Mrugavani National Park in Hyderabad: హైదరాబాద్ అనగానే అందరికీ చార్మినార్, ట్యాంక్‌బండ్, గోల్కొండ, బిర్లా మందిర్.. ఇలా రకరకాల ప్రదేశాలు, చారిత్రక కట్టడాలు గుర్తుకొస్తాయి. ఇక జంతు ప్రేమికులకైతే నెహ్రూ జూలాజికల్ పార్క్ గుర్తొస్తుంది. అయితే.. నగర శివారులో వినోదంతోపాటు విజ్ఞానం అందించే మరో పార్క్ కూడా ఉంది. అదే మృగవని నేషనల్ పార్క్. మరి.. ఇది ఎక్కడ ఉంది? టైమింగ్స్? ఎలా చేరుకోవాలి? వంటి వివరాలు ఇప్పుడు చూద్దాం..
మృగవని నేషనల్ పార్క్(Mrugavani National Park).. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిల్కూరు(Chilkur) సమీపంలో ఉంది. దాదాపుగా 1211 ఎకరాల విస్తీర్ణంలో ఈ నేషనల్ పార్క్ విస్తరించి ఉంది. వందల రకాల వృక్ష జాతులు, సుమారు 350 మచ్చల జింకలకు ఈ పార్క్ నిలయంగా ఉంది. వీటితో పాటు కుందేళ్లు, అడవి పిల్లి, ఇండియన్ ర్యాట్ స్నేక్, సివెట, రస్సెల్స్ వైపర్, చితాల్, ఫ్లవర్ పెకర్ వంటివి ఎన్నో ఉన్నాయి. నేషనల్ పార్కులో సఫారీ రైడ్ సరికొత్త అనుభూతిని అందిస్తుంది.
600 జాతుల వృక్షాలు: 1994లో భారత ప్రభుత్వం దీనిని వన్యప్రాణుల అభయారణ్యంగా ప్రకటించింది. అప్పటి నుంచి ఈ పార్క్ దాదాపు 600 జాతుల మొక్కలు, జంతువులకు నిలయంగా ఉంది. అన్ని నేషనల్ పార్కుల తరహాలోనే మృగవని నేషనల్ పార్క్(Mrugavani National Park) కూడా అన్ని జీవులు సహజ ఆవాసాలలో ఉండేలా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేలా చూస్తారు.
టూర్‌కు వెళ్తున్నారా? ఈ స్నాక్స్ మస్ట్ అంటున్న నిపుణులు!
100 కంటే ఎక్కువ పక్షి జాతులు: ఇక్కడి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. పార్క్ మొత్తం చూసేందుకు ఒక వ్యూ పాయింట్ ఉంటుంది. జంతువులను దగ్గరగా చూడటానికి ఒక వాచ్ టవర్ కూడా ఉంది. వన్యప్రాణులను ప్రదర్శించే మ్యూజియం, ఆడిటోరియం, పర్యావరణానికి సంబంధించిన ఒక లైబ్రరీ, విద్యా కేంద్రం కూడా ఉంది. సందర్శకులు సఫారీ రైడ్‌కు వెళ్లవచ్చు. అలాగే గైడ్‌లు కూడా అందుబాటులో ఉంటారు. వారితో కలిసి ట్రెక్కింగ్ చేయవచ్చు. అలాగే హైదరాబాద్ ప్రాంతంలో కనుమరుగవుతున్న స్థానిక వృక్షాలను ఇక్కడ సంరక్షిస్తున్నారు. వాటిని కూడా ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ టేకు, వెదురు, పికస్, పలాస్, రేలా వీటితో పాటు వృక్ష జాతులలో బ్రయోఫైట్స్, టెరిడోఫైట్స్, మూలికలు చూడవచ్చు. చీతల్, సాంబార్, అడవి పంది, జంగిల్ క్యాట్, సివెట్ క్యాట్, ముంగూస్ మానిటర్ లిజార్డ్, కొండచిలువ, రస్సెల్ వైపర్, కింగ్ కోబ్రా జంతువులతో పాటు 100 కంటే ఎక్కువ జాతుల పక్షులు, వార్బ్లెర్స్, నెమళ్లు, లాప్ వింగ్స్, ఫ్లవర్ పెకర్స్ను చూడవచ్చు.
టైమింగ్స్ ఇవే: సోమవారం మినహా మంగళవారం నుంచి ఆదివారం వరకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు వరకు ఓపెన్‌లో ఉంటుంది.
ఎంట్రీ ఫీజు: మృగవని నేషనల్ పార్క్‌కు వెళ్లడానికి పెద్దలకు ఒక్కరికి 10 రూపాయలు. పిల్లలకు మాత్రం వారి వయసును బట్టి ఉంటుంది. ఒకవేళ మీరు సఫారీ చేయాలనుకుంటే ఒక్కొక్కరికి 50 రూపాయలు కాస్ట్ ఉంటుంది.
ఎలా చేరుకోవాలి: మృగవని నేషనల్ పార్క్‌కు రోడ్డు మార్గం ద్వారా చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి చిల్కూరు మార్గంలో నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్‌కు సమీపంలో ఈ నేషనల్ పార్క్ ఉంది. మహాత్మా గాంధీ బస్ స్టేషన్ నుంచి బస్సులు అందుబాటులో ఉంటాయి.