Transgender Hasini Murder Case : నెల్లూరు జిల్లాలో కలకలం సృష్టించిన ట్రాన్స్ జెండర్ హాసినిని గత నెల 26న అతి కిరాతకంగా హత్య చేశారు. రెండు కార్లలో వచ్చిన దుండగులు టపాతోపు అండర్ బ్రిడ్జి వద్ద హాసినిని అడ్డుకుని, కత్తులతో విచక్షణ రహితంగా దాడి చేసి పరారయ్యారు. స్థానికంగా ఈ హత్య తీవ్ర కలకలం రేపింది. ఈ హత్య కేసును సవాల్ గా తీసుకన్న పోలీసులు చివరకు కేసును చేధించారు. ఈ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి రావడంతో పోలీసులు సైతం అవాక్కైయ్యారు.
గత కొంతకాలంగా విభేదాలు : ట్రాన్స్ జెండర్ల నాయకులు హాసిని, అలేఖ్యల మధ్య ఆధిపత్య పోరే హత్యకు కారణమని జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ వెల్లడించారు. హత్య కేసులో 15 మంది ప్రమేయం ఉందని, వీరిలో 12 మందిని అరెస్ట్ చేశామన్నారు. పరారీలో ఉన్న ముగ్గురు నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు. ట్రాన్స్ జెండర్ల నాయకురాలుగా ఉన్న హాసిని, అలేఖ్యల మధ్య గత కొంతకాలంగా విభేదాలు ఉన్నాయని ఎస్పీ తెలిపారు. వీరిపై తిరుపతి, నెల్లూరు జిల్లాలో పలు కేసులు నమోదయ్యాయని చెప్పారు.
హాసినికి సులోచన, షీలా అనే ట్రాన్స్ జెండర్లతోను విభేదాలు ఉన్నాయన్నారు. దీంతో అలేఖ్య, సులోచన, షీలాలు కలిసి హాసినీని కొందరి సహాయంతో కొడవలూరు మండలం టపాతోపు రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద ఈ నెల 26న దారుణంగా హత్య చేయించారని తెలిపారు. హత్యలో పాల్గొన్న నిందితులంతా నెల్లూరు జిల్లాకు చెందిన వారేనని చెప్పారు. సాంకేతిక ఆధారాలతో కేసును చేదించి, నిందితులను చాకచక్యంగా అరెస్టు చేశామన్నారు. హాసిని కారు డ్రైవర్ పాత్రపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. కేసును చేదించిన కొడవలూరు, విడవలూరు పోలీసులను ఎస్పీ అభినందించారు.
హిజ్రా గ్రూపుల మధ్య ఘర్షణ - పరస్పరం రాళ్ల దాడులతో బెంబేలెత్తిన స్థానికులు
అసలేం జరిగింది : నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలో ట్రాన్స్ జెండర్ల నాయకురాలు హాసిని దారుణ హత్యకు గురయ్యారు. మండలంలోని టపా తోపు వద్ద అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. నెల్లూరులో నివాసముంటున్న హాసిని విడవలూరు మండలం పార్లపల్లిలోని ఆలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా రెండు కార్లలో వచ్చిన దుండగులు టపాతోపు వద్ద హాసినిని అడ్డుకున్నారు. కత్తులతో ఇష్టానుసారంగా దాడి చేసి పరారయ్యారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని హాస్పిటల్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే హాసిని మృతి చెందారు. మృతదేహాన్ని నెల్లూరు ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. హాసినికి నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పెద్ద సంఖ్యలో అనుచరులు ఉన్నారు. విషయం తెలుసుకున్న వీరంతా పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా మోహరించారు.
అప్పుడు అబ్బాయి, ఇప్పుడు అమ్మాయి! లింగ మార్పిడి చేయించుకుని ట్రాన్స్ ఉమెన్‌గా మారిన ప్రముఖులు వీరే!