Nara Bhuvaneshwari Kuppam Visit : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్టు ట్రస్టీ నారా భువనేశ్వరి పర్యటన చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో కొనసాగుతోంది. నాలుగు రోజుల కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్న ఆమెకు కూటమి నేతలు ఘనస్వాగతం పలికారు. అంతకుముందు శాంతిపురం మండలం శివపురం వద్ద సొంత ఇంటి నిర్మాణాన్ని భువనేశ్వరి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శ్రీకాంత్, పెద్ద ఎత్తున టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
యువత చేతిలోనే దేశ భవిష్యత్ ఉందని కష్టపడితే విజయం సొంతమవుతుందని నారా భువనేశ్వరి అన్నారు. రెండో రోజు కుప్పం పర్యటనలో భాగంగా స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులతో ఆమె ముఖాముఖి నిర్వహించారు. అంతకుముందు కళాశాల ఆవరణలో ఆమె మొక్కలు నాటారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ ఐటీ రంగంలోనూ మహిళలు రాణించడం సంతోషకరమన్నారు.
విజన్‌తో ముందుకెళితే అద్భుతాలు సృష్టించవచ్చని చెప్పారు. నిత్యం ప్రజల గురించి ఆలోచించే సీఎం చంద్రబాబే తనకు స్ఫూర్తి అన్నారు. తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్ బాగుండాలని ఎంతో కష్టపడి చదివిస్తారని వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందన్నారు. ఒకప్పుడు మహిళలు ఇంటికే పరిమితమయ్యేవాళ్లని ఆ తర్వాత పరిస్థితులు మారాయని చెప్పారు. ఇప్పుడు అన్ని రంగాల్లోనూ మహిళలు ముందున్నారన్నారు.
మహిళలు శక్తికి నిదర్శనం కాబట్టే దసరా పండుగ: నారా భువనేశ్వరి
విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థానాలకు వెళ్లాలని వివరించారు. ఆటపాటలతో పాటు కెరీర్ పైనా విద్యార్థులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని తెలిపారు. విజయం ఊరికే రాదు, కష్టపడకుండా వచ్చేది ఏదీ నిలబడదని భువనేశ్వరి అన్నారు. విద్యార్థి దశ నుంచే లక్ష్యంతో ముందుకెళితే అద్భుతాలు సృష్టించవచ్చన్నారు. లోకేశ్‌కి అదే చెప్పేదాన్నని అన్నారు.
చంద్రబాబు ఎప్పుడూ ప్రజల గురించే ఆలోచిస్తారని ప్రజలకు సేవ చేయాలని ఆయన తపిస్తారని భువనేశ్వరి అన్నారు. ఇప్పుడు స్వర్ణాంధ్ర-విజన్ 2047 లక్ష్యంతో ముందుకెళుతున్నారని చెప్పారు. పేదరికం లేని సమాజమే చంద్రబాబు లక్ష్యంమని అన్నారు. ఆయన్ను సొంత బిడ్డగా భావిస్తూ ప్రేమాభిమానాలు చూపిస్తున్న కుప్పం నియోజకవర్గ ప్రజల రుణం మేం తీర్చుకోలేం. రాబోయే ఐదేళ్లలో నియోజకవర్గాన్ని అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని భువనేశ్వరి అన్నారు.
'గంజాయి, డ్రగ్స్ బారిన పడి యువత బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు. సోషల్ మీడియాను చెడు కోసం కాకుండా మంచికే వాడాలి. జీవితంలో ఎన్ని సవాళ్లు ఎదురైనా వెనకడుగు వేయకుండా ముందుకు సాగిపోవాలి.' -నారా భువనేశ్వరి