Minister Thummala on Oil Palm Crop : రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు పెంపునకు వ్యవసాయధికారులు, అయిల్ పామ్ కంపెనీలు కృషి చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. సచివాలయంలో ఆయిల్‌పామ్ సాగు పథకం అమలుపై మంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. 2024-25 సంవత్సరంలో లక్ష ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ పామ్ సాగు చేపట్టేందుకు ప్రణాళిక రూపొందించినప్పటికీ, ఇప్పటి వరకు కేవలం 12,448 ఎకరాల్లో మాత్రమే సాగులోకి తేవడం పట్ల మంత్రి తుమ్మల అసహనం వ్యక్తం చేశారు.
కంపెనీలకు హెచ్చరిక : రాష్ట్రంలో జిల్లాల వారీగా ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం పురోగతిపై విస్తృతంగా చర్చించారు. ఇప్పటి వరకు లక్ష్యాలు చేరుకోలేని, ఏ మాత్రం పురోగతి చూపని కంపెనీ నిర్వాహకులపై మంత్రి తుమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒప్పందాల మేరకు పురోగతి ప్రదర్శించాలని, కంపెనీలపై ప్రత్యక్ష చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. నిర్ధేశించుకున్న లక్ష్యాలను చేరే విధంగా ప్రయత్నిస్తున్న కంపెనీలకు ప్రభుత్వపరంగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని, అదే సమయంలో కచ్చితమైన ప్రణాళిక లేకుండా రైతుల ప్రయోజనాలు దెబ్బతీసేలా కంపెనీలు ప్రవర్తిస్తే మాత్రం సహించమని తేల్చి చెప్పారు.
భారతదేశంలో వంట నూనెల ఉత్పత్తి దాదాపు 123 లక్షల మెట్రిక్ టన్నులు ఉండగా, సుమారు 250 లక్షల మెట్రిక్ టన్నుల వినియోగం జరుగుతోందని మంత్రి తుమ్మల ప్రస్తావించారు. దేశంలో వంట నూనెలకు సుమారు రూ.70 నుంచి రూ.80 వేల కోట్ల విదేశీ మారక ద్రవ్యం వెచ్చించి దిగుమతులు చేసుకుంటున్నామని, ఈ మొత్తం దిగుబడుల్లో పామాయిల్ వాటా 53 శాతంగా ఉందని ఆయన తెలిపారు.
సాగును పెంచాలి : దేశంలో ఆయిల్ పామ్ పంట 11.75 లక్షల ఎకరాల్లో సాగులో ఉందని మంత్రి తుమ్మల తెలిపారు. మన అవసరాలకు ఏ మాత్రం సరిపోక మలేషియా, ఇండోనేషియా వంటి దేశాల నుంచి ముడి సరకు దిగుమతుల ద్వారా భర్తీ చేసుకుంటున్నామని తెలిపారు. స్వయం సమృద్ధి సాధించాలంటే 70 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేయాల్సి ఉన్నందున ఆ అవకాశం అందిపుచ్చుకోవడానికి కంపెనీల సహకారం కావాలని ఆయన సూచించారు.
రైతాంగానికి ఆయిల్ పామ్ సాగు ద్వారా 25 నుంచి 30 ఏళ్ల వరకు ఏటా సంవత్సరానికి రూ.1,20,000 వరకు ఆదాయం పొందుతారని మంత్రి తెలిపారు. అంతేకాక ఆయిల్ పామ్ తోటల్లో తొలి మూడేళ్ల పాటు అంతర పంటలు పండించి ఆదాయం పొందేలా రైతులను ప్రోత్సహిస్తున్నామన్నారు. ఈ పంట సాగు చేసే రైతులకు మార్కెటింగ్ ఇబ్బందులు తలెత్తకుండా ఆయిల్ పామ్ చట్టం పరిధికి లోబడి పంట కొనుగోలు చేయాలని కంపెనీలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, ఉద్యానశాఖ సంచాలకులు యాస్మిన్ భాషా, ఆయిల్‌ఫెడ్ సంస్థ ఛైర్మన్ జంగా రాఘవరెడ్డి, ఉద్యానశాఖ అధికారులు, ఆయిల్‌పామ్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.
రైతు రుణమాఫీపై రాజకీయ నేతల మాటలయుద్ధం - ప్రతిపక్షానికి మంత్రుల కౌంటర్ - Telangana crop loan 2024