MLA Case File on Cyber Criminals in Telangana : సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అంతు లేకుండా పోతుంది. పోలీసులు ఎన్ని జాగ్రత్తలు చెబుతున్నా, బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతూనే ఉంది. సామాన్యులకు ఫ్రీ గిఫ్ట్, డిస్కౌంట్, తక్కువ డబ్బులతో ఎక్కవ సంపాదించుకోవచ్చు, ఇలా తదితర మార్గాల్లో గాలం వేస్తున్నారు. వారి వలకు సామాన్యులే కాదు వీఐపీలు కూడా దొరికిపోతున్నారు. ప్రముఖుల పేరుతో ఖాతాలు తెరిచి కొత్త రకం మోసాలకు పాల్పడుతున్నారు. అయితే ప్రస్తుతం సైబర్ నేరగాళ్లకు ఏకంగా ఓ ఎమ్మెల్యేనే చిక్కాడు. అది ఎలానో తెలుసుకుందాం.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తాను ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శినంటూ సైబర్ నేరగాడు ఓ ఎమ్మెల్యేకు ఫోన్ చేశాడు. ఈ రకంగా ఆ ఎమ్మెల్యేతో పరిచయం పెంచుకున్నాడు. అనంతరం తొందర్లోనే ముఖ్యమంత్రి కొత్త రుణ పథకం ప్రారంభించబోతున్నారని చెప్పాడు. ఆ పథకం కింద వందల మందికి రూ.లక్షల్లో రుణాలు ఇవ్వాలని నిర్ణయించారని తెలిపాడు. ఎమ్మెల్యే కోటా కింద 100 మందికి రుణాలు అందేలా తాను చూస్తానని ఎమ్మెల్యేను సైబర్ నేరగాడు నమ్మించాడు. ఇందుకు గానూ ఒక్కో మనిషికి రూ.3600 ఇస్తే పని జరుగుతుందని చెప్పాడు.
పార్శిల్ పేరిట మోసం - బాధితుడి ఖాతా నుంచి రూ.20 లక్షలు స్వాహా - Cyber fraud in the name of parcel
Latest Cyber Fraud in Hyderabad : సైబర్ నేరగాడు చెప్పిన మాటలు నమ్మిన ఎమ్మెల్యే వెనకా ముందు ఆలోచించకుండా రూ.3.60 లక్షలు నేరగాడి ఖాతాలో జమ చేశాడు. నగదు ఖాతాలోకి పడినప్పటి నుంచి నేరగాడి ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో పీఏ ద్వారా విచారణ చేయించాడు. అనంతరం మోసపోయామని తెలుసుకుని పీఏ ద్వారా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా నిందితుడు తోట బాలాజీ నాయుడు అలియాస్ మల్లారెడ్డి అలియాస్ అనిల్ కుమార్ అని తేలింది. నిందితుడిని అరెస్ట్ చేసి, అనంతరం రిమాండ్కు తరలించారు. గతంలో నిందితుడిపై 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి 37 కేసులు ఉన్నట్లు గుర్తించారు. 2008లో రామగుండం ఎన్టీపీఎస్లో ఏఈగా పని చేశాడని, 2009లో ఓ ఎమ్మెల్యే పీఏ నుంచి లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడినట్లు అధికారులు వెల్లడించారు.