New Electricity Circles in AP : రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆపరేషన్ సర్కిళ్లకు విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) సిబ్బందిని సర్దుబాటు చేశాయి. డిస్కంలపై ఆర్థికంగా భారం పడకుండా కొత్త సర్కిళ్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. ఈ మేరకు కార్పొరేట్ కార్యాలయంలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బందిని కొత్త సర్కిళ్లకు కేటాయించాయి. పర్యవేక్షక ఇంజినీర్లు/ఇంఛార్జ్‌లను నియమించాయి. ఇందుకు సంబంధించిన అంతర్గత మెమోలను సీఎండీ కార్యాలయాలు జారీ చేశాయి. కొత్తగా ఏర్పాటైన సర్కిళ్లు ఈరోజు నుంచి కార్యకలాపాలను ప్రారంభించనున్నాయి.
ఈపీడీసీఎల్‌లో ఆరు నూతన సర్కిళ్లు : ఈ నేపథ్యంలోనే సిబ్బంది బదిలీలతో పాటే కొత్త సర్కిళ్ల ఏర్పాటు, నియామకాలను తూర్పు విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్) పూర్తి చేసింది. డిస్కం పరిధిలో ప్రస్తుతం విజయనగరం, శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, విశాఖపట్నం, ఏలూరు సర్కిళ్లు ఉన్నాయి. జిల్లాల విభజన తర్వాత కొత్తగా మరో ఆరు సర్కిళ్లను ఏర్పాటు చేసింది. విశాఖపట్నం కేంద్రంగా విశాఖ సర్కిల్ (ప్రస్తుత రాజమహేంద్రవరం సర్కిల్) పార్వతీపురం కేంద్రంగా పార్వతీపురం మన్యం (ప్రస్తుతం విశాఖపట్నం సర్కిల్)ను ఏర్పాటు చేసింది.
ఏలూరు సర్కిల్‌ను విభజించి పాడేరు కేంద్రంగా అల్లూరి సీతారామరాజు, అమలాపురం కేంద్రంగా బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు కేంద్రంగా ఏలూరు, అనకాపల్లి కేంద్రంగా అనకాపల్లి, రాజమహేంద్రవరం కేంద్రంగా తూర్పుగోదావరి, కాకినాడ కేంద్రంగా కాకినాడ, భీమవరం కేంద్రంగా పశ్చిమగోదావరి సర్కిళ్లను ఏర్పాటు చేస్తూ సీఎండీ ఆదేశాలు ఇచ్చారు.
ఎస్‌ఈల నియామకం : కేంద్ర విద్యుత్ పంపిణీ సంస్థ (సీపీడీసీఎల్) పరిధిలో కొత్తగా ఏర్పాటు చేసిన సర్కిళ్లతో కలిపి మొత్తం ఏడు సర్కిళ్లకు సిబ్బందిని సర్దుబాటు చేస్తూ ఆ సంస్థ సీఎండీ రవి సోమవారం ఆదేశాలు ఇచ్చారు.
ఎస్‌పీడీసీఎల్ పరిధిలో కొత్తగా నాలుగు : దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ (ఎస్‌పీడీసీఎల్) పరిధిలో రాయచోటి, నంద్యాల, చిత్తురు, శ్రీ సత్యసాయి జిల్లాకు సంబంధించి పుట్టపర్తితో కలిపి నాలుగు కొత్త సర్కిళ్లను సర్కార్ ఏర్పాటు చేసింది. వాటి పర్యవేక్షణకు సంస్థ కార్పొరేట్ కార్యాలయం, ఇతర సర్కిళ్లలో ఉన్న సిబ్బందిని సర్దుబాటు చేస్తూ సంస్థ సీఎండీ సంతోషరావు ఉత్తర్వులు ఇచ్చారు.