National Highways Development in State : వాహన రద్దీ అధికంగా ఉన్న రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులు(ఎన్‌హెచ్‌లు)గా గుర్తించి, ఉన్నతీకరించడంలో కేంద్ర ప్రభుత్వం ఉదాసీన వైఖరి అవలంబిస్తోంది. రాష్ట్రం నుంచి ఎన్నిసార్లు ప్రతిపాదనలు పంపినా పక్కనపెడుతోంది. పరిశీలిస్తామంటూనే మూడేళ్లు దాటవేసింది. ఈ మూడేళ్లుగా ఒక్క రోడ్డునూ ఉన్నతీకరించలేదు.
రాష్ట్ర ప్రభుత్వమే మరో మార్గం లేక ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో వాటిలో కొన్ని రోడ్లను అభివృద్ధి చేయాలని భావిస్తోంది. ఆర్‌అండ్‌బీ పరిధిలో రాష్ట్రంలో జిల్లా రోడ్లు 32,725 కిలోమీటర్లు, రాష్ట్ర రహదారులు 12,653 కి.మీ. మేర ఉన్నాయి. ఇందులో 3,059 కి.మీ. పొడవైన మార్గాలను ఎన్‌హెచ్‌లుగా గుర్తించాలని రాష్ట్రం కోరుతోంది. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 8,744 కి.మీ. పొడవైన రహదారులు మాత్రమే ఎన్‌హెచ్‌లు ఉన్నాయి.
జాతీయ రహదారులుగా మారాలంటే: రెండు జాతీయ రహదారులను అనుసంధానించే రాష్ట్ర దారుల్లో వాహన రద్దీ ఎక్కువగా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం జాతీయ రహదారులుగా ప్రతిపాదిస్తూ కేంద్రానికి వివరాలు ఇస్తుంది. వాటిని కేంద్రం పరిశీలించి నిర్ణయం తీసుకుంటుంది. జాతీయ రహదారులుగా వీటిని గుర్తిస్తే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కేంద్రమే ఆయా మార్గాలను 4, 6 వరుసలు చేస్తుంది. రెండు వరుసలుగానే ఉంచాలనుకుంటే 10 మీటర్ల మేర విస్తరిస్తుంది. రాష్ట్రంలో అధిక వాహన రద్దీ ఉండి, పారిశ్రామిక, వాణిజ్య, ఖనిజ, ఆధ్యాత్మిక ప్రాంతాల మీదుగా వెళ్లే 31 రాష్ట్ర రహదారులను ఎన్‌హెచ్(NH)లుగా ఉన్నతీకరించాలని కేంద్రానికి చాలాసార్లు ప్రతిపాదనలు వెళ్లాయి. కానీ ఒక్కదాన్నీ పట్టించుకోలేదు.
ప్రధానమంత్రి నిర్ణయం : చివరిసారిగా 2021 సెప్టెంబరులో ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలోని పెడన నుంచి విస్సన్నపేట - లక్ష్మీపురం రోడ్డును ఎన్‌హెచ్‌గా గుర్తించారు. తర్వాత మళ్లీ ఆ దిశగా దృష్టి సారించలేదు. ఈ విషయంలో రాష్ట్రానికి చెందిన ప్రజాప్రతినిధులు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీని సంప్రదించినప్పుడల్లా ‘నా చేతుల్లో ఏమీలేదు. ప్రధానమంత్రి నిర్ణయం తీసుకోవాలి. ఆయన్నే సంప్రదించాలి’ అని సూచిస్తున్నట్లు తెలిసింది.
ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో అభివృద్ధి చేద్దామంటూ: రహదారుల ఉన్నతీకరణపై కేంద్రం నుంచి స్పందన లేకపోవడంతో కూటమి ప్రభుత్వమే పీపీపీ విధానంలో అభివృద్ధి చేసేందుకు అధ్యయనం చేస్తోంది. ఈ క్రమంలో మొదటిదశలో 18, రెండో దశలో 68 రోడ్లకు సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తోంది. వీటిలో 17 మార్గాలు ఎన్‌హెచ్‌లుగా ఉన్నతీకరించాలని కేంద్రానికి ప్రతిపాదించినవే.
కేంద్ర మంత్రులు, ఎంపీలు తలచుకుంటే సాధ్యమే : 2019-24లో వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి 22 మంది లోక్‌సభ సభ్యులు, 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నా ‘ఎన్‌హెచ్‌ల’ సాధించడంలో పూర్తిగా విఫలమయ్యారు. ప్రస్తుతం కేంద్రం, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వమే ఉంది. రాష్ట్రం నుంచి ముగ్గురు కేంద్ర మంత్రివర్గంలో ఉన్నారు. ఎంపీలతో కలిసి వీరు కృషి చేస్తే రాష్ట్ర రహదారులకు ‘ఎన్‌హెచ్’ల భాగ్యం దక్కుతుంది. దీనికోసం పీఎంను కలిసి సమస్య వివరిస్తే ప్రత్యేక అనుమతి తీసుకునే అవకాశమూ ఉంది.
ఎన్‌హెచ్‌లుగా ఉన్నతీకరణకు ప్రతిపాదించిన మార్గాలు
- చిలకపాలెం- రామభద్రపురం- పార్వతీపురం- రాయగడ రోడ్డు (100 కి.మీ.)
- కళింగపట్నం- ఆమదాలవలస- పాలకొండ- పార్వతీపురం మీదుగా రాయగడ వెళ్లే మార్గం (145 కి.మీ.)
- ఆమదాలవలస, హిరమండలం, కొత్తూరు, భామిని మీదుగా వెళ్లే గార- అలికాం- బత్తిలి రోడ్డు ఒడిశాలో గునుపూర్ వరకు(118 కి.మీ.)
- విజయనగరం- పాలకొండ (70.31 కి.మీ.)
- సబ్బవరం నుంచి చోడవరం, నర్సీపట్నం మీదుగా తుని వరకు (109.5 కి.మీ.)
- తాళ్లపాలెం- చింతపల్లి- సీలేరు -భద్రాచలం (224 కి.మీ.)
- కాకినాడ నుంచి కోటిపల్లి మీదుగా అమలాపురం (57.29 కి.మీ.)
- రాజమహేంద్రవరం ప్రక్కిలంక, ప్రత్తిపాడు, నిడదవోలు మీదుగా భీమవరం (73.80 కి.మీ.)
- రాజమహేంద్రవరం బిక్కవోలు, అనపర్తి, ద్వారపూడి మీదుగా సామర్లకోట (62 కి.మీ.)
- భీమవరం నుంచి లంకలకోడేరు, నరసాపురం, మార్టేరు, కోడేరు, అచంట మీదుగా సిద్ధాంతం వంతెన వరకు (44 కి.మీ.)
- భీమడోలు- ద్వారకాతిరుమల- జంగారెడ్డిగూడెం (42.4 కి.మీ.)
- పామర్రు- కూచిపూడి- మొవ్వ- కొడాలి- చల్లపల్లి మార్గం (26.83 కి.మీ.)
- గుంటూరు నుంచి ప్రత్తిపాడు మీదుగా ఒంగోలు (107 కి.మీ.)
- గుంటూరు నుంచి నల్లపాడు, పేరేచెర్ల, తాడికొండ మీదుగా కాజా (50.76 కి.మీ.)
- గుంటూరు నుంచి నారాకోడూరు, చేబ్రోలు, పొన్నూరు మీదుగా బాపట్ల (63.80 కి.మీ.)
- కాజా నుంచి తాడికొండ, నీరుకొండ, రాయపూడి, సత్తెనపల్లి మీదుగా నరసరావుపేటకు (96 కి.మీ.)
- కృష్ణపట్నం- గూడూరు- రాపూరు- రాజంపేట- రాయచోటి- కదిరి రోడ్డు (253 కి.మీ.)
- తడ నుంచి శ్రీకాళహస్తి (50 కి.మీ.)
రాష్ట్ర రహదారులు ఇక హైవేలుగా - దేవాలయాలు, పర్యటక ప్రాంతాల మీదుగా అభివృద్ధి
- చిత్రదుర్గం నుంచి వచ్చే రోడ్డులో కర్ణాటక సరిహద్దు నుంచి రొద్దం, పెనుకొండ, మీదుగా పుట్టపర్తి సమీపంలోని బుక్కపట్నం వరకు (54 కి.మీ.)
- కర్నూలు నుంచి కోడుమూరు, ఆస్పరి, ఆలూరు, బళ్లారి మార్గం (143.62 కి.మీ.)
- మలకవేముల క్రాస్ నుంచి నల్లమాడ, ఓబుళదేవరచెరువు మీదుగా బాగేపల్లి (84.80 కి.మీ.)
- బైరెడ్డిపల్లె నుంచి శంకరాయపేట, పుంగనూరు, పులిచెర్ల చిన్నగొట్టిగల్లు మీదగా రొంపిచర్ల వరకు 100.74 కి.మీ.
- గుత్తి- ఆదోని- కౌతాలం మీదగా కర్ణాటక సరిహద్దు వరకు 135 కి.మీ.
- పాత ఎన్‌బీబీ రోడ్డు (జమ్మలమడుగు నుంచి కొలిమిగుంట్ల) 42 కి.మీ.
- నాగసముద్రం క్రాస్ నుంచి ధర్మవరం, బత్తలపల్లి, నాయినపల్లి క్రాస్ వరకు (64 కి.మీ.)
- ఆదోని- పత్తికొండ- ప్యాపిలి- బనగానపల్లి (144.60 కి.మీ.)
- ఎమ్మిగనూరు నుంచి పత్తికొండ, గుంతకల్లు, ఉరవకొండ, కళ్యాణదుర్గం, పావగడ మీదుగా మడకశిర (243 కి.మీ.)
- భాకరాపేట నుంచి బద్వేలు, పోరుమామిళ్ల మీదుగా బెస్తవారిపేట (140 కి.మీ.)
- ఉత్తుకొట్టాయి- సత్యవేడు -తడ (42 కి.మీ.)
- బెస్తవారిపేట నుంచి గొట్లగట్టు, పొదిలి, ఉప్పలపాడు, చీమకుర్తి మీదుగా ఒంగోలు వరకు (107 కి.మీ.)
- బేతంచర్ల నుంచి బనగానపల్లె, కోయిలకుంట్ల మీదుగా ఆళ్లగడ్డ వరకు (64 కి.మీ.)