Nagababu Comments on YSRCP: ఏం అభివృద్ధి పనులు చేశారో, ఓట్లు అభ్యర్థించడానికి వచ్చే వైఎస్సార్సీపీ నాయకులను ఓటర్లు ప్రశ్నించాలని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు సూచించారు. అనకాపల్లి జిల్లాలోని జనసేన పార్టీ కార్యాలయంలో జనసైనికుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాగబాబు పాల్గొన్నారు.
అనకాపల్లిలో దోమలతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆగడాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఎద్దేవా చేశారు. గంజాయి అక్రమ రవాణాలో స్థానిక మంత్రి ప్రమేయం ఉందని తాను విన్నానని అన్నారు. పోలీసులకు కూడా పట్టుబడినట్లు తెలిసిందని పేర్కొన్నారు. సదరు మంత్రి పేరు పలికితే తన నోరు పాడైపోతుందంటూ వ్యంగ్యస్త్రాలు సంధించారు.
రాష్ట్రంలో ఏ ప్రాంతంలో గంజాయి పట్టుబడినా, దాని ఆనవాళ్లు విశాఖ సమీపంలోని ఏజెన్సీ ప్రాంతాలను చూపడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ పాలనలో యువతకు ఉపాధీ అవకాశాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని వివరించారు.
కలిసికట్టుగా పని చేద్దాం - టీడీపీ-జనసేనను గెలిపిద్దాం: నాగబాబు
రాష్ట్రంలో రాబోయేది టీడీపీ జనసేన కూటమేనని ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్సార్సీపీ కంటే మెరుగైన పాలనను అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలు అధికారం కట్టబెడితే గంజాయి విక్రయాన్ని రాష్ట్రంలో ఉక్కుపాదంతో తొక్కివేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడతామని పేర్కొన్నారు.
రాష్ట్రంలో కనిపించకుండా పోయిన మహిళల ఆచూకి ఇంకా లభించకపోవడం బాధకరమన్నారు. సంక్షేమ పథకాలు, వాటితో పాటు అందరికీ ఉచిత విద్య, వైద్యం అందిస్తామని వెల్లడించారు. యువతకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
Nagababu on CM: 'ఈ ఉప్మా ముఖ్యమంత్రిని పదవిలోంచి దింపితే తప్పేంటి బ్రదర్': నాగబాబు
ప్రతి నియోజకవర్గంలో 500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే బాధ్యత జనసేన తీసుకుంటుందని వివరించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి కంటే మహానటుడు మరెవరు ఉండరని ఎద్దేవా చేశారు. జగన్ నటన చూస్తుంటే ఎంతోకాలంగా నటన వృత్తిలో ఉన్న తమకే సిగ్గేస్తుందంటూ వ్యంగ్యంగా స్పందించారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దేశంలో ఎక్కడా, ఇలాంటీ నీచమైన ప్రభుత్వం అధికారంలోకి రాలేదని దుయ్యబట్టారు. రోడ్లు, సంక్షేమ పథకాలు అవసరమా అని రాష్ట్ర మంత్రులు అంటున్నారని, రహదారులు సరిగా లేక కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారని వివరించారు. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించలేదని విమర్శించారు.
మెగా డీఎస్సీ పేరుతో వైఎస్సార్సీపీ యువతను మోసం చేస్తోంది: నాగబాబు
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు చెప్పుకుని ఓట్లు అభ్యర్థించి, మెల్లగా ఆయనను కనిపించకుండా చేసి జగనే ముందుకు వచ్చారని నాగబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. నెమ్మదిగా తల్లినీ, చెల్లినీ దూరం చేశాడని నాగబాబు అన్నారు. సొంత కుటుంబసభ్యులనే అధికారం, ఆస్తుల కోసం దూరం పెట్టిన వ్యక్తి ప్రజల కోసం ఏం చేస్తాడని ప్రశ్నించారు.
వైనాట్ అనడం వైసీపీ నియంత్రత్వ ధోరణికి నిదర్శనం - రాజకీయ పదవులపై వ్యామోహం లేదు: నాగబాబు