Nara Lokesh reacts to tribal woman delivers on road: అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఓ నిండు గర్భిణి రోడ్డుపై ప్రసవించిన ఘటనపై తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందిచారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే గిరిజన బిడ్డలు ఇబ్బందులకు గురవుతున్నారని ఆరోపించారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫీడర్ అంబులెన్స్‌లను వైసీపీ మూలన పడేసిందని ఆరోపించారు.
జగన్ రెడ్డి పరిపాలనలో ఆరోగ్య సంరక్షణ సేవల దయనీయ స్థితికి అద్దం పడుతోందంటూ నారా లోకేశ్ ఆరోపించారు. ఈ మేరకు వైసీపీ ప్రభుత్వ వైఫల్యం అంటూ ట్విట్టర్లో లోకేశ్ వీడియో విడుదల చేశారు. అంబులెన్సు అందుబాటులో లేక గర్భిణిని బంధువులు కిలోమీటరు దూరం తీసుకువెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. అల్లూరి జిల్లా, అనంతగిరి మండలం, పెదకోట గ్రామంలో రోడ్డుపైనే ఆ మహిళ ప్రసవించాల్సిన దుస్థితి ఏర్పడిందని వాపోయారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం, గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫీడర్ అంబులెన్స్‌లను మూలన పడేసిందని లోకేశ్ దుయ్యబట్టారు. అత్యవసర సమయాల్లో కీలకమైన వైద్య సహాయం కోసం గిరిజనులు కష్టపడుతునే ఉన్నారని మండిపడ్డారు.
సోమవారం అల్లూరి సీతారామరాజు జిల్లాలో, కిల్లో వసంత అనే గర్భిణి ప్రసవ వేదనతో నరకయాతన అనుభవించింది. అనంతగిరి మండలం పెదకోట పంచాయతీ చీడివలస గ్రామానికి చెందిన కిల్లో వసంతకు నెలలు నిండడంతో పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి. ఆమె బంధువులు 108 వాహనానికి సమాచారమిచ్చారు. అంబులెన్సు గ్రామం వరకు చేరుకోలేని దుస్థితి ఏర్పడింది. గ్రామానికి కొంత దూరం వరకు వచ్చిన 108 వాహనం వద్దకు చేరుకునేందుకు కుటుంబసభ్యుల సాయంతో గర్భిణి నడక ప్రారంభించింది. కొంతదూరం వెళ్లేసరికి నొప్పులు ఎక్కువయ్యాయి. ఇక నడవలేని పరిస్థితి ఏర్పడటంతో ఆ మహిళ మార్గమధ్యలో నేలపై పడిపోయింది. ఇక చేసేది ఏమి లేక బంధువులు అక్కడే పురుడు పోసేందుకు సిద్ధమయ్యారు. అంతలో 108 సిబ్బంది అక్కడికే చేరుకుని స్థానికుల సాయంతో మహిళకు పురుడు పోశారు. కిల్లో వసంత పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ఇద్దరినీ హుకుంపేట మండలం ఉప్ప ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు.
గర్భిణీ దారుణ హత్య- 20ముక్కలు చేసి రోడ్డు పక్కన వేసిన దుండగులు!