Vijayawada Canals Cleaning: విజయవాడ అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. నగరం నుంచి ప్రవహిస్తున్న కాలువల సుందరీకరణ పనులు వేగవంతం చేసింది. కాలువల్లో ఏళ్లుగా తిష్ట వేసిన కాలుష్య సమస్యకు సాంకేతికతతో పరిష్కారం చూపుతోంది. స్వచ్ఛతపై ప్రజల్లో అవగాహన పెంచతున్నారు.
విజయవాడ మీదుగా ప్రవహిస్తున్న ఏలూరు, బందరు, రైవస్ కాలువలతో పాటు బుడమేరు ప్రక్షాళనకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. నాలుగున్నర కోట్ల రూపాయలు వెచ్చించి విదేశాల నుంచి తెప్పించిన ఓ ప్రత్యేక వాహన యంత్రంతో కాలువల్లో పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని తొలగిస్తున్నారు. కాలువలకు ఆనుకుని ఉన్న నివాస ప్రాంతాలవారు వ్యర్థాలను నీటిలో వేస్తుండటంతో అవి పేరుకుపోతున్నాయి.
అలాగే వంతెనల పైనుంచి ప్రయాణికులు, పర్యాటకులు వేస్తున్న చెత్త అదనంగా వచ్చి చేరుతుండటంతో కాలువలు కాలుష్య కాసారాలుగా మారాయి. ఈ చెత్తను తొలగించడానికి గత ప్రభుత్వం చొరవ తీసుకోకపోవడంతో ఆయా ప్రాంతాల్లో దోమలు స్త్వైర విహారం చేస్తూ రోగాల వ్యాప్తికి కారణమవుతున్నాయి. ఈ కాలువల శుద్ధిపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఆయా ప్రాంతాలను పర్యాటక స్థలాలుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.
ఏడాది క్రితం కాలువల సుందరీకరణకు నిధులు కేటాయించి పనులు చేపట్టినా వ్యర్థాల ప్రవాహం ఆగలేదు. బుడమేరులోకి భారీగా మురుగు వచ్చి చేరుతుండటంతో ఆ దుర్వాసన వల్ల పరిసర ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జబ్బులు ప్రబలుతున్నాయి. సమస్యపై దృష్టి సారించిన ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన బుడమేరులో పేరుకుపోయిన పిచ్చిమొక్కలు, చెత్తాచెదారాన్ని తొలగిస్తోంది. కాలువల శుద్ధి, సుందరీకరణ పనుల పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
"కాలువల సుందరీకరణకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో మేము నాలుగున్నర కోట్ల రూపాయలు వెచ్చించి విదేశాల నుంచి ఓ ప్రత్యేక వాహన యంత్రం తెప్పించాము. కాలువల్లో పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని దీని ద్వారా తొలగిస్తున్నాము. దీంతోపాటు ప్రజల్లో కూడా స్వచ్ఛతపై అవగాహన తెచ్చేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము." - సత్యవతి, వీఎంసీ అడిషనల్ కమిషనర్ ప్రాజెక్ట్స్