Ministers Visited Flood Affected Areas : వైఎస్సార్సీపీ హయాంలో నిర్వాసితులను గాలికి వదిలేశారని మంత్రులు విమర్శించారు. గోదావరి వరదల కారణంగా ఇబ్బందులు పడుతున్న నిర్వాసితులను పరమర్శించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో మంత్రుల బృందం పోలవరం విలీన మండలాల్లో పర్యటించింది. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి, హోం మంత్రి వంగలపూడి అనితతో కూడిన మంత్రుల బృందం ఏలూరు జిల్లా కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో పర్యటించింది.
సీఎంతో మాట్లాడి పరిష్కరిస్తాం : కుక్కునూరు మండలం దాచారం పునరావాస కాలనీని సందర్శించిన మంత్రులు అక్కడ నిర్వాసితులకు అందుతున్న ప్రభుత్వ సహాయాన్ని పరిశీలించారు. ప్రభుత్వం చేస్తున్న సహాయ కార్యక్రమాలను బాధితులు, అధికారులను ముఖాముఖి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పునరావాస కాలనీల్లో ఉన్న సమస్యలను బాధితులు మంత్రుల దృష్టికి తీసుకువచ్చారు. R&R నిధులు జమ కాలేదని చెప్పారు. సీఎంతో మాట్లాడి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పునరావాస కాలనీల్లో రోడ్లు, మరుగు దొడ్ల సమస్యను నివేదించారు. దీనిపై స్పందించిన మంత్రి అచ్చెన్నాయుడు త్వరగా బయో టాయిలెట్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇతర సమస్యలనూ పరిష్కరిస్తామన్న అచ్చెన్న ప్రతి కుటుంబానికి తక్షణ సాయంగా 3 వేల రూపాయలు ఇవ్వాలని సీఎం ఆదేశించినట్లు తెలిపారు.
అనంతరం అక్కడి నుంచి వేలేరుపాడు మండలం కన్నాయిగుట్ట చేరుకున్న మంత్రులు అక్కడ గోదావరి వరద ప్రవాహాన్ని పరిశీలించారు. గోదావరి వరద ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో ముంపు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, ఆ మేరకు ప్రజలను ఒప్పించాలని కలెక్టర్‌కు మంత్రులు ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుతం పునరావాస కాలనీల్లో తలదాచుకుంటున్న వరద బాధితులకు ప్రభుత్వం తరపున నిత్యావసరాలు అందిస్తున్నామని, ఒక్కో కుటుంబానికి 3 వేల రూపాయలు సహాయం అందిస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. గత ముఖ్యమంత్రిలా కాకుండా వరదలు పూర్తిగా రాకముందే బాధిత ప్రాంతాలను సందర్శించి వారి సమస్యలను, అందుతున్న సహాయాన్ని తెలుసుకున్నామన్న ఆయన పెద్ద వాగు ప్రాజెక్టును సైతం తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి కొత్త నమూనాలు రూపొందించి నిర్మాణం చేపడతామని తెలిపారు.
ఆదుకుంటామని రైతులకు భరోసా : పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ గ్రామంలో మంత్రుల బృందం పర్యటించింది. నీట మునిగిన పంటలను మంత్రులు అచ్చెన్నాయుడు, అనిత, పార్థసారథి, రామానాయుడు పరిశీలించారు. ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని రైతులకు భరోసా ఇచ్చారు. వరద బాధితులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.
తగ్గని గోదావరి వరద ఉద్ధృతి - జలదిగ్బంధంలోనే లంక గ్రామాలు - Godavari floods in ap