Minors Stealing Mobile Phones in Hyderabad : నగరంలో సెల్‌ఫోన్ చోరీల్లో ఎక్కువగా మైనర్లు పట్టుబడడం ఆందోళన కలిగిస్తోంది. ప్రధానంగా కొందరు పాత నేరగాళ్లు, పిక్‌పాకెట్ గ్యాంగ్‌లు, మైనర్లకు వేతనాల తరహాలో నెలవారీగా కొంత మొత్తం డబ్బులిచ్చి సెల్‌ఫోన్ చోరీలు చేయిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడవుతోంది. ఇటీవల గుడిమల్కాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ యువకుడు బస్సు కోసం ఎదురుచూస్తున్నాడు. ఇంతలో ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు అతని సెల్‌ఫోన్ లాక్కున్నారు. బాధితుడు ప్రతిఘటించడంతో కత్తులతో దారుణంగా పొడిచారు. ఈ క్రమంలో ఆ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేయగా ఒకరికి 19 ఏళ్లు, ఇంకొకరు మైనర్ అని తేలింది. నగరంలో చోరీ చేసిన ఫోన్లకు పెద్ద మార్కెట్ ఉంది. కొట్టేసిన ఫోన్ల ఐఎంఈఐ నంబర్లను మార్చేసి విదేశాలకు తరలించే ముఠాలున్నాయి. ఇటీవల హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సెల్‌ఫోన్ దొంగిలించే ముఠాలను పట్టుకున్నారు. ఓ గ్యాంగ్‌లోని 17 మందిని అరెస్టు చేశారు. మరో కేసులో ప్రధాన నిందితులు ఇద్దరూ 19 ఏళ్ల కుర్రాళ్లే. వీరు కాజేసిన కొందరు సెల్‌ఫోన్ దుకాణ యజమానులు కొనుగోలు చేస్తున్నారు.
ఐఫోన్ వంటి ఫోన్లనూ తక్కువ ధరకే : నగరంలోని కొన్ని సెల్‌ఫోన్ దుకాణాల్లో కొట్టేసిన ఫోన్లు విక్రయించడాన్ని ఒక వ్యాపారంగా మార్చుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. చోరీ చేసిన ఫోన్లను అక్రమంగా సుడాన్‌కు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. విక్రయించడానికి సాధ్యంకాని, ఖరీదైన ఐఫోన్ వంటి వాటి విడిభాగాలను తక్కువ ధరకు అమ్మేస్తున్నారు. గత వారం నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సెల్‌ఫోన్ దొంగిలిస్తున్న యువకుల్ని అరెస్టు చేశారు. ఇందులోనూ నలుగురు మైనర్లు, మిగిలిన ఐదుగురూ 19 ఏళ్ల కుర్రాళ్లే. పలు గ్యాంగ్స్ వీరితో చోరీలు చేయిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
గతంలో పిక్‌పాకెట్ గ్యాంగ్‌లు రైళ్లు, బస్సులు, రద్దీ ప్రదేశాల్లో చోరీ చేసి సొమ్ము చేసుకునేవారు. ప్రస్తుతం ఆన్‌లైన్ లావాదేవీలు పెరిగాక జేబులో నగదు పెట్టుకునేవారి సంఖ్య తగ్గింది. పిక్‌పాకెటర్లు చోరీ చేస్తున్నా డబ్బు దొరకడం లేదు. దీంతో పిక్‌పాకెట్‌గాళ్లు సెల్‌ఫోన్ చోరీలపై దృష్టి సారించారు. పెద్దలైతే పట్టుబడితే చితకబాదుతారని, మైనర్లు, తక్కువ వయసున్నవారైతే చూసీచూడనట్లు వదిలేస్తారనే ఉద్దేశంతో కొన్ని గ్యాంగ్‌లు మైనర్లు, 20 ఏళ్ల లోపు యువకుల్ని రంగంలోకి దించుతున్నాయి.
వెయ్యి, రెండు వేల రూపాయలకు ఆశపడి : ప్రధానంగా చదువు మధ్యలో మానేసినవారు, తల్లిదండ్రుల ఆలనాపాలనా సరిగా లేక జులాయిగా తిరిగే కుర్రాళ్లు ఈ ముఠాల లక్ష్యం. వారి జల్సాలు, ఇతర అవసరాలకు డబ్బు ఆశచూపి ముగ్గులోకి దించుతున్నారు. ఇంకొందరు తల్లిదండ్రులు ఇచ్చే డబ్బు సరిపోక చోరీల బాట పడుతున్నారు. ఎక్కువ శాతం కేసుల్లో యువకులు వెయ్యి, రెండు వేల రూపాయలకు ఆశపడి ఫోన్లు చోరీ చేస్తున్నారు.
నగరంలో ఏటా వేల సంఖ్యలో ఫోన్లు పోగొట్టుకుంటున్న ఘటనలు నమోదవుతున్నాయి. ఫోన్లు చోరీకి గురైనా ఎక్కువ శాతం పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదు. పోగొట్టుకున్న ఫోన్లను రికవరీ చేసేందుకు కేంద్ర టెలికాం విభాగం సీఈఐఆర్ పోర్టల్ అందుబాటులోకి తెచ్చిన తర్వాత ఫోన్ల రికవరీ పెరిగింది. అయినప్పటికీ 50 శాతానికిపైగా ఫిర్యాదుకు ముందుకు రావడం లేదు. ఫోన్లు పోయినట్లయితే సమీప పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయాలని అధికారులు చెబుతున్నారు.