Nine People Died Due to Rains in Telangana : తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎక్కడికక్కడ వాగులు, వంకలు పొంగి పొర్లడంతో జనజీవనం అస్తవ్యస్తం అయింది. భారీ వర్షాలు, వరదల కారణంగా ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు రాష్ట్రంలో 9 మంది మృతి చెందినట్లు రెవెన్యూశాఖ మంత్రి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. వరంగల్‌లో ఐదుగురు మృతి చెందగా, సూర్యాపేట జిల్లాలో ఇద్దరు, ఖమ్మం జిల్లాలో ఇద్దరు మృతి చెందారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు అత్యధికంగా ఐదుగురు మృతి చెందారు. సింగరేణి మండలం గేట్ కారేపల్లి గంగారం తండాకు చెందిన తండ్రీ కుమార్తె వరద ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఆయన కుమార్తె అశ్విని వ్యవసాయ శాస్త్రవేత్తగా రాయ్‌పూర్‌లో విధులు నిర్వహిస్తోంది. తండ్రితో కలిసి కారులో హైదరాబాద్ బయలుదేరగా మార్గమధ్యలో వరదలో చిక్కుకుపోయి కొట్టుకుపోయాపరు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలో మందపల్లికి చెందిన భిక్షాటన చేసుకొనే వృద్ధురాలు మరణించింది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పశువులను మోతకు తీసుకెళ్లి వస్తుండగా వరద ప్రవాహానికి కొట్టుకుపోయి మృతి చెందాడు. పరకాల గ్రామానికి చెందిన మరో వ్యక్తి చెరువులో చేపల వేటకు వెళ్లి గల్లంతై చివరికి శవంగా బయటకువచ్చాడు.
మరోవైపు ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని నాయకన్ గూడెంలో పాలేరు వాగులో దంపతులు వరదనీటిలో కొట్టుకుపోయి చనిపోయారు. పాలేరు అలుగు సమీపంలో ఉన్న సిమెంటు ఇటుకల తయారీ కర్మాగారంలో ఓ కుటుంబం నివసిస్తోంది. పాలేరు జలాశయానికి ఆదివారం తెల్లవారుజాము నుంచి వరద పోటెత్తడంతో షేక్ యాకుబ్, భార్య సైదాబి, కుమారుడు షరీఫ్ వరదల్లో చిక్కుకుపోయారు. వరద ఉద్ధృతి పెరగడంతో ప్రవాహంలో గల్లంతయ్యారు. కొట్టుకుపోతున్న షరీఫ్‌ను స్థానికులు, పోలీసులు కాపాడారు.
ఉమ్మడి సూర్యాపేటజిల్లా కోదాడలో వరద నీటిలో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. రాత్రి భారీ వర్షం కారణంగా కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి. కొట్టుకుపోయిన ఓ కారులో రవి అనే వ్యక్తి మృతదేహం లభ్యమైంది. శ్రీనివాస నగర్‌కు చెందిన టీచర్ వెంకటేశ్వర్లు శనివారం రాత్రి బైకుపై ఇంటికి వెళ్తూ వరదలో గల్లంతయ్యారు. ఆయన మృతదేహం ఇవాళ వరద నీటిలో లభ్యమైంది.
పెద్దపల్లి జిల్లాలో మల్యాల వాగులో ఇద్దరు గల్లంతు : పెద్దపల్లి జిల్లాలో మల్యాల వాగులో ఇద్దరు గల్లంతు అయ్యారు. కాల్వశ్రీరాంపూర్ మండలం మల్యాల వద్ద వాగు దాటుతూ ఈ ఇద్దరు గల్లంతైయ్యారు. వాగులో కొట్టుకుపోతూ చెట్టుని ఒక యువకుడు పట్టుకున్నాడు. ఆ యువకుడిని కాపాడేందుకు స్థానికులు యత్నించారు. గల్లంతైన మరో యువకుడి కోసం రెస్క్యూ టీం గాలిస్తోంది. వాగులో గల్లంతైన వ్యక్తి మీర్జంపేట పంచాయతీ బిల్ కలెక్టర్.
250 మందిని అగ్నిమాపక, విపత్తు నిర్వహణ : ఉమ్మడి వరంగల్, నల్గొండ జిల్లాల్లో వరద సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి. అగ్నిమాపక, విపత్తు నిర్వహణ సిబ్బంది సహాయక చర్యలు ముమ్మరం చేశారు. కోదాడలో ముంపు బాధితులను బోట్ల సాయంతో సిబ్బంది కాపాడారు. మహబూబాబాద్ జిల్లా సీతారాం తండాలో వరద బాధితులను అగ్నిమాపక సిబ్బంది కాపాడారు. పలు చోట్ల 250 మందిని అగ్నిమాపక, విపత్తు నిర్వహణ సిబ్బంది కాపాడారు.