Minister Uttam Kumar on Grain Purchase : తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరితో రైతులు నష్టపోతున్నట్లు ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు, గత ప్రభుత్వం కంటే ఎక్కువ ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. కిషన్‌రెడ్డి దీక్ష(Kishan Reddy Strike) చేయడాన్ని తప్పుబట్టిన ఉత్తమ్, బీఆర్‌ఎస్, బీజేపీలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవాలు లేవన్నారు.
రాష్ట్రంలో పండిన ప్రతి గింజను తప్పక కొనుగోలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. గాంధీ భవన్‌లోని మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, గతేడాది కంటే ఈ ఏడాది వారం ముందే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని తెలిపారు. ఇప్పటికే 6919 సెంటర్లలో ధాన్యం కొనుగోలు జరుగుతోందని, గత ఏడాది ఈ సమయానికి 331 ధాన్యం కేంద్రాలు మాత్రమే ప్రారంభించారని తెలిపారు.
ఈ ఏడాది రబీలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెంచామని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి వరకు 2.69 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. సిద్దిపేటలో గత ఏడాది ఈ సమయానికి ఒక్క ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదన్న ఆయన, ఈ ఏడాది మాత్రం సిద్దిపేట జిల్లాలో ఇవాళ్టికి 418 కొనుగోలు కేంద్రాలు నడుస్తున్నాయని వివరించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు ఇప్పటికే అందుబాటులో ఉంచామని మంత్రి తెలిపారు.
"తెలంగాణ ఆవిర్భావమైన మొదటి సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు విషయంలో ఈ సంవత్సరమంత సమర్థంగా, అంత నిజాయితీగా ఎన్నడు జరగలేదు. ప్రతి గింజనూ ఈ ప్రభుత్వం కనీసం మద్దతు ధర కంటే ఎక్కువకే తీసుకుంటుంది. ఇది మా గ్యారంటీ. ఈ ఏడాది మార్చి 25 తారీఖుకు మొదటి కొనుగోలు ధాన్యం కేంద్రం ఏర్పాటు చేశాం. ఏప్రిల్ 01 కంటే సుమారు వారం రోజుల కంటే ముందే చేయడానికి కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక అనుమతి తీసుకొని, కొనుగోలు నిర్వహించాం." -ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి
Minister Uttam Announcement on Paddy Procurement : కొన్ని కొనుగోలు కేంద్రాలు, మార్కెట్లలో రైతులకు కనీస మద్దతు ధర(Minimum Support Price) కంటే ఎక్కువ రేటు వస్తోందని ఉత్తమ్ వివరించారు. ధాన్యం ఎక్కువ ఉన్నచోట అదనపు కొనుగోలు కేంద్రాలు తెరిచేందుకు అధికారులకు అనుమతి ఇచ్చామన్న మంత్రి, అన్నదాతలు ఎవరూ ఆందోళన చెందొద్దని సూచించారు. వ్యవసాయ ఉత్పత్తులలో లాభనష్టాలను చూడకుండా రైతులను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందన్నారు.
గత ప్రభుత్వం పౌర సరఫరాల శాఖను అస్తవ్యస్తం చేసిందని విమర్శించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రతి జిల్లాలో రేషన్ బియ్యం రీసైక్లింగ్ మాఫియా(Ration Rice Recycling Mafia) తయారైందని ఆందోళన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలులో ప్రతి రైతుకు న్యాయం చేస్తామని, దేశ చరిత్రలో 70 రోజుల్లో 5 గ్యారంటీలను అమలు చేసిన ప్రభుత్వం తమదని వెల్లడించారు.