Madanapalle Sub Collector Office Case Updates : ఏపీలోని మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదం గుట్టును మీటర్ రీడింగ్ ఇన్స్ట్ర్మెంట్ డేటా విప్పింది. ఘటన జరిగిన సమయంలో అంతకుముందు మూడు రోజుల్లోనూ కార్యాలయానికి సరఫరా అయ్యే విద్యుత్ లోడ్‌లో అసాధారణ హెచ్చుతగ్గులేమీ లేవని తేల్చింది. ప్రతి సర్వీసుకూ 15 నిమిషాల వ్యవధిలో సరఫరా అయ్యే కరెంట్ లోడ్ వివరాలు ఎంఆర్అఐ సర్వర్‌లో ఉంటాయి. ఆ డేటాను విశ్లేషించిన తర్వాత షార్ట్ సర్క్యూట్‌కు ఆస్కారమే లేదని నిపుణుల బృందం తేల్చింది.
దీంతో పాటు కార్యాలయానికి సరఫరా జరిగే త్రీఫేజ్ కరెంట్ సర్వీస్ వైరు కూడా ఎక్కడా దెబ్బతినలేదని గుర్తించింది. ప్రమాద తేదీకి మూడు రోజుల ముందు నుంచి విద్యుత్ లోడ్ లెక్కలను ఆ శాఖ బయటకు తీసింది. కార్యాలయంలోని కంప్యూటర్ సెక్షన్‌లో ఈ నెల 21న అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో దస్త్రాలు రాలిపోయిన ఘటనలో శాఖాపరంగా ఏమైనా లోపాలు ఉన్నాయా? అన్న ఆంశంపై విద్యుత్ సేఫ్టీ అధికారుల బృందం పరిశీలించింది. అక్కడ గుర్తించిన అంశాలతో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది.
అసాధారణ హెచ్చుతగ్గులేమీ లేవని వెల్లడి : డేటాలో ఎలాంటి అసాధారణ పెరుగుదలా నమోదు కాలేదని తేల్చింది. సబ్‌కలెక్టర్ కార్యాలయానికి త్రీఫేజ్ కనెక్షన్ ఉంది. ప్రమాదం జరిగిన రోజు రాత్రి 11:14 గంటల సమయంలో ఆర్-ఫేజ్‌లో 2.62 యాంప్స్ లోడ్ ఉంటే, అదే రాత్రి 22:44 గంటలకు 2.13 యాంప్స్‌గా ఉందని తెలిపింది. వేకువజామున 12:14 గంటలకు ఆర్-ఫేజ్‌లో 0.27 యాంప్స్ లోడ్‌కు పడిపోయిందని పేర్కొంది. పోలీసులు నమోదుచేసిన ఎఫ్ఐఆర్లో 21న రాత్రి 11:25 గంటలకు అగ్నిప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు. అంటే అగ్నిప్రమాదం తర్వాత లోడ్ ఒక్కసారిగా పడిపోయిందని తేల్చారు.
మదనపల్లె అగ్ని ప్రమాదంపై పలు అనుమానాలు - విచారణలో విస్తుపోయే నిజాలు - Madanapalle Fire Accident
వై, బి-ఫేజ్‌లలో కూడా విద్యుత్ లోడ్‌లో అసాధారణ వ్యత్యాసాలు లేవని అధికారులు గుర్తించారు. అగ్నిప్రమాదం జరిగిన తర్వాత 12:44 గంటల నుంచి 1:30 గంటల వరకు సబ్ కలెక్టర్ కార్యాలయానికి విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో, ఆ సమయంలో ఎంఆర్‌ఐ డేటాలో లోడ్ జీరోగా నమోదైంది. విద్యుత్ నియంత్రణకు 15 ఎంసీబీలు ఏర్పాటు చేస్తే, అందులో ఆర్-ఫేజ్‌కు ఏర్పాటు చేసిన వాటిలో నాలుగు, వై, బి-ఫేజ్‌ల్లో ఒక్కొక్కటి చొప్పున ఎంసీబీలు ట్రిప్ అయ్యాయని గుర్తించారు.
ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన అధికారులు : విద్యుత్ మీటర్ నుంచి ఎల్టీ డిస్ట్రిబ్యూషన్ బాక్సుకు సరఫరా చేసే విద్యుత్ నియంత్రణకు 100 యాప్స్ ఛేంజ్ ఓవర్ స్విచ్ వినియోగించారు. ప్రమాదం తర్వాత అక్కడున్న మొత్తం 15 ఎంసీబీల్లో ఆరు ఎంసీబీలు ట్రిప్ అయ్యాయి. రెసిడ్యుయల్ కరెంట్ సర్క్యూట్ బ్రేకర్‌ని ఏర్పాటు చేయలేదు. అగ్నిప్రమాదం వల్ల కంప్యూటర్ సెక్షన్‌లోని కన్సీల్డ్ వైరింగ్ ఔట్‌లెట్స్, స్విచ్ బోర్డులు దెబ్బతిన్నాయి. అగ్నిప్రమాదం తర్వాతే ఎల్టీ వైరుకు సరఫరా నిలిచింది. అది వైర్లు కరిగిపోవడం వల్ల జరిగిందా? వైర్లు ఎక్కడైనా తెగిపోయాయా? అనేది కన్సీల్డ్ వైరింగ్ వల్ల స్పష్టం కాలేదు.