Sri Siddhivinayak Temple : భోళాశంకరుడు, పార్వతీదేవి ముద్దుల తనయుడు వినాయకుడు. ఆ స్వామిని పూజ నిర్వహించనిదే ఎటువంటి శుభకార్యాలను ప్రారంభించలేము. వినాయకచవితి వచ్చిందంటే చాలు చిన్నా, పెద్ద తేడా లేకుండా అందరూ పూజపునస్కారాల్లో మునిగిపోతారు. దేశంలో ఖరీదైన ఆలయాల్లో ఈ లంబోదరుడి ఆలయం నిలిచింది. చిన్న మందిరంగా వున్న ఈ ఆలయం కాలక్రమేణా దేశంలోనే అత్యధిక ఆదాయం కల ఆలయాల్లో ఒకటిగా మారింది.
నవశాల గణపతి : ముంబయిలోని ప్రభాదేవి ప్రాంతంలో సిద్ధి వినాయక మందిరం ఉంది. 1801లో ఈ ఆలయాన్ని అగ్రిసమాజ్‌కు చెందిన ద్యూబయి పాటిల్ ఆర్థికసాయంతో కాంట్రాక్టర్ లక్ష్మణ్‌వితు పాటిల్ నిర్మించారు. ద్యూబాయి పాటిల్‌కు పిల్లలు లేరు. అయితే వినాయకుడి దర్శనం కోసం వచ్చే సంతానం లేని మహిళలకు సంతానం కలిగేలా చల్లనిచూపు చూడాలని ఆమె ఆ గణనాధున్ని ప్రార్థించింది.
ఆమె ప్రార్థన ఫలం వల్ల అనేకమంది సంతానం లేని మహిళలకు సంతానం కలగడంతో ఆ శంభుకుమారుని దివ్యమహత్తు దేశమంతటా వ్యాపించింది. దీంతో ఆయన దర్శనం కోసం వస్తున్న వేలమందితో మందిరం సందడిగా వుంటుంది. సిద్ధివినాయకుడిని సవసచ గణపతిగా భక్తులు పిలుస్తారు. కోరిన కోర్కెలు తీర్చేవాడని మరాఠీ భాషలో దీనర్థం.
సిద్ధి,బుద్ధిల సమేతంగా : స్వామివారు సిద్ధి, బుద్ధిల సమేతంగా భక్తులకు అభయాన్ని ఇస్తుంటారు. పైన చేతిలో గొడ్డలి, మరో చేతిలో తామర, కింద వున్న చేతుల్లో జపమాల, మోదక్‌లు ధరించి భక్తులకు కనువిందు చేస్తుంటారు. రోజు వేలాదిమంది భక్తులు బొజ్జగణపయ్య దర్శనం కోసం వస్తుంటారు. పర్వదినాల్లో భక్తుల సంఖ్య మరింత అధికంగా వుంటుంది.
ఆదాయంలోను మేటి : సిద్ధివినాయక మందిరం దేశంలోని అత్యధిక ఆదాయాన్ని ఆర్జించే ఆలయాల్లో ఒకటిగావుంది. ఏటా హుండీ ద్వారా వచ్చే ఆదాయంలో కోట్లలో వుంటుంది. బంగారం కూడా ఎక్కువగా విరాళాల రూపంలో రావడం గమనార్హం. ఈ ఆలయానికి ఏటా రూ.125కోట్ల వరకు ఆదాయం వస్తుందని అంచనా.
బాలీవుడ్ తారల ఇష్టదైవం : సిద్ధివినాయకుడిని సామాన్యులతో పాటు పలువురు బాలీవుడ్ తారలు తరచుగా దర్శించుకుంటారు. అమితాబ్‌బచ్చన్, అజయ్‌దేవ్‌గణ్, సల్మాన్‌ఖాన్, దీపికా పదుకొనె తదితర తారలు స్వామివారిని దర్శించే భక్తుల్లో కొందరు కావడం విశేషం. ఈ ఆలయానికి వెళ్లాలంటే ముంబయికి దేశం నలుమూలల నుంచి రోడ్డు, రైలు, విమాన మార్గాలున్నాయి.
వినాయక చవితి పూజకు రెడీనా? ఈ 7 విషయాలు మస్ట్‌గా తెలుసుకోవాల్సిందే! - Vinayaka Chavithi 2024