Graduate MLC By Election Results 2024 : వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియలో రెండో రౌండ్ పూర్తయ్యేసరికి కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న 14,672 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇప్పుడు మూడో రౌండ్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది.
రెండో రౌండ్ ఓట్ల లెక్కింపు వివరాలు :
- రెండో రౌండ్‌లో తీన్మార్ మల్లన్న(కాంగ్రెస్)కు 34,575 ఓట్లు
- రెండో రౌండ్‌లో రాకేశ్ రెడ్డి(బీఆర్ఎస్)కి 27,573 ఓట్లు
- రెండో రౌండ్‌లో ప్రేమేందర్ రెడ్డి(బీజేపీ)కి 12,841 ఓట్లు
- రెండో రౌండ్‌లో స్వతంత్ర అభ్యర్థి అశోక్‌కు 11,018ఓట్లు
- రెండో రౌండ్‌లో 7,002 ఓట్ల ఆధిక్యంలో ఉన్న తీన్మార్ మల్లన్న
మొదటి రౌండ్ ఫలితాలు : వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది. బుధవారం అర్ధరాత్రి 12.30 గంటల దాటాక మొదటి రౌండ్ లెక్కింపు వివరాలు వెల్లడయ్యాయి. కాంగ్రెస్ బలపరిచిన తీన్మార్ మల్లన్నకు 36,210 ఓట్లు రాగా, బీఆర్ఎస్ బలపరిచిన రాకేశ్‌రెడ్డికి 28,540 ఓట్లు, బీజేపీ బలపరిచిన ప్రేమేందర్ రెడ్డికి 11,395 ఓట్లు వచ్చాయి. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్ ముగిసే సరికి తీన్మార్ మల్లన్న 7,670 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మొత్తం మీద తొలి రౌండ్‌లో 96,097 ఓట్లు ఉండగా అందులో చెల్లిన ఓట్లు 88,369 కాగా, చెల్లని ఓట్లు 7,728 ఓట్లుగా అధికారులు తేల్చారు.
మొదటి రౌండ్ పూర్తైన తర్వాత రెండో రౌండ్ లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. నల్గొండలోని దుప్పలపల్లి గిడ్డంగుల సంస్థ గోదాముల్లో కౌంటింగ్ జరుగుతోంది. పట్టభద్రుల ఉపఎన్నికలో మొత్తం 3లక్షల 36 వేల ఓట్లు పోలయ్యాయి. తొలి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు నాలుగు రౌండ్లలో పూర్తి కానుంది. చెల్లిన ఓట్లలో 50 శాతానికిపైన ఒక ఓటు వచ్చిన అభ్యర్థి విజేతగా ప్రకటిస్తారు. తొలి ప్రాధాన్య ఓట్ల లెక్కింపులో ఫలితం తేలకపోవచ్చని ప్రధాన పార్టీలు అభిప్రాయపడుతున్నాయి. అదే జరిగితే రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కిస్తారు. ఓట్ల లెక్కింపు సజావుగా సాగుతోందని ఆర్వో దాసరి హరిచందన తెలిపారు. నేడు పూర్తి ఫలితం వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.