New Trends in Cyber Frauds in Telangana : దొంగతనాల్లో ఇప్పుడు అంతా నయా ట్రెండ్. దొంగలకు లింక్‌లే ఆయుధాలు ఎదుటి వ్యక్తి నమ్మకమే వాళ్ల యాప్‌లలో పెట్టుబడి. వెరసి అన్నీ టెక్ దొంగతనాలే. కూర్చున్న చోటు నుంచే లక్షలు కొల్లగొట్టేస్తున్నారు. ఇటీవలి కాలంలో ఈ ధోరణి ఇంకా పెరిగిపోతోంది. పిగ్ బచ్చరింగ్ స్కామ్‌కు కొనసాగింపుగా ఫిషింగ్ స్కామ్ కొత్త అవతారమెత్తింది. చైనాతో పాటు ఇతర ఆసియా దేశాలకు చెందిన నేరగాళ్లు చేస్తున్న ప్రయత్నాలివి. వలపు వల వేసి, నమ్మించి పెట్టుబడులు పెట్టేలా చేయడం పిగ్ బచ్చరింగ్. దానికి కొనసాగింపుగానే ప్రసిద్ధ పెట్టుబడి యాప్‌లకు సారుప్యత కలిగిన నకిలీ యాప్ లింక్‌లను సృష్టించి వినియోగదారులను మోసం చేయడం ఫిషింగ్ స్కామ్. కాగా ఇటీవలి కాలంలో ఈ కొత్త నేర పంథా పెరిగిపోతోంది.
చోరీలు పాతకథ, ఇప్పుడంతా సైబర్ నేరాలే - గణనీయంగా పెరుగుతున్న కేసులు
ఇలాంటి ఫిషింగ్ స్కామ్‌లు ఇటీవలి కాలంలో పెరిగిపోయాయని ఆర్థికరంగ నిపుణులు చెబుతూనే ఉన్నారు. ఆ నేరగాళ్ల ప్రధాన ఆయుధం ఏంటంటే ప్రముఖ పెట్టుబడి యాప్‌లకు సారుప్యంగా ఉండేలా వాళ్ల లింక్‌లు క్రియేట్ చేసి బాధితులను నమ్మించడం. అలా ఫేస్‌బుక్‌లో వచ్చిన ప్రకటన చూసి, నమ్మి హైదరాబాద్‌కి చెందిన ఓ అడ్వకేట్ రూ.85 లక్షలు ముట్టజెప్పుకున్నాడు. ఐటీ రంగానికి చెందిన మరో వ్యక్తి మరో వ్యక్తి రూ.55 లక్షలు మోసపోయాడు. వృత్తిరీత్య సీఎ అయిన మరో వ్యక్తి నకిలీ ట్రేడింగ్ యాప్‌లింక్‌లు గుర్తించలేక రూ.91 లక్షలు నష్టపోయినట్లు క్రైమ్స్, సిట్ జాయింట్ కమిషనర్ ఏవీ రంగనాథ్ వెల్లడించారు.
"ఇటీవలి కాలంలో ఇన్వెస్టిమంట్, ట్రేడింగ్ పేరిట సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. రెండింటిలో ఒకటే విధానం పాటిస్తారు. బాధితులను సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా కాంటాక్ట్ అవుతారు. యాడ్ రూపంలో ఇస్తుంటారు. తక్కువ సమయంలోనే ఎక్కువ సంపాదించవచ్చు అంటూ ఆకట్టుకుంటారు. లింక్స్ పంపిస్తారు. డబ్బులు పెట్టమంటారు తిరిగి వాళ్లు పంపిస్తారు నమ్మకం వచ్చాకా ఎక్కువ డబ్బులు ట్రెడింగ్లో పెట్టేలా చేస్తారు. తర్వాత ఫ్రాడ్ చేసిన వాళ్ల దగ్గర నుంచి వీళ్లకు ఎలాంటి రెస్పాన్స్ ఉండదు. డబ్బులు మొత్తం పోయాక అప్పుడు వీళ్లకు అర్థం అవుతుంది మోస పోయామని." - ఆర్.జీ. శివ మారుతి, ఏసీపీ
Pig Butchering Scams in Telangana : అందుకే తెలియని సంస్థల్లో పెట్టుబడులు పెట్టకూడదని, నకిలీ లింక్‌లకు స్పందించవద్దని, తక్కువ కాలంలో ఎక్కువ డబ్బు సంపాదిస్తామనే దురాశ పనికి రాదని చెబుతున్నారు. సెబీకి అనుబంధంగా ఉన్న సంస్థల్లో తప్ప వేరే సంస్థల్లో పెట్టుబడులు పెట్టవద్దని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి విషయాలపై నేషనల్ సైబర్ సెక్యూరిటీ డ్రైవ్ పెనెట్రేషన్ టెస్టింగ్ కోసం ఎథికల్ హ్యాకర్లను సంప్రదించింది. ఏదేమైనప్పటికీ తెలియని లింక్‌లను ఓపెన్ చేయడం, పెట్టుబడులతో అధిక లాభాలు వస్తాయని మోసపోవద్దని, నిత్యం అప్రమత్తంగా ఉండాలని పోలీసులు, అధికారులు సూచిస్తున్నారు.
లాటరీ పేరుతో సైబర్ నేరగాళ్ల టోకరా - పదిహేను లక్షలకు పైగా పోగొట్టుకున్న ఆటోడ్రైవర్