్‌పై ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు. మరోవైపు అగ్రిగేటర్ సంస్థలు మాత్రం మరోలా బదులిస్తున్నాయి. డ్రైవర్లు కారులో ఏసీ ఆన్ చేయకపోతే చర్యలు తప్పవని హెచ్చరించాయి. ట్రిప్ ఛార్జీల్లో 25 శాతం కోతతో పాటు అకౌంట్‌ను తాత్కాలికంగా బ్లాక్ చేస్తామని చెప్పాయి. అలాగే వారం వారీగా ఇన్సెంటివ్స్ పొందే అర్హతను కోల్పోతారని హెచ్చరించారు. ఇదిలా ఉండగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఈ 'నో ఏసీ క్యాంపైన్‌పై తగ్గేదే లే' అంటూ డ్రైవర్లు చెబుతున్నారు.
రాష్ట్రంలో భానుడి భగభగలు- నాలుగు జిల్లాల్లో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
మండుటెండలో బస్సుల కోసం నిరీక్షణ - బస్ షెల్టర్లు లేక ప్రయాణికుల నరకయాతన