Rameshwaram Cafe Blast Case Updates : బెంగళూరులోని రామేశ్వరం కెఫ్‌లో పేలుడు కేసు దర్యాప్తులో భాగంగా జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) మంగళవారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడుల్లోని మొత్తం 11 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించింది. ఈ మేరకు ఎన్‌ఐఏ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ సంవత్సరం మార్చి 1న జరిగిన రామేశ్వరం కెఫ్ పేలుడులో పలువురు గాయపడ్డ సంగతి తెలిసిందే.
NIA Conduct Raids in Four States 2024 : ఈ ఘటనకు సూత్రధారులుగా భావిస్తున్న ముస్సవిర్ హుస్సేన్ షాజీబ్, అబ్దుల్ మతీన్ తాహాలను కోల్‌కతాలో గత ఏప్రిల్ 12న ఎన్‌ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. వారిని విచారించినప్పుడు వెల్లడైన అంశాల ఆధారంగా పేలుడుకు సహకరించిన వారి కోసం దేశవ్యాప్తంగా గాలిస్తున్నారు. ప్రధాన నిందితులకు మరో 11 మంది సహకరించినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. దర్యాప్తులో భాగంగా మంగళవారం నాడు తెలంగాణలో ఎన్‌ఐఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలోనే వికారాబాద్ జిల్లా పూడురుకు చెందిన ఒక యువకుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. 2012లో వెలుగుచూసిన బెంగళూరు కుట్ర కేసులో శిక్షపడ్డ హైదరాబాద్‌కు చెందిన ఒబేద్ ఉర్ రెహమాన్ ఇంట్లోనూ దాడులు చేపట్టారు.
'రామేశ్వరం కేఫ్‌లో జరిగింది బాంబ్ బ్లాస్టే'- సీఎం వెల్లడి- రంగంలోకి NIA
ఏపీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అరెస్ట్ : మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఎన్‌ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలోనే అనంతపురం జిల్లా రాయదుర్గానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సోహైల్‌ను అధికారులు అరెస్ట్ చేశారు. అతణ్ని ఏడు గంటల పాటు విచారించిన వారు బెంగళూరుకు తరలించారు. రాయదుర్గం వేణుగోపాలస్వామి వీధిలో నివాసముంటున్న విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు అబ్దుల్‌కు సోహైల్, మథిన్ అనే ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు సోహైల్ బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఏడాదిగా వర్క్ ఫ్రం హోం చేస్తున్నాడు.
గతంలో సోహైల్ బెంగళూరులోని ఓ పీజీ గదిలో ఇద్దరు మిత్రులతో కలిసి ఉండేవాడు. రెండు నెలల కిందట రామేశ్వరం కెఫేలో జరిగిన బాంబు పేలుడు ఘటనలో నిందితుడు సోహైల్ స్నేహితుడిని ఎన్‌ఐఏ అధికారులు గుర్తించారు. అతడితో కలిసి సోహైల్ హైదరాబాద్‌కు వెళ్లేవాడని తెలిసింది. బాంబు పేలుడు ఘటన నిందితుడితో పలుమార్లు వాట్సప్‌లో మాట్లాడటం, చాటింగ్ చేయటం వంటివి గుర్తించిన అధికారులు సోహైల్ కదలికలపై నిఘా ఉంచారు. సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా రాయదుర్గంలోని తన ఇంట్లో ఉన్నట్లు గుర్తించి అతణ్ని అరెస్ట్ చేశారు.
అసలేం జరిగిదంటే : బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో మార్చి 1న మధ్యాహ్నం ఐఈడీ బంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 10 మందికి గాయాలయ్యాయి. మొదట గ్యాస్ సిలిండర్ పేలుడు వల్ల జరిగిన ప్రమాదంగా పోలీసులు భావించారు. అయితే ఘటనాస్థలంలో ఓ హ్యాండ్ బ్యాగ్ పేలినట్లు కనిపించడం వల్ల వారు అప్రమత్తమయ్యారు. ఈ కేసును కర్ణాటక హోం శాఖ ఎన్ఐఏకు అప్పగించగా, పేలుడుకు ఆర్‌డీఎక్స్ కారణమని తేల్చారు. ఈ ఘటనకు సూత్రధారులైన ఇద్దరిని అధికారులు అరెస్ట్ చేశారు.