Nizamabad Girl Excels In Kuchipudi Dance : చూడముచ్చటగా నృత్యం చేస్తూ ఇట్టే ఆకట్టుకుంటోంది ఈ అమ్మాయి. కూచిపూడిలోని కళాకృతులన్నింటినీ ఔపోసపట్టి వివిధ రకాల భంగిమలతో ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. రాష్ట్ర, జాతీయస్థాయిలో అనేక ప్రదర్శనలిచ్చింది. చిన్నవయసులోనే అంతర్జాతీయ సాంస్కృతిక సదస్సులో పాల్గొని బృందావనం నృత్యంతో అభినందనలు అందుకుంది.
తల్లిదండ్రుల ప్రోత్సాహంతో : నిజామాబాద్ జిల్లాకు చెందిన ఈ అమ్మాయి పేరు మహతి. ఆర్కిడ్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. తల్లిదండ్రులు మాధవి, మురళీధర్ ప్రోత్సాహంతో 2019 నుంచి కూచిపూడి శాస్త్రీయ నృత్యంలో శిక్షణ తీసుకుంటోంది. ప్రముఖ నాట్య కళాకారిణి సాయిరవళి శిక్షణలో అనతి కాలంలోనే విదేశాల్లో ప్రదర్శనలు ఇచ్చే స్థాయికి ఎదిగింది మహతి. కూచిపూడిలో ఇంతగా రాణించడానికి తన తల్లిదండ్రులే కారణమని చెబుతోంది.
200పైగా కూచిపూడి నృత్య ప్రదర్శనలు : కూచిపూడిలో ఇప్పటివరకు 200కు పైగా ప్రదర్శనలిచ్చింది మహతి. ఇదంతా శిక్షణ ఇస్తున్న టీచర్ ప్రోత్సాహంతోనే సాధ్యమైందని అంటోంది. అనేక జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం దక్కిందని చెబుతోంది. ఈమె 2023లో జరిగిన కళోత్సవంలో పాల్గొని విజేతగా నిలిచింది. వీటన్నిటి ఫలితంగానే మలేషియాలో ప్రదర్శన ఇచ్చే అవకాశం దక్కిందని చెబుతోంది.
నృత్య ప్రదర్శనలకు వెళ్లాలనుకున్నప్పుడు ఆర్థిక సమస్యలు వెంటాడాయని చెబుతోంది మహతి. అయితే తన టీచర్‌తోపాటు తల్లిదండ్రులు చాలా కష్టపడి డబ్బులు సమకూర్చారని తెలిపింది. కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఇస్తున్నా చదువును ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదని అంటోంది. అందువల్లే పరీక్ష ఫలితాల్లో ప్రతి సారి ఉత్తమ రిజల్ట్స్ సాధించానని చెబుతోంది.
డాక్టర్ కావడమే లక్ష్యం : కొన్నిసార్లు మహతికి ఆరోగ్యం సహకరించకున్నా నృత్యంలో అద్భుతమైన ప్రదర్శనలిచ్చిందని చెబుతున్నారు ఈమె తల్లిదండ్రులు. ఆమె ఆసక్తిని గమనించే కూచిపూడి నృత్యంలో శిక్షణను ఇప్పిస్తున్నామని అంటున్నారు. భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకుని ఆమె పదిమందికి అండగా నిలవాలని కోరుకుంటున్నారు.
తన దగ్గర శిక్షణ తీసుకుంటున్న వారందరికీ మహతి రోల్ మోడల్ అని అంటున్నారు ఆమె టీచర్ సాయిరవళి. ఉదయాన్నే నృత్యానికి సంబంధించిన తరగతులకు హాజరవుతూనే మళ్లీ పాఠశాలకు వెళ్లేదని, ఇదే పట్టుదలతో సాధన చేస్తే భవిష్యత్తులో అనుకున్నది సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కూచిపూడిలో రాణిస్తూనే డాక్టర్ కావడమే తన లక్ష్యమని చెబుతోంది మహతి మెడిసిన్ చదివి ప్రజా వైద్యురాలిగా ప్రజలకు సేవ చేయాలని ఉందని అంటోంది. కూచిపూడి అకాడమీ స్థాపించి అనేక మందిని నృత్య కళాకారులుగా తయారుచేస్తానని ధీమాగా చెబుతోంది మహతి .