Minister Uttm Kumar On Pending Irrigation Projects : పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలన్న ముుఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలతో మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని ఉదండాపూర్ జలాశయంతో పాటు గట్టు ఎత్తిపోతల పథకాన్ని సహచర మంత్రి జూపల్లి కృష్ణారావు, ఆర్థిక, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో కలిసి ఉత్తమ్ పరిశీలించారు.
బీఆర్‌ఎస్ హయాంలో పాలమూరు - రంగారెడ్డికి 27వేల 500 కోట్లు ఖర్చు చేసి ఒక ఎకరాకు నీళ్లు ఇవ్వలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. కనీసం ప్రాజెక్టుకు నీటివాటా సాధించలేకపోయారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఉదండాపూర్ రిజర్వాయర్ కింద ఆర్‌ఎండ్‌ఆర్‌కు రూ.45 కోట్లు విడుదల చేసినట్లు వివరించారు. పాలమూరు -రంగారెడ్డి పూర్తైతే 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చని ఆ చిత్తశుద్ధితోనే ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఉత్తమ్ కుమార్‌రెడ్డి చెప్పారు.
వారికి న్యాయపరంగా పునరావాసం కల్పిస్తాం : ఉదండాపూర్‌తో పాటు, ఇతర రిజర్వాయర్లలో ముంపునకు గురైన వారికి న్యాయపరంగా పునరావాసం అందిస్తామని వెల్లడించారు. గట్టు ఎత్తిపోతల ప్రాజెక్టు సామర్థ్యం పెంపునకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఈఎన్‌సీని మంత్రులు ఆదేశించారు. కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు లిఫ్ట్‌ఇరిగేషన్లతో పాటు అన్ని ప్రాజెక్టులను నూటికి నూరు శాతం పూర్తి చేస్తామని ఉత్తమ్ వెల్లడించారు.
"ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సుమారు 12 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని ఒక కమిట్‌మెంట్‌తో ముందుకు పొతున్నాం. జిల్లాలోని ప్రాజెక్టులన్నింటిని పూర్తి చేస్తాం. గత ప్రభుత్వ హయాంలో పాలకులు ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారు. ఒక్క ఎక రానికి కూడా నీళ్లు ఇవ్వని ఘనత గతంలో అధికారంలోనున్న వారిది(బీఆఎస్). "- ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి
నిరసన వ్యక్తం చేసిన ఉదండాపూర్ భూ నిర్వాసితులు : ఎన్నికలకు ముందు ఉదండాపూర్ భూనిర్వాసితులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రాజెక్టులు పనులు ఎలా మొదలు పెడతారని మంత్రుల పర్యటన సందర్భంగా బాధితులు నిరసనకు దిగారు. ఉదండాపూర్ జలాశయాన్ని మంత్రులు ఉత్తమ్, జూపల్లి సందర్శించినప్పుడు ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, ఎంపీ మల్లురవితో నిర్వాసితులు వాగ్వాదానికి దిగారు. ఇచ్చిన మాట ప్రకారం ప్యాకేజీ, వ్యవసాయ భూముల పరిహారాన్ని పెంచాలని కోరారు. పునరావాసం పూర్తయ్యే వరకు ప్రాజెక్టు పనులు జరగనివ్వబోమని భూనిర్వాసితులు హెచ్చరించారు. పరిహారం పెంపుపై ప్రభుత్వానికి లేఖ రాసినట్లు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వివరించారు. ప్రస్తుతం మూడు తండాలకి ప్యాకేజీ డబ్బులు చెల్లించామని, వల్లూరు, ఉదండపూర్ గ్రామాలకు సైతం త్వరలోనే నగదు జమచేస్తామని చెప్పారు.
శంకర సముద్రం జలాశయం పనుల పరిశీలన : భీమా ఎత్తిపోతల పథకంలో భాగంగా కొత్తకోట మండలం కానాయపల్లి వద్ద నిర్మించిన శంకర సముద్రం జలాశయం పనులను మంత్రి ఉత్తమ్, జూపల్లి పరిశీలించారు. ఆ జలాశయం ద్వారా లక్ష ఎకరాలకు సాగునీరు అందించవచ్చని చిన్నచిన్న సమస్యలతో పూర్తిస్థాయిలో అందించలేక పోతున్నట్లు జూపల్లి ఉత్తమ్ దృష్టికి తెచ్చారు. జలాశయాన్ని పూర్తి చేయాలంటే పునరావాసం ప్రధాన సమస్యగా మారిందని, 300 కుటుంబాలకు అన్ని వసతులతో పునరావాసం కల్పించాల్సి ఉందని మాజీ మంత్రి చిన్నారెడ్డి ఉత్తమ్ దృష్టికి తెచ్చారు.
పునరావాసానికి రూ.75కోట్లు, ఆనకట్టకి మరో రూ.10 కోట్లు కేటాయిస్తే శంకర సముద్రం పూర్తి చేసి సాగునీరు ఇవ్వవచ్చని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి మంత్రికి వివరించారు. పునరావాసానికి ఏర్పాటు, కాలువల నిర్మాణానికి ఎంత ఖర్చుచేస్తే అదనంగా ఎంత ఆయకట్టుకు సాగునీరు అందించవచ్చో వారంలో నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌ను ఉత్తమ్ ఆదేశించారు. అక్కన్నుంచి నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం నార్లాపూర్ వద్ద పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను ఉత్తమ్ పరిశీలించారు.
త్వరలోనే కమిటీ వేసి సమస్యలు పరిష్కరిస్తాం : అంజనగిరి జలాశయం హెడ్‌రెగ్యులటర్, సర్జ్ పూల్, ప్రధాన కాలువ, మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల డెలివరీ సిస్టంలను పరిశీలించారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో నిర్వాసితులైన బోడబండ తండా, హేమనాయక్ తండా, లచ్చునాయక్ తండా, అంజనగిరి నిర్వాసితులతో భేటీఅయ్యారు. న్యాయం చేయాలని నిర్వాసితులు కోరగా మానవతా దృక్పథంతో పరిశీలిస్తామని త్వరలో కమిటీ వేసి సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తామని ఉత్తమ్ భరోసా ఇచ్చారు. కె.ఎల్.ఐ, పాలమూరు రంగారెడ్డి ప్రధాన కాలువల లైనింగ్ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
నెల రోజుల్లోనే ప్రజా పాలన అంటే ఏంటో చూపించాం : ఉత్తమ్‌కుమార్ రెడ్డి