Nara Bhuvaneswari Donation to Anna Canteens: రాష్ట్రంలో రేపటి నుంచి ప్రారంభం కానున్న అన్న క్యాంటీన్లకు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు తరుపున ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ప్రభుత్వానికి కోటి రూపాయల విరాళం అందించారు. ఈ మేరకు చెక్కును మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకు ఇచ్చారు. పేదల కడుపు నింపేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న అన్న క్యాంటీన్లు కార్యక్రమం ఎంతో గొప్పదని భువనేశ్వరి కొనియాడారు. పేదవాడికి ఆహారం, ఇళ్లు, వస్త్రం అనేది ఎన్టీఆర్ నినాదమని ఆమె గుర్తు చేశారు.
అన్నపూర్ణలాంటి ఆంధ్రప్రదేశ్ లో ఆకలి అనే పదం వినపడకూడదు అనే మహోన్నత లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న క్యాంటీన్లను మళ్లీ పునఃప్రారంభించడం సంతోషంగా ఉంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజునే అన్న క్యాంటీన్లు మొదలుకావడం శుభపరిణామం. పేదల ఆకలి తీర్చే ఈ మహత్తర కార్యక్రమం… pic.twitter.com/mPDlfnx3OB
— Nara Bhuvaneswari (@ManagingTrustee) August 14, 2024
ఎన్టీఆర్ స్ఫూర్తితోనే ఈ కార్యక్రమం మొదలు : ఎన్టీఆర్ స్ఫూర్తితో పేదల ఆకలి తీర్చడానికి తలపెట్టిన ఈ కార్యక్రమానికి తన వంతుగా విరాళం అందించినట్లు భువనేశ్వరి తెలిపారు. ఐదు రూపాయలకే కడుపు నింపడం అనేది గొప్ప కార్యక్రమమని భువనేశ్వరి అన్నారు. పేదలు, రోజు కూలీలు, కార్మికులకు ఈ అన్న క్యాంటీన్లు ఎంతో ఉపయోగపడతాయని భువనేశ్వరి అభిప్రాయపడ్డారు. పేదల జీవన ప్రమాణాలు పెరిగేలా సంక్షేమ పథకాలు అందిస్తున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఎన్ని సంక్షేమ పథకాలు ఉన్నా పేదల కడుపు నింపే అన్న క్యాంటీన్ లాంటి కార్యక్రమం మహోన్నతమైనదని భువనేశ్వరి పేర్కొన్నారు. పేదల సేవలో మరిన్ని మంచి కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టాలని ఆమె ఆకాంక్షించారు.
రాష్ట్ర ప్రజలకు శుభవార్త- అన్న క్యాంటీన్ల ప్రారంభోత్సవానికి ముహూర్తం ఫిక్స్
పేదలకు పట్టెడన్నం పెట్టలేని ప్రభుత్వాలు ఎందుకన్న నినాదంతోనే అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారు. అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ గతంలో తెలుగుదేశం హయాంలోనే అన్న క్యాంటీన్లను చంద్రబాబు ప్రారంభించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం కక్షగట్టి వీటిని మూసివేసినా మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో గురువారం పునః ప్రారంభం కానున్నాయి. ఈ అన్న క్యాంటీన్లను గుడివాడలో సీఎం లాంఛనంగా ప్రారంభించనున్నారు.
స్వాతంత్య్ర దినోత్సం సందర్భంగా తొలి విడతగా 100 క్యాంటీన్లు అందుబాటులోకి తీసుకురానున్నారు. గుడివాడలో సీఎం పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు చేశారు. తొలి విడతలో 17 జిల్లాల్లో 100 అన్నా క్యాంటీన్లను ప్రభుత్వం ప్రారంభించనుంది. ఏఎన్ఆర్ కళాశాల, ఎన్టీఆర్ స్టేడియంలో హెలిప్యాడ్‌ను కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ పరిశీలించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలోని ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భద్రతాపరంగా ఎలాంటి లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.