Minister Thummala On Loan waiver : కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన రుణమాఫీపై బీఆర్ఎస్ నేతలు చేసిన విమర్శలను మంత్రి తుమ్మల తిప్పికొట్టారు. రుణమాఫీపై బీఆర్ఎస్ నేతలు అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. '2018లో రుణమాఫీ అమలుకు కూడా కుటుంబమే యూనిట్‌గా తీసుకున్నారని దాని నిర్ధారణకు ప్రాతిపదిక ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారం ప్రకారమని చెప్పినప్పటకీ ప్రామాణికంగా తీసుకున్నది రేషన్ కార్డు కాదని చెప్పగలరా?' అని తుమ్మల ప్రశ్నించారు.
బీఆర్ఎస్ హయాంలో కేవలం సగంమందికే ఇచ్చి, 20.84 లక్షల మందికి ఎగ్గొట్టిన విషయం నిజం కాదా? అని తుమ్మల విమర్శించారు. బోడిగుండును, మోకాలికి ముడివేసే పెద్దలు రుణమాఫీ కాకపోవడానికి 31 కారణాలు అని చెబుతున్నారన్నారని అసహనం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరికి సమాచార పత్రం ఇచ్చి, అందులో కారణం పేర్కొని, వాటిని సరిదిద్దే విధంగా చేస్తున్నామన్నారు. బీఆర్ఎస్ నాయకుల మాదిరిగా తప్పించుకునే ప్రయత్నం చేయడంలేదని వివరించారు.
బీఆర్ఎస్ హయాంలో 2018లో రుణమాఫీ కాని 20 లక్షల మంది రైతుల పేర్లను తాము ఇవ్వగలమని తుమ్మల పేర్కొన్నారు. రుణమాఫీ 2024 పథకం అమల్లో ఉందని గత ప్రభుత్వంలా ఐదేళ్లు చేయమని ఈ పంట కాలంలోనే పూర్తి చేస్తామని తుమ్మల స్పష్టం చేశారు. ఆగస్టు 15వ తేదీకల్లా ఇచ్చిన మాట ప్రకారం అర్హులైన, సరియైన వివరాలు ఉన్న రూ.2 లక్షలలోపు రుణం ఉన్న అన్ని ఖాతాలకు రుణమాఫీ వర్తింపచేశామని తెలిపారు. గత రైతుబంధులో రూ.25వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారని రైతుల్లో అభిప్రాయం వ్యక్తమైందన్నారు. అందువల్లనే మరింత పకడ్భందిగా పంట వేసినవారికి, కౌలు రైతులకు, సాగులో ఉన్న భూమికే రైతుభరోసా వర్తింపచేయడానికి నిశ్చయించి, విధివిధానాల రూపకల్పన జరుగుతుందని మంత్రి వివరించారు.
ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చెప్పినా ఇంకా తన సహచర మంత్రివర్యులు చెప్పినా తామందరిదీ ఒకటే మాటగా తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.100 శాతం రుణమాఫీ అయినట్లు తాము ప్రకటించినట్లు బీఆర్ఎస్ ఒక విష ప్రచారానికి తెరలేపి రైతులను ఆందోళన పరుస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని, అసత్య ప్రచారాలు మానుకొని వడ్డీమాఫీ చేయకుండా వదిలేసిన 22 లక్షల కుటుంబాల దగ్గరకు వెళ్లి క్షమాపణ అడిగి మీ(కాంగ్రెస్) పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని హితవు పలికారు.
రైతు రుణమాఫీపై రాజకీయ నేతల మాటలయుద్ధం - ప్రతిపక్షానికి మంత్రుల కౌంటర్ - Telangana crop loan 2024