Neelayapalem Vijay Kumar Comments: జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ గుట్టు బట్టబయలైందని టీడీపీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ ధ్వజమెత్తారు. ఏపీ ప్రజల ఆస్తులకు ఎసరుపెట్టారని ఆయన ఆరోపించారు. ల్యాండ్ టైట్లింగ్ చట్టంలో ఈ 'క్రిటికల్ రివర్' మతలబేంటని ప్రశ్నించారు. అమెరికా సాఫ్ట్ వేర్ కంపెనీ (క్రిటికల్ రివర్) చేతుల్లో ఏపీ ప్రజల ఆస్తుల వివరాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు.
ఆస్తుల పత్రాల స్టోరేజ్‌కు ప్రైవేటు కంపెనీకి కాంట్రాక్టు వాస్తవమేనా అని నిలదీశారు. డిజిటలైజేషన్, భద్రత కాంట్రాక్ట్‌ను 'క్రిటికల్ రివర్' కంపెనీకిచ్చారా అంటూ ధ్వజమెత్తారు. ప్రజల ఆస్తి పత్రాల భద్రత ప్రైవేటు సంస్థకు ఎందుకిచ్చారని మండిపడ్డారు. ఏపీలో క్రిటికల్ రివర్ కంపెనీకి ఒక్క బ్రాంచ్ కూడా లేని వైనమని అన్నారు. నేషనల్ ఇన్‌ఫర్‌మాటిక్స్ సెంటర్‌లో కాకుండా ప్రైవేటు సంస్థకిస్తారా అని మండిపడ్డారు.
ప్రైవేటు సంస్థకిస్తే ప్రజలకు బహిరంగ ప్రకటన ఇచ్చారా అని ప్రశ్నించిన విజయ్ కుమార్, ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించారా అని అడిగారు. కాలిఫోర్నియాలోని క్రిటికల్ రివర్ టెక్నాలజీస్‌కు కాంట్రాక్టు ఇచ్చారని, ఒకవేళ కాంట్రాక్టు ఇవ్వకపోతే పేపర్‌లో వచ్చినప్పుడు స్పందించాలి కదా అని అడిగారు. ఆస్తిపత్రాలు ఎక్కడ దాచాలనుకున్నారని, ప్రభుత్వ సర్వర్ పోర్టల్‌లోనా అని ప్రశ్నించారు. ప్రభుత్వ సర్వర్ పోర్టల్‌లో అయితే ప్రైవేటు కంపెనీకి కాంట్రాక్ట్ ఎందుకు ఇచ్చారని నిలదీశారు.
చట్టం అమలు కావడంలేదంటూ మంత్రి ధర్మాన అబద్దాలు చెబుతున్నాడని విమర్శించారు. 2023 అక్టోబర్‌లో జీవో ఇచ్చారన్న నీలాయపాలెం విజయ్‌కుమార్, నవంబర్ 1న గెజిట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చారని గుర్తు చేశారు. స్టేట్ ల్యాండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటు చేశారని, 2022 నుంచే భూహక్కు పాస్‌బుక్‌లు ఇచ్చారని అన్నారు. భూముల రీసర్వే సైతం చేస్తున్నారని తెలిపారు.
ఇప్పటికే నాలువేల గ్రామాల్లో సర్వే పూర్తి చేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను జగన్ రెడ్డి అమల్లోకి తెచ్చారని విజయ్‌కుమార్ ఆరోపించారు. ఇంకా 13 వేల గ్రామాల్లో సర్వే చేయలేదని అన్నారు. నాలుగో వంతు కూడా చేయకుండా కొత్త చట్టం కింద రిజిస్ట్రేషన్లు ఎలా ప్రారంభిస్తారని ప్రశ్నించారు. ల్యాండ్ టైట్లింగ్ చట్టం కోసం నీతి ఆయోగ్ ఒత్తిడి తెస్తోందంటున్నారని, జాతీయ స్థాయిలో ఏకాభిప్రాయం కావాలని రెవెన్యూ మంత్రి అన్నారని పేర్కొన్నారు. అయితే అన్ని రాష్ట్రాలను కాకుండా మన ఏపీపైనే నీతి ఆయోగ్ ఒత్తిడి చేస్తోందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ రాష్ట్రంలో లేని ల్యాండ్ టైట్లింగ్ చట్టం ఏపీలోనే ఎందుకు చేసిందని నిలదీశారు.
అక్కడ కేసీఆర్ ఓటమికి అదే కారణం- ఇక్కడ ఆందోళనలో జగన్ అండ్ కో! - Land Titling Act
దేశంలో ఏ రాష్ట్రంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలులో లేదని అన్నారు. ఒక వేళ అధికారంలోకి వస్తే ఎక్కడ ఏ భూమి కొట్టేయాలో ముందే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో జగన్ రెడ్డి ప్లాన్ చేశారని విమర్శించారు. టీఆర్వో (Title Registration Officer)లుగా అనుకూలమైన వారిని నియమించుకొని ప్రజల భూములను కొట్టేసేందుకు కుట్ర పన్నారని దుయ్యబట్టారు. ఆస్తుల వివరాలు అన్నీ ప్రైవేట్ సాఫ్ట్ వేర్ కంపెనీ (క్రిటికల్ రివర్) చేతుల్లో పెట్టడంతో జనం భయాందోళనలో ఉన్నారని విజయ్‌కుమార్ అన్నారు.
'భూమి నీదే కానీ, మేం రిజిస్ట్రేషన్ చేయించుకుంటాం- నీదైతే నిరూపించుకో!' - Land Titling Right Act