National Means Cum Merit Scholarship Scheme Application in AP : ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రతిభా ఉపకార వేతనాలు (National Means Cum Merit Scholarship) అందజేస్తోంది. ఇందులో భాగంగా ప్రస్తుత విద్యా సంవత్సరానికి (2024-25) దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. 8వ తరగతి చదువుతూ పరీక్షలో అర్హత సాధించిన వారికి 4 సంవత్సరాలు పాటు ఏడాదికి రూ.12 వేలు చొప్పున మొత్తం రూ.48 వేలను ఉపకార వేతనాల రూపంలో విద్యార్థులకు ప్రభుత్వం అందజేస్తుంది.
ప్రకాశం జిల్లాలో 459 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. అందులో 8వ తరగతి చదువుతున్న వారి సంఖ్య 19,033 మంది. విద్యార్థులు ఉపకార వేతన (Students stipend) పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం ద్వారా దీన్ని పొందేందుకు అర్హులు. ఈ ఉపకార వేతనం పొందేందుకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు పేర్కొంటున్నారు. 7, 8వ తరగతి పాఠ్యాంశాల ఆధారంగా ప్రశ్నపత్రం తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో రెండు విభాగాల్లో పరీక్ష నిర్వహిస్తారు. మొదటి విభాగంలో మానసిక సామర్థ్య పరీక్ష, రెండో పేపర్ విషయ సామర్థ్యంపై బహుళైచ్ఛిక ప్రశ్నలు (Multiple Choice Questions) అడుగుతారు.
ఒక్కో విభాగానికి 90 మార్కులు కేటాయించారు. మొత్తం 180 మార్కులతో ప్రశ్నపత్రం ఉంటుంది. ఈ పరీక్ష రాసేందుకు విద్యార్థులకు 3 గంటల సమయం ఉంటుంది. అర్హత సాధించిన వారికి 4 సంవత్సరాల పాటు అంటే 9, 10, రెండేళ్ల ఇంటర్మీడియట్‌కు ఏటా రూ.12 వేలు ఉపకార వేతనాన్ని అందజేస్తారు. అయితే 9 తరగతిలో 55% మార్కులు, 10లో 60% మార్కులు, ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 55% మార్కులు సాధిస్తేనే ఉపకార వేతనం లభిస్తుంది.
దరఖాస్తుకు చివరి తేది: సెప్టెంబర్ 17
పరీక్ష రుసుము చెల్లించేందుకు గడువు: సెప్టెంబర్ 18
పరీక్ష తేదీ: డిసెంబరు 8
దరఖాస్తు ఇలా : www.bsc.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు (Application) చేసుకోవచ్చు. జనరల్, బీసీ కేటరిగికి చెందినవారు రూ.100 ఫీజును చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందినవారు రూ.50 పరీక్ష రుసుము చలానా ద్వారా ఆన్‌లైన్‌లో (apply online) చెల్లించాలి. దరఖాస్తు ఫారాన్ని డీఈవోకు (DEO) అందజేయాల్సి ఉంటుంది.
ప్రతిభావంతులకు ఉపయోగం : చదువులో ప్రతిభ కలిగిన విద్యార్థులకు ఎన్‌ఎంఎంఎస్ (NMMS) చక్కగా ఉపయోగపడుతుందని సి.ఎస్.పురం ఎంఈవో రాజాల కొండారెడ్డి వెల్లడించారు. పేద, మధ్య తరగతి విద్యార్థులు ఉన్నత చదువులు అభ్యసించేందుకు ఇది మంచి అవకాశమని పేర్కొన్నారు. ఇప్పటికే ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సమాచారం ఇచ్చామని తెలియజేశారు.