Munneru Flood Victims Problems : ఖమ్మంలో మున్నేరు ముంపు బాధితుల గోడు అత్యంత దయనీయంగా మారింది. ఏ కాలనీ చూసినా వరద మిగిల్చిన గాయాలే కనిపిస్తున్నాయి. ఎవరిని కదిలించినా కన్నీటి గాథలే వినిపిస్తున్నాయి. వరద తగ్గడంతో ఇళ్లకు చేరుకుంటున్న ప్రజలు సర్వం కోల్పోయామని బోరుమంటున్నారు. నాలుగురోజులుగా అంధకారంలోనే మగ్గుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎవరిని కదిపినా ఒకటే వ్యథ : మున్నేరు ఉగ్రరూపంతో ముంపు బారిన పడిన ఖమ్మంలోని కాలనీలు ఇంకా తేరుకోలేదు. ఖమ్మం నగరంలోని 15కాలనీలు, గ్రామీణ మండలంలోని 5 నుంచి 8కాలనీలు ఒక్కసారిగా విరుచుకుపడిన వరదతో పునరావాస కేంద్రాలకు తరలివెళ్లారు. వరద తగ్గడంతో ఇళ్లకు తరలివస్తున్న ప్రజలు జరిగిన నష్టం చూసి కన్నీటి పర్యంతమవుతున్నారు.
కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న బాధితులు : వెంకటేశ్వర కాలనీ, పద్మావతినగర్, బొక్కలగడ్డ, మోతీనగర్, దంసులాపురం, మంచికంటినగర్‌లో మున్నేరు వరద తీరని నష్టం మిగిల్చింది. వరద మిగిల్చిన నష్టానికి కట్టుబట్టలతో మిగిలామని తల్లడిల్లిపోతున్నారు. గ్యాస్ సిలిండర్లు, మంచాలు, వస్తువులు మున్నేరు వరదార్పణ అయ్యాయని ఆవేదన చెందుతున్నారు.
"అవసరాలకు దాచుకున్న డబ్బులతో సహా ఇంట్లో ఉన్న వస్తువులు అన్నీ తడిచి పోయాయి. 20 క్వింటాళ్ల బియ్యం తడిచిపోయాయి. మమ్మల్ని చూసేవారేలేరు. ఇంత వరద వస్తుందని మేము ఊహించలేదు. వండుకొని తినడానికి కూడా లేని పరిస్థితిని ఎదుర్కొంటున్నాం"- వరద బాధితులు
అన్నమో రామచంద్రా అంటూ : వీధులు, ఇళ్లల్లో అడుగుల మేర పేరుకుపోయిన బురదను చూసి బాధితులు అల్లాడిపోతున్నారు. ఏం చేయాలో తెలియక తల్లడిల్లిపోతున్నారు. కనీసం వండుకుని తినే పరిస్థితి లేదని అర్ధాకలితో అలమటిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్నేరు మిగిల్చిన కన్నీటితో ఎలా బతకాలని ప్రభావిత ప్రాంత ప్రజలు కన్నీటిపర్యంతమవుతున్నారు.
"మా బట్టలు, సామాన్లు వరదలో కొట్టుకుపోయాయి. వరద నీటి కారణంగా పిల్లలతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ధరించేందుకు దుస్తులు కూడా లేని పరిస్థితి ఉంది. మమ్మల్ని ఆదుకునేందుకు ఎవరూ వస్తాలేరు. మంచాలు, బీరువాలు, పిల్లల పుస్తకాలు, యూనిఫాంలు అన్నీ నీటిలో మునిగాయి. "- వరద బాధితులు
కాలనీల్లో బురద మేటలు : వరద ఉద్ధృతి తగ్గినప్పటికీ ముంపునకు గురైన కాలనీల్లో బురద మేటలు వేసి వెళ్లేందుకు కూడా ఇబ్బందికరంగా మారింది. కాలనీల మధ్య ఉన్న రోడ్లు, ప్రధాన రహదారికి వెళ్లేందుకు నిర్మించిన సీసీరోడ్లు కొట్టుకుపోయాయి. అంతర్గత రహదారులు కూడా పూర్తిగా దెబ్బతిని గుంతలు పడ్డాయి. అడుగు తీసి అడుగు వేసే పరిస్థితి లేని దుస్థితి నెలకొంది. పలు ఇళ్ల గోడలు కూలిపోయాయి. దీంతో పాటు వరదనీరు నిల్వ ఉండి దోమలు వంటివి కూడా వ్యాప్తి చెంది వ్యాధుల బారిన పడే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.