Nature Lover Komera Ankarao: నలిగిన చొక్కా వేసుకుని, రబ్బరు చెప్పులు తొడుక్కుని, అడవిలో పోగైన చెత్తను ఏరివేస్తూ, ప్లాస్టిక్ సీసాలు సేకరిస్తున్న యువకుడి పేరు కొమెర అంకారావు. అడవి బిడ్డగా మారిన తర్వాత జాజి అని పేరు పెట్టుకున్నారు. పల్నాడు జిల్లా కారంపూడి జాజి స్వగ్రామం. నల్లమల అడవుల్ని తన మరో ఇంటిగా మార్చుకున్నాడు. ప్రపంచానికి అమెజాన్ అడవులు గుండెకాయ అంటారు. అలాగే నల్లమల అడవులు మన తెలుగు రాష్ట్రాలకు గుండెకాయ వంటివి. వాటిని కాపాడుకోకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయని జాజి బలంగా నమ్ముతారు. అందుకే పదో తరగతి తర్వాత బడికి వెళ్లటం మానేసి ప్రకృతి ఒడిలోకి వెళ్లటం మొదలు పెట్టారు.
సమస్త ప్రాణులు ఈ అడవి, పచ్చని ప్రకృతిపై ఆధారపడి జీవిస్తూ ఉన్నాయని, అలాంటి అడవికి ఇప్పుడు కష్టం వచ్చిందంటారు జాజి. చిట్టడవులతో పాటు కీకారణ్యాలు కూడా పలుచబడి అక్కడి ప్రాణులు బయటకు వచ్చి ప్రాణాలు కోల్పోతున్నాయని, అడవుల్లోని ఔషధ మొక్కలు, అరుదైన వన మూలికలు అంతరించిపోతాయంటారు. 33 శాతంగా ఉండాల్సిన అడవులు తెలుగు రాష్ట్రాలలో కేవలం 19శాతం మాత్రమే ఉన్నాయని, వాటిని వృద్ధి చేసుకోవటం అటుంచి, కాపాడుకోకపోతే ఎన్నో ప్రాణులు అంతరించిపోతాయని ఆవేదనగా చెబుతారు. తనవంతుగా అడవుల సంరక్షణకు నడుం కట్టారు.
అడవుల్ని పరిశుభ్రం చేయటం కోసం రోజూ ఉదయాన్నే అడవి బాట పడతారు. అడవికి దూరంగా ఓ పెద్ద కందకం తవ్వి వ్యర్థాలను అందులో పూడ్చేస్తారు. మనుషులు చేసిన తప్పులతో అడవుల్లోని పక్షులు, తాబేళ్లు గాయపడి అచేతన స్థితిలో ఉండిపోయిన దృశ్యాలను జాజి స్వయంగా చూశారు. వాటికి సపర్యలు చేసి స్వేచ్ఛను ప్రసాదించటంలో ఆనందం వెదుక్కున్నారు. పొలంపై వచ్చే ఆదాయం కన్నా పిచ్చుకల పొట్ట నింపటంలోనే ఆనందం ఉందంటాడు.
అడవుల్లో మొక్కల పెంపకం కోసం కోటి విత్తన బంతుల కార్యక్రమాన్ని చేపట్టారు. పల్నాడు జిల్లా అధికార యంత్రాంగం, అటవీ అధికారుల సహకారంతో 2023లో విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఇప్పుడు 2024లో కూడా కోటి విత్తన బంతుల కార్యక్రమం చేపట్టారు. దీనికి సంబంధించి విత్తనాల సేకరణను పూర్తి చేశారు. జూన్ నుండి సెప్టెంబర్ వరకు నాలుగు నెలల్లో కోటి విత్తన బంతులు చల్లి, కోటి మొక్కలను అడవితల్లికి ఇవ్వడమే లక్ష్యంగా పని చేస్తున్నారు. వివిధ వర్గాల వారందరి భాగస్వామ్యంతో కోటి మొక్కలు నాటించి రక్షించడమే తన సంకల్పమని వివరిస్తారు.
Organic farming: సేంద్రియ సాగుతో అద్భుతాలు.. రూ.12 లక్షల పెట్టుబడితో రూ.30 లక్షల ఆర్జన
జాజి ఇప్పటి వరకూ ప్రాచీన మూలికా వైద్యం, ప్రకృతి పాఠశాల, ప్రకృతి వైద్యం, ప్రకృతి ఆహారం అనే నాలుగు పుస్తకాలు రాశారు. వాటిని కూడ పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా పంచిపెడతారు. జాజి చేస్తున్న కార్యక్రమాల్ని గుర్తించి ది వీక్ మాగజైన్ ప్రత్యేక సంచికలో వ్యాసం ప్రచురించింది. కాలిఫోర్నియాకు చెందిన లైవ్ టచ్ ఫౌండేషన్ టాల్ హీరో అవార్డు అందజేశారు. ఈ ఏడాది జనవరి 26న రాష్ట్ర గవర్నర్ ఇచ్చిన తేనేటి విందుకు అతిథిగా అహ్వానంతో వెళ్లారు. 2023లో రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కారానికి జాజి ఎంపికయ్యారు. సుచిరిండియా వారు హైదరాబాద్ లో సంకల్పతార అవార్డు అందజేశారు.
లాభపేక్ష లేకుండా అడవితల్లి సేవనే తన వృత్తిగా మార్చుకొని, నిత్యం పర్యావరణ పరిరక్షణ కోసం పని చేస్తున్నారు జాజి. పదో తరగతితో చదువు ఆపేసిన జాజి ఇటీవలే దూరవిద్య ద్వారా డిగ్రీ, పిజీ పూర్తి చేశారు. కానీ యూనివర్శిటి ఇచ్చిన పట్టాలకంటే ముందే, పర్యావరణ ప్రేమికుడనే పట్టభద్రుడిగా ఎదిగారు. అడవితల్లి గుండెలపై ఆకుపచ్చ సంతకం చేశారు.