Negligence on Rajiv Swagruha Flats: పేదలకు ఇళ్లు నిర్మించేందుకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ స్వగృహ సముదాయాన్ని తీసుకొచ్చింది. నరసరావుపేట లింగంగుంట్లలో 9 ఎకరాల విస్తీర్ణంలో 2009లో రాజీవ్ స్వగృహ సముదాయానికి శ్రీకారం చుట్టింది. 4 బ్లాకుల్లో డబుల్, సింగిల్ రూంలు కలిపి 280 ఇళ్ల నిర్మాణం చేపట్టారు. కార్పొరేషన్ నిబంధనలకు అనుగుణంగా సామాన్యులు డబ్బులు కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.
రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఆధ్వర్వంలో నిర్మించిన ఈ గృహాలను అపార్ట్మెంట్ తరహాలో నిర్మించడం, చదరపు అడుగులు తక్కువగా ఉన్నాయనే తదితర కారణాలతో లబ్ధిదారులు తీసుకునేందుకు ఆసక్తి చూపించలేదు. దీంతో 2014లో ఆర్ధిక సమస్యలతో ఈ రాజీవ్ స్వగృహ సముదాయం పనులు ఆగిపోయాయి. అప్పటికే 90 శాతం పనులను పూర్తి చేశారు.
ఆ ఇళ్లలో అసాంఘిక కలాపాలు- మద్యం, గాంజా మత్తులో బెదిరింపులు - VIJAYAWADA JNNURM HOUSES
ఆ తర్వాత 2019లో గద్దెనెక్కిన జగన్ సర్కార్ వీటిని పట్టించుకోలేదు. జిల్లాల విభజన తర్వాత నరసరావుపేట కేంద్రంగా పల్నాడు జిల్లా ఏర్పాటైంది. సొంత భవనాలు అందుబాటులో లేక పలు ప్రభుత్వ కార్యాలయాలను రాజీవ్ స్వగృహ సముదాయంలో ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. గదులను వివిధ శాఖలకు కేటాయించారు. అయితే విద్యుత్, నీటి సరఫరా లేకపోవడంతో అక్కడ కార్యాలయాలను నిర్వహించలేమని అధికారులు చేతులెత్తేశారు. 10 రోజులు తిరగకముందే అద్దె భవనాల్లోకి వెళ్లిపోయారు.
నాటి నుంచి ఈ గృహ సముదాయాన్ని అలాగే వదిలేశారు. పిచ్చిమొక్కలు పెరిగి చిట్టడివిని తలపిస్తోంది. పర్యవేక్షణ లేకపోవడంతో తలుపులు, కిటికీల్లో ఇనుప రాడ్లు, పైపులు దొంగలు ఎత్తుకెళ్లారు. కలెక్టర్ కార్యాలయం, ఎస్పీ కార్యాలయం ఎదురుగానే ఉన్నా ఈ గృహ సముదాయం అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా యువత ఈ సముదాయంలో మద్యం, గంజాయి తాగుతూ పరిసర ప్రాంత వాసులకు ఇబ్బంది కలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అదే విధంగా రాజీవ్ స్వగృహ సముదాయం ప్రారంభించిన సమయంలో లింగంగుంట్ల శివారు గ్రామంగా ఉండేది. జిల్లా ఏర్పాటు కావడం, కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలు ఇక్కడికే రావడంతో ఈ ప్రాంతంలో ఇళ్లకు, భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. మంచి డిమాండ్ ఉన్న ప్రాంతంలో కోట్లాది రూపాయలతో నిర్మించిన ఈ గృహాలను ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు అంటున్నారు.
కోట్లాది రూపాయలతో నిర్మించిన గృహాలను కూటమి ప్రభుత్వం పట్టించుకోవాలని కోరుతున్నారు. మౌలిక వసతులు కల్పించి ప్రభుత్వ కార్యాలయాలకు వినియోగించడమా, లేదా ఆసక్తి ఉన్న లబ్ధిదారులకు కేటాయించడమా అనే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిర్ణయం తీసుకుంటామని స్థానిక ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు తెలిపారు.
"రాజీవ్ స్వగృహాలను 2009లో కట్టారు. అయితే అప్పట్లో మాకు అపార్టుమెంట్లు వద్దు అంటూ చాలా మంది ముందుకు రాలేదు. అప్పటి నుంచి ఇవి నిరుపయోగంగా ఉన్నాయి. ఇక్కడ కొన్ని ఆఫీసులు ఏర్పాటు చేశారు. కానీ ఇందులో ఎటువంటి మౌలిక సదుపాయాలు లేకపోవడం వలన అద్దె ఇళ్లలో ఉంటున్నారు". - స్థానికుడు