Mobile App for Telangana Rythu Bima Scheme : రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటివరకు అమలు చేస్తున్న రైతుబీమా పథకం కోసం ఇక నుంచి మొబైల్ యాప్ను తయారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సాంకేతిక సమస్యలు నివారించి, పథకాన్ని సజావుగా అమలు చేసేలా రూపకల్పన చేస్తోంది. 18 నుంచి 60 ఏళ్లలోపు వయసు రైతు ఏ కారణం వల్లనైనా మరణిస్తే, ఆ కుటుంబానికి ఈ పథకం కింద రూ.5 లక్షల సాయం చేస్తున్నారు. ఆ పథకం కోసం జీవిత బీమా సంస్థకు పదేళ్లుగా రైతుల ప్రీమియంను సర్కారే చెల్లిస్తోంది. అయితే పథకం అమలులో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 10 శాతం మంది రైతు కుటుంబాలకు సాయం అందడం లేదు.
ఆధార్‌లో అచ్చు తప్పులు : వయో పరిమితి సమస్యకు తోడు ఆధార్‌లో అచ్చుతప్పులు, నామినీ పేర్లు సరిగా నమోదు కాకపోవడం, మరణ ధ్రువీకరణ పత్రాలు సకాలంలో అందకపోవడం తదితర కారణాల వల్ల రైతు కుటుంబాలకు సాయం అందట్లేదు. కొత్త రైతుల నమోదులోనూ సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ తరుణంలో పథకాన్ని మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు యాప్ అవసరమని వ్యవసాయ శాఖ గుర్తించింది. యాప్ ద్వారా రైతులు, నామినీల వివరాల నమోదుతో పాటు మరణ ధ్రువీకరణ పత్రాలను అప్‌లోడ్ చేయడం, సాయం చెల్లింపు వంటివి సులభతరమవుతాయని అధికారులు చెబుతున్నారు.
భూ సమస్యలు శాశ్వత పరిష్కారానికి చట్టాలు : మరోవైపు భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి అవసరమైన చట్టాలను తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముమ్మర కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా ధరణి కమిటీ సభ్యులు కర్ణాటక రాష్ట్రానికి వెళ్లారు. బెంగళూరులో రెవెన్యూ శాఖ మంత్రి కృష్ణ బైరేగౌడ్ను ధరణి కమిటీ సభ్యులు కలిశారు. కర్ణాటకలో అమలవుతున్న చట్టాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనేక సమస్యలపై కృష్ణ బైరే గౌడతో చర్చించారు. 20 ఏళ్లుగా భూసర్వే పూర్తి చేసుకొని సమస్యలు ఉత్పన్నం కాకుండా రిజిస్ట్రేషన్ సమయంలోనే సంబంధిత ఆస్తి మ్యాప్ కూడా పొందుపరుస్తున్నట్లు తెలిపారు. ఆ విధానాన్ని రాష్ట్రంలో కూడా ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ధరణి కొత్త బిల్లుపై ప్రజాభిప్రాయం - సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ఇదే వెబ్సైట్