Minister Uttam Review Meeting In Suryapet : తెలంగాణ ఎన్నికల కోడ్ ముగియడంతో అభివృద్ధి పనులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టి సారించారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో ఆర్ అండ్ బీ, పంచాయితీ రాజ్, ఎలక్ట్రిసిటీ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఉత్తమ్ అభివృద్ది పనులు పూర్తి నాణ్యతతో పూర్తిచేయాలని అధికారులని ఆదేశించారు. కోదాడ హుజూర్‌నగర్‌లలో చాలా వరకు లిఫ్ట్‌లు గతంలో తనే మంజూరు చేశానని తెలిపారు. పూర్తి సామర్థ్యంతో లిఫ్టులు నడిచే విధంగా మరమ్మత్తులు చేపడుతున్నామన్నారు.
Minister Uttam on Development Works : రాష్ట్రంలో కొత్త లిఫ్ట్‌లు మంజూరయ్యి పనులు కూడా ప్రారంభమయ్యాయని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసిన లిఫ్ట్‌లు పనిచేసే విధంగా ప్రణాలికలు రూపొందిస్తున్నామని సూచించారు. ప్రతి మూడు నాలుగు లిఫ్ట్‌లకు కలిపి ఫిట్టర్ ఆపొరేటర్తో పాటు ఎలక్ట్రీషియన్ కూడా ఏర్పాటు చేసేలా ప్రయత్నం చేస్తున్నామన్నారు. మన రాష్ట్రంలో పూర్తి స్థాయిలో నూతన ఆయకట్టు సామర్థ్యాన్ని పెంచే ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. త్వరలో రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించుకున్నామని తెలిపారు.
రైతుల నుంచి సన్న వడ్లకు 500 బోనస్ ఇస్తామని పేర్కొన్నారు. రేషన్ బియ్యం పూర్తి స్థాయిలో సన్న బియ్యం ఇచ్చేలా ప్రణాలికలు రూపొందిస్తున్నామని చెప్పారు. భారత దేశంలోనే కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎలక్షన్లో మన ప్రాంతం నుంచి మెజారిటీ సాధించినందుకు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కోదాడ, హుజూర్నగర్ ఓటర్లకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. సమాజహితం కోసం ప్రజల కోసం పూర్తి స్థాయిలో పనిచేస్తామని సూచించారు. పేద ప్రజల కోసం నిరంతరం మేలు జరిగేలా ప్రభుత్వం తోర్పడుతుందన్నారు. అధికారులకు ఏ ఇబ్బంది ఉన్నా తమకు తెలియజేయాలని చెప్పారు.
రామస్వామి గట్టు సమీపంలో ఇళ్ల పరిశీలన : సూర్యాపేట జిల్లా హుజుర్‌నగర్‌లోని రామస్వామి గట్టు సమీపంలోని ఇళ్లను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2160 ఇళ్ల నిర్మాణం చేపట్టామన్నారు. దురదృష్టవశాత్తు పది సంవత్సరాలు టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. కేసీఆర్ ఇళ్లకు నిధులు మంజూరు చేశానని ప్రజలను మోసం చేశారని విమర్శించారు. గత ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా నిధులు మంజూరు చేయక మాటలతో కాలయాపన చేసిందని తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరవాత రూ.74 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. 6 నెలల్లో ఇళ్లు మంజూరు చేసి లబ్ది దారులకు అందచేస్తామని అన్నారు. ఇళ్ల ఎంపిక పారదర్శకంగా జరుగుతుందని తెలిపారు. మొదటి దపాలో హుజుర్నగర్ పట్టణ నిరుపేదలకు ఇస్తామని తెలిపారు.