Food Processing Units Growth in Hyderabad : పచ్చళ్లు, గారెలు, లడ్డూలు, ఇతర చిరుతిళ్లకి మార్కెట్‌లో మంచిగిరాకీ ఉంది. ప్రస్తుతం జీవనవ్యయం పెరగడంతో భార్యభర్తలిద్దరూ ఏదో ఒక ఉద్యోగం చేస్తుండటం, వంట చేసుకునేందుకు తగిన సమయం లేకపోవడంతో చిరుతిళ్లపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు.
బయట లభించే రెడీమేడ్ పదార్థాలను ఇంటికి తెచ్చుకుంటుంటంతో ఆహార ఉత్పత్తులకు ఆదరణపెరిగింది. అవకాశాలను అందిపుచ్చుకునేందుకు చాలా మంది వ్యాపారులు ఆహారోత్పత్తి సంస్థలు నెలకొల్పుతున్నారు. చిన్నపాటి యూనిట్ల నుంచి మధ్యతరహా పరిశ్రమలు ఏర్పాటుచేస్తున్నారు. మహిళా సంఘాలు సైతం ఆహారోత్పత్తి సంస్థలని నెలకొల్పుతున్నాయి.
మార్కెటింగ్‌తో పాటు ఆన్‌లైన్‌లోనూ విక్రయాలు చేస్తూ ఉపాధి : స్వయం సహాయక మహిళా సంఘాల్లోని సభ్యులకు వచ్చేరుణాలతో వాటిని ఏర్పాటు చేసుకుంటున్నారు. రుచికరమైన స్నాక్స్ ప్యాక్‌చేసి విక్రయిస్తున్నారు. కొన్ని సంస్థలైతే విదేశాలకు ఎగుమతి చేస్తున్నాయి. మరికొన్ని సంస్థలు ఆన్‌లైన్‌లో మార్కెటింగ్ చేస్తున్నాయి. స్థానికంగా విక్రయించడంతో పాటు, సమీప పట్టణాలకు సరఫరా చేస్తున్నారు.
"అన్నిరకాల వంటలను ఇంట్లోనే తయారుచేస్తాం. పదిమంది వరకు మా దగ్గర పనిచేస్తున్నారు. ప్రపంచంలో ఏ చోటుకైనా మేము డెలివరీ చేస్తాం. ఈ ఆలోచన అనేది మహిళా గ్రూప్ ద్వారా మాకు వచ్చింది. రూ.10 లక్షల లోన్ తీసుకొని ముందు వేరే కంపెనీ పెట్టుకుంటే అందులో సరిగ్గా రాణించలేకపోయాను. తరవాత ఈ చిరుతిళ్లను తయారు చేయటం మొదలుపెట్టాం." -రాజమణి, సింధు హోమ్ ఫుడ్స్, కరీంనగర్
Innovative Food Products : ఆర్ధిక పురోగతిలో ఆహారోత్పత్తుల సంస్థలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. కనీసం ఐదుగురి నుంచి 100 మందివరకు ఆ సంస్థల్లో ఉపాధి పొందుతున్నారు. వినియోగదారులను ఆకట్టుకునేందుకు కొత్తరకమైన రుచులను పరిచయం చేసేందుకు వ్యాపారులు ప్రయత్నిస్తున్నారు. ఆకర్షణీయంగా ప్యాకింగ్ చేస్తున్నారు. ఆహారోత్పత్తుల సంస్థలను ఒకే వేదికపైకి తెచ్చేలా ఫుడ్ ఫెయిర్‌లు నిర్వహిస్తున్నారు.
తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో ఆహారోత్పత్తుల సంస్థలకు బ్యాంకుల ద్వారా రుణం ఇప్పించడం సహా శిక్షణ, మార్కెటింగ్‌లో మెలకువలను నేర్పిస్తున్నారు. శుచి, శుభ్రత, నాణ్యత పాటించి రుచికర ఉత్పత్తులు చేసే సంస్థలకు వినియోగదారులు నుంచి మంచి ఆదరణ ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు.
"ఫుడ్ పరిశ్రమ అనేది ఎప్పటికీ అంతంలేనిది. ఇందులో కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఉత్పత్తులు వస్తున్నాయి. ప్రజల జీవనశైలి మార్పుల వల్ల సమయంలేక, వండుకొని తినేంత సమయం వెచ్చించక ఇప్పుడు చాలామంది రెడీ టూ ఈట్ ఫుడ్‌కు మొగ్గుచూపుతున్నారు. ఉన్నపాటుగా శక్తినిచ్చే ఎన్నో ప్రొడక్ట్స్ కూడా మార్కెట్లోకి అందుబాటులోకి వస్తున్నాయి." -శ్రీకాంత్, ఫుడ్ ఫెయిర్ నిర్వాహకుడు