Mukesh Nelavalli Excelling in Shooting in Guntur District : ముకేశ్ నేలవల్లి. అంతర్జాతీయ క్రీడా వేదికపై భారత ఖ్యాతిని ఇనుమడింపజేసిన ఆరడుగుల బుల్లెట్. పెరూ ప్రపంచ జూనియర్ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో దేశానికి ఏకంగా ఏడు పతకాలు అందించాడు. మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన ముకేశ్ పట్టుదల, కఠోర సాధనతో షూటింగ్‌లో అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడు.
ప్రపంచ జూనియర్ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో 5 స్వర్ణాలు సహా ఏకంగా 7 పతకాలు కొల్లగొట్టడంతో గుంటూరుకు చెందిన యువ షూటర్ ముకేశ్ పేరు మార్మోగుతోంది. పెరూలోని లిమాలో జరిగిన ప్రపంచ జూనియర్ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ మెుత్తం 24 పతకాలు సాధిస్తే అందులో ముకేశ్ ఒక్కడే 7 పతకాలతో సత్తా చాటాడు. మూడేళ్లుగా జాతీయస్థాయిలో అనేక పతకాలు సాధించిన 19 ఏళ్ల ఈ షార్ప్ షూటర్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో అద్భుత ప్రతిభ చూపడంతో అందరి దృష్టినీ తనవైపు తిప్పుకున్నాడు.
రెండు కాళ్లు లేకుంటేనేం! - స్విమ్మింగ్ పోటీల్లో బంగారు పతకాలు
ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడు సమ్మర్ క్యాంప్‌లో షూటింగ్ శిక్షణ తీసుకున్న ముకేష్ అప్పటినుంచి ఆ రంగంపై ఆసక్తి పెంచుకున్నాడు. గుంటూరు "ఇండియన్ అకాడమీ ఆఫ్ షూటింగ్"లో కోచ్ సుబ్రహ్మణ్యం దగ్గర తర్ఫీదు పొందాడు. 2017లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో సీనియర్, యూత్, జూనియర్ విభాగాల్లో తనకంటే పెద్దవారితో పోటీ పడి బంగారు పతకాలు సొంతం చేసుకున్నాడు. సౌత్ జోన్ పోటీల్లో రెండు రజతాలు, ఒక కాంస్యం సాధించాడు. అదే ఏడాది జరిగిన జాతీయ షూటింగ్ చాంపియన్‌షిప్ యూత్ కేటగిరీలో కాంస్యం నెగ్గాడు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కలిపి ఇప్పటివరకూ 50కి పైగా పతకాలు అందుకున్న ముకేశ్ భావి భారత షూటింగ్ ఆశాకిరణంగా మన్ననలు అందుకుంటున్నాడు.
అమ్మ నాన్నల ప్రోత్సాహం, హర్డ్ వర్క్ ఆ రెండు కారణాలే నేను ఈ స్థాయికి తీసుకువచ్చాయి. అమ్మ నాన్నలు ఎప్పుడు తప్పొప్పులు చెబుతూ నన్ను ముందుకు తీసుకువెళ్లారు. లాస్ ఏంజెల్స్ జరిగే ఒలింపిక్స్‌లో పతకం సాధించడమే నా ముందున్న లక్ష్యం. -ముకేశ్ నేలవల్లి, అంతర్జాతీయ షూటర్
గుంటూరులో సరైన సదుపాయాలు లేకపోవడంతో కొన్నిరోజులు హైదరాబాద్‌లో శిక్షణ తీసుకున్నాడు. తర్వాత పుణెలో గగన్ నారంగ్‌కు చెందిన "గన్ ఫర్ గ్లోరీ" అకాడమీలో చేరాడు. ముకేశ్ ప్రతిభను గుర్తించిన తల్లిదండ్రులు ఆర్థికంగా భారమైనా ప్రోత్సహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తే దేశం గర్వించే షూటర్‌గా ముకేష్ ఎదుగుతాడని తల్లిదండ్రులు చెబుతున్నారు. లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించడంపై దృష్టి సారించిన ముకేశ్ దేశానికి పతకం అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు.