MLA Palla Rajeshwar Reddy On Rythu Bharosa Scheme : బడ్జెట్ పద్దులపై చర్చలో భాగంగా వ్యవసాయ శాఖ పద్దుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కనీసం ఓదార్పు కూడా లేదన్న ఆయన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల ఆత్మహత్యలు పెరిగాయని ఆరోపించారు. 2014లో వరి విస్తీర్ణంలో తెలంగాణ 14వ స్థానంలో ఉంటే ఈరోజు నెంబర్ వన్ స్థానంలో ఉందని పేర్కొన్నారు. వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇస్తా అని మేనిఫెస్టోలో కాంగ్రెస్ పెట్టిందని, ఇప్పుడు సన్న వడ్లకు అని మాత్రమే చెప్తుందని ఆక్షేపించారు.
బీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒకటే అన్న రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ప్రతి పాలసీని అప్పటి ప్రభుత్వం మద్దతు ఇచ్చిందని మండిపడ్డారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కొంత ఇబ్బంది రావడంతో కేంద్రంతో దూరమయ్యారని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం సన్న వడ్లకు 500 బోనస్ ఇస్తామని కనీస మద్దతు ధర ప్రకారం రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చితీరుతామని చెప్పారు.
పథకాలన్నింటినీ మళ్లీ ప్రారంభిస్తాం : వ్యవసాయేతర భూములకు గత ప్రభుత్వం రూ. 25 వేల కోట్లు రైతు బంధు సాయం ఇచ్చిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతు భరోసాపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుందని, అందరి అభిప్రాయం తీసుకుంటుందని ఇప్పటికే ప్రకటించినట్లు చెప్పారు. గతంలో పంటల బీమా పక్కన పెట్టారని, గత ప్రభుత్వంలో ఆగిపోయిన పథకాలన్నింటినీ మళ్లీ ప్రారంభిస్తామని మంత్రి చెప్పారు. రైతులకు వ్యవసాయ అంశంలో గత ప్రభుత్వం ఏమి చేయలేదని, రైతుబంధు సమితి అధ్యక్షుడుగా పల్లా రాజేశ్వర్ రెడ్డి పేరు వచ్చినప్పుడు సూటబుల్ కాదని తాను ఆరోజే చెప్పానని తుమ్మల పేర్కొన్నారు. రైతుల అంశంలో ఇప్పుడు పల్లాకు మాట్లాడే అవకాశం ఇస్తే ఇప్పుడు సూటబుల్ కావటం లేదని అన్నారు.
సాగు చేసే వారికి మాత్రమే రైతు భరోస : గత ప్రభుత్వంలో పేరుకు మాత్రమే అభిప్రాయ సేకరణ చేపట్టేవారని, తీసుకునే నిర్ణయాలు మాత్రం ఏకపక్షంగానే వెలుపడతాయని మంత్రి కొండా సురేఖ చెప్పారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి లాంటి ఒకరిద్దరి అభిప్రాయం తప్ప వేరే వాళ్లను లెక్కచేయలేదని అన్నారు. గుట్టలు, స్థిరాస్థి వ్యాపారులకు రైతుబంధు ఇచ్చారన్న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సాగు చేసే వారికి మాత్రమే రైతు భరోసా ఇవ్వాలన్నది తమ ప్రభుత్వ విధానమని చెప్పారు. పదేళ్లు పోడు భూముల పట్టాలు ఇవ్వలేదని, ఆడవారిని చెట్టుకు కట్టేసి కొట్టిన చరిత్ర బీఆర్ఎస్దని మండిపడ్డారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత రైతుల ఆత్మహత్యలు పెరిగాయి. రైతుల ఆత్మహత్యలపై స్పందించాల్సిన బాధ్యత మంత్రులపై ఉన్నా ఒక్క మంత్రి కూడా స్పందించలేదు.-పల్లా రాజేశ్వర్‌రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే
BRS MLA Palla VS Minister Tummala : కాంగ్రెస్ ప్రభుత్వం ముదిగొండలో ఆరుగురు రైతులను పొట్టన పెట్టుకొన్నది పల్లా రాజేశ్వర్ రెడ్డి విమర్శించారు. రెండో పంట వేయకున్నా కొందరికి రైతుబంధు సాయం ఇచ్చామని, అందులో దళిత రైతులు, ఇతరులు ఉన్నారని తెలిపారు. రుణమాఫీ మొదట 41 వేల కోట్లు, ఆ తర్వాత 31 వేల కోట్లు అన్నారు. ఇప్పుడు బడ్జెట్ లో 25 వేల కోట్లు పెట్టారని ఎద్దేవా చేశారు. రేషన్ కార్డు, పీఎం కిసాన్ తో సంబంధం లేకుండా అందరికీ రుణమాఫీ చేయాలని పల్లా డిమాండ్ చేశారు. తెల్ల రేషన్ కార్డు కుటుంబ నిర్ధారణ కోసమేనని మంత్రి తుమ్మల అన్నారు. రుణ మాఫీ ఏకకాలంలో అంటే ఒకే సీజన్లో చేస్తామని 15 రోజుల్లో రెండు సార్లు లక్షన్నర వరకు రుణమాఫీ చేశామని, మిగతావి కూడా 15 రోజుల్లో చేస్తామని మంత్రి పేర్కొన్నారు.
వ్యవసాయేతర భూములకు గత ప్రభుత్వం 25 వేల కోట్ల రైతుబంధు సాయం చేసింది. ప్రస్తుతం రైతు భరోసాపై అభిప్రాయ సేకరణ చేపడతాం. గత ప్రభుత్వంలో ఆగిపోయిన పథకాలన్నింటినీ మళ్లీ ప్రారంభిస్తాం. -తుమ్మల నాగేశ్వర్‌రావు, మంత్రి
రెండో విడత రైతు రుణమాఫీ - రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతల సంబురాలు - Rythu Runa Mafi in Telangana