Nepal Couple Robbery Gang in Hyderabad : ఇతర దేశాల నుంచి భారత్‌కు వలస వచ్చి వారికి తెలిసిన పని చేస్తూ గౌరవంగా జీవిస్తుంటారు. అందులో ఒకరు నేపాల్ దేశస్థులు. కానీ ప్రస్తుతం సీన్ రివర్స్ అయింది. పని చేస్తున్నట్లు నటించి, ఎంతో నమ్మకంతో ఉంటూ నిలువునా ముంచేస్తున్నారు. సంపన్నుల ఇళ్లలో పనివాళ్లుగా చేరి ఎంతో నమ్మకస్తులుగా నటించి అదును చూసి గ్యాంగ్‌ను రంగంలోకి దించి చోరీలకు పాల్పడుతున్నారు. ప్రస్తుతం ఈ ముఠాలోని మహిళను, ఆమె భర్తను షాద్‌నగర్ పోలీసులు అరెస్టు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నేపాల్ దేశానికి చెందిన ప్రసన్న బుద్వాల్, ప్రశాంత్ బుద్వాల్ తమ దేశానికి చెందిన కొందరితో కలిసి చోరీల బాట పట్టారు. నగరంలోని పనిమనిషిగా చేరి అక్కడే నమ్మకంగా పని చేస్తూ అవకాశం కోసం ఎదురు చూస్తారు. ఇంట్లో ఎవరు లేని సమయం చూసుకుని తమ గ్యాంగ్‌ను రంగంలోకి దించుతారు. దర్జాగా ఇంటిని లూటీ చేస్తారు. ఇదే ప్రణాళికతో నగరంలోని అయ్యప్ప కాలనీకి చెందిన గాదం రమేశ్ ఇంట్లో పని చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.
పక్కా ప్రణాళికతో పనిమనిషిగా : జూన్ 30న ఇంటి యజమాని తన కుటుంబ సభ్యులతో కలిసి బంధువుల దగ్గరకు వెళ్తున్నట్లు ప్రసన్న బుద్వాల్కు తెలిసింది. దీంతో ముఠాలోని భర్త ప్రశాంత్ బుద్వాల్తో పాటు కృష్ణ పశుపతి, బీమ్ సాహి, ఆకాశ్‌లకు సమచారం ఇచ్చింది. వెంటనే ముఠా సభ్యులు అక్కడి చేరుకుని ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్న 9 తులాల బంగారంతో పాటు రూ.2 లక్షల నగదును దోచుకెళ్లారు. అదే రోజు సాయంత్రం ఇంటికి వచ్చిన యాజమాని రమేశ్ దొంగతనం జరిగినట్లు గుర్తించి షాద్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బాధితుడి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా ఇంట్లో పనిచేసే ప్రసన్న బుద్వాల్ను విచారించగా అసలు విషయం బయట పడింది. అంతకుముందు నగరంలోని సాంబశివ కాలనీలో దొంగతనానికి పాల్పడినట్లు చెప్పింది. ముఠాలోని మిగతా సభ్యులు దొంగతనం చేసిన వెంటనే నేపాల్ దేశానికి వెళ్లిపోతారని తర్వాత ఆ సొమ్మును సమానంగా పంచుకుంటామని తెలిపింది. ప్రసన్న బుద్వాల్తో పాటు ఆమె భర్త ప్రశాంత్ బుద్వాల్ను పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి 13.5 తులాల బంగారంతో పాటు రూ. 25 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. ముఠాలోని మిగతా సభ్యులను త్వరలోనే అరెస్టు చేయనునట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న ముగ్గురు నేపాలీలను పట్టుకొని సొమ్మును రికవరీ చేస్తామని వెల్లడించారు.
విశ్రాంతి ఐఏఎస్ అధికారి ఇంట్లో భారీ చోరీ - 100 తులాల బంగారం అపహరణ