Minister Tummala about Seeds in kharif Season : రాష్ట్రంలో ప్రధాన వాణిజ్య పంట పత్తి సహా పచ్చిరొట్ట విత్తనాల కొరత లేకుండా ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గడిచిన రెండు మూడు రోజులుగా కురిసిన వర్షాలు, వచ్చే మూడు నాలుగు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా అనేక జిల్లాలలో ఒక మోస్తరు నుంచి భారీ వర్ష సూచన ఉందన్న వాతావరణ శాఖ అంచనాల నేపథ్యంలో మంత్రి సంబంధిత అధికారులతో మాట్లాడారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో వర్షాలు దృష్టిలో పెట్టుకుని జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇప్పటికే అన్ని జిల్లాలకు సరఫరా చేసిన పచ్చిరొట్ట, పత్తి విత్తనాల ప్యాకెట్లు రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అందే విధంగా చూడాలని ఆదేశాలు ఇవ్వాలని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ పత్తి విత్తనాలు, ఆదివారం పది లక్షల, 43 వేల, 474 ప్యాకెట్లతో కలిపి 84 లక్షల, 43 వేల, 474 సరఫరా కావడం జరిగిందని, ఇప్పటికే రైతులు 25 లక్షల, 10 వేల, 430 పత్తి ప్యాకెట్లు కొనుగోలు చేశారని అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. కంపెనీల వారీగా సరఫరా సమీక్షించడం ద్వారా వ్యవసాయ శాఖ ప్రణాళిక ప్రకారం ఇంకా రాష్ట్రానికి సరఫరా చేయాల్సిన పత్తి ప్యాకెట్లను కూడా రైతులకు ఈ మూడు రోజుల్లో అందుబాటులో ఉంచేలా చూడాలని మంత్రి తుమ్మల ఆదేశించారు.
విత్తనాలను ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు : పచ్చిరొట్ట విత్తనాలు ఇవాళ్టికి గత సంవత్సరంలో 37959.60 క్వింటాళ్లు రైతులు కొనుగోలు చేశారని అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఇప్పటికే 97,109 క్వింటాళ్లు అందుబాటులో ఉంచగా రైతులు 84,412 క్వింటాళ్లు పచ్చిరొట్ట విత్తనాలు కొనుగోలు చేశారని తెలియజేశారు. ప్రభుత్వం సరఫరా చేయ తలపెట్టిన విత్తనాలు ఈ నాలుగైదు రోజుల్లో రైతులకు అందుబాటులో ఉంచుతామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో పచ్చిరొట్ట విత్తనాలు ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేసి పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి రావడం జరిగిందని మంత్రి ప్రస్తావించారు. రాష్ట్ర రైతు ప్రయోజనాలు పణంగా పెట్టి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అదే విధంగా అనుమతి లేకుండా పత్తి విత్తనాల ప్యాకెట్లు విక్రయిస్తున్న 33 మందిపై కేసులు పెట్టి రూ. 2.49 లక్షల విలువ గల 118.29 క్వింటాళ్ల విత్తనాలును స్వాధీనం చేసుకున్నారని అధికారులు ప్రకటించారు. బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారని ఇద్దరు డీలర్లపై కేసులు పెట్టమని తెలిపారు. పత్తి విత్తనాలు మార్కెట్లలో అవసరం మేర అందుబాటులో ఉన్నాయని, రైతులందరూ అధీకృత డీలర్ల వద్దనే విత్తనాలు కొనుగోలు చేయాలని మంత్రి తుమ్మల సూచించారు. ఎన్నో మాయ మాటలు చెప్పి అమ్మే ప్రైవేటు వ్యక్తులు వద్ద రైతులు ఎలాంటి విత్తనాలు కొనుగోలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు.