Holiday For Schools In Hyderabad : రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో విద్యాశాఖ అప్రమత్తమైంది. ముందు జాగ్రత్త చర్యగా హైదరాబాద్‌లోని అన్ని రకాల పాఠశాలలకు సోమవారం జిల్లా కలెక్టర్ సెలవును ప్రకటించారు. ఈ మేరకు అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఆదేశాలు జారీ చేశారు.
హైదరాబాద్ జిల్లాలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఏ విధమైన ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా తగు చర్యలు చేపట్టాలని జిల్లా యంత్రాంగాన్ని కలెక్టర్ ఆదేశించారు. రెవెన్యూ, ఇరిగేషన్, పోలీస్, విద్యుత్, ఆర్ అండ్ బీ శాఖలతో పాటు జీహెచ్ఎంసీ అధికారులు కూడా నిరంతరం విధుల్లో అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఏవైనా సమస్యలు ఉంటే హైదరాబాద్ కలెక్టరేట్లోని కంట్రోల్ రూం 040-23202813, 9063423979 నెంబరుతో పాటు ఆర్డీవో హైదరాబాద్ 7416818610, 9985117660, సికింద్రాబాద్ ఆర్డీవో ఫోన్ నెంబర్ 8019747481లకు ఫోన్ చేసి సమస్యలు తెలపాలని సూచించారు.
భారీ వర్షాలపై సీఎస్‌తో సీఎం రేవంత్ సమీక్ష : రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నందున అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. వర్షాల ప్రభావంపై సీఎస్ శాంతికుమారితో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్, వైద్యారోగ్య శాఖాధికారులందరినీ అప్రమత్తం చేయాలని సీఎస్‌కు సీఎం తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను వెంటనే సహాయక శిబిరాలకు తరలించాలని సీఎం ఆదేశించారు.
దిగువ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయండి : రిజర్వాయర్ల గేట్లు ఎత్తే చోట దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించాలని చెప్పారు. సీఎం ఆదేశాల మేరకు సీఎస్ శాంతికుమారి, డీజీపీ జితేందర్, కలెక్టర్లు, ఎస్పీలు, సీపీలు, మున్సిపల్ కమిషనర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
హైదరాబాద్‌లో మళ్లీ ప్రారంభమైన వర్షం : హైదరాబాద్‌లో ముసురు కొనసాగుతోంది. చినుకుచినుకు పడుతూ నగరాన్ని వర్షపు నీటితో చిందరవందర చేస్తోంది. హైదరాబాద్‌లోని అన్ని ప్రాంతాల్లోనూ వర్షం పడుతోంది. ఈ క్రమంలో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లు వరద నీటితో జలమయం అయ్యాయి. ఈ వర్షం ఇంకో రెండు రోజులు ఇలానే ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఆంధ్రాను భయపెడుతున్న వర్షాలు - ప్రజలు బయటకు రావొద్దని హెచ్చరికలు - heavy rainfall in andhrapradesh
తెలంగాణను వణికిస్తున్న వరుణుడు - ఇబ్బందులు పడుతున్న ప్రజానికం - Heavy Rains IN Telangana