Job Calendar in Telangana 2024 : తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసనసభలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బిల్లును ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు ప్రవేశపెట్టారు. అతి త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు. జాబ్ క్యాలెండర్ ద్వారా రాబోయే రోజుల్లో 2 లక్షల ఉద్యోగాలు భర్త చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. 2 లక్షల ఉద్యోగాలు కల్పించినా, మరో 20 లక్షల మంది ఉపాధి కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంటారని, ప్రభుత్వం పరంగా అందరికీ ఉద్యోగాలు కల్పించడం సాధ్యం కాదని శ్రీధర్‌బాబు తెలిపారు.
ప్రాక్టికల్ బోధన : పరిశ్రమలకు కావాల్సిన నైపుణ్యాలు గ్రాడ్యుయేట్లలో కొరవడ్డాయని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. నైపుణ్యాల పెంపుపై పారిశ్రామికవేత్తలు, వీసీలు, విద్యార్థులతో చర్చించామని, 'యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీ' స్థాపనకు ప్రతిపాదిస్తున్నామన్నారు. నైపుణ్యాల పెంపొందించే ఉద్దేశంతోనే 'యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీ' స్థాపన జరుగుతోందని, అన్ని కోర్సులు 50 శాతం ప్రాక్టికల్ కాంపొనెంట్‌ను కలిగి ఉంటాయని స్పష్టం చేశారు.
స్కిల్ యూనివర్సిటీ యువతకు ఉపాధి కల్పిస్తుందని, రాష్ట్ర ఆర్థిక వృద్ధిని పెంచుతుందని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. తెలంగాణలో మరిన్ని పరిశ్రమల స్థాపనకు స్కిల్ వర్సిటీ ఊతమిస్తోందని తెలిపారు. 2024-25 సంవత్సరంలో 2000 మంది విద్యార్థులకు, వచ్చే ఏడాది 10 వేల మందికి శిక్షణ ఇస్తామని మంత్రి స్పష్టం చేశారు. ముచ్చర్లలో స్కిల్ వర్సిటీ కోసం శాశ్వత క్యాంపస్ ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు. స్కిల్ యూనివర్సిటీ బిల్లుకు ప్రతిపక్షాలు మద్దతు తెలపాలని కోరారు.
బీఆర్ఎస్పై శ్రీధర్‌బాబు ఫైర్ : గులాబీ నేతలపై మంత్రి శ్రీధర్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో గట్టిగా నినాదాలు చేయడం నిబంధనలకు విరుద్ధమని ఆయన మండిపడ్డారు. సభలో బీఆర్ఎస్ వ్యవహరిస్తున్న తీరు సరైంది కాదని, యువత ప్రయోజనం కంటే బీఆర్ఎస్కు రాజకీయ భవిష్యత్తే ముఖ్యం అనుకుంటున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్, బీజేపీ సిద్ధాంతాలు వేరైనప్పటికీ యువత భవిష్యత్ కోసం సహకరిస్తున్నారని, రాష్ట్ర యువత బీఆర్ఎస్ సభ్యుల చేష్టలను గమనిస్తోందని తెలిపారు.
"రాష్ట్రంలో త్వరలో జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసి 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాము. నిరుద్యోగ యువతపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. వారికి ప్రభుత్వరంగంలోనే కాకుండా ప్రైవేట్ రంగంలోనూ ఉపాధి కల్పనకు కృషిచేస్తాము". - శ్రీధర్‌బాబు, మంత్రి.
నల్లబ్యాడ్జీలతో రాక : మరోవైపు నిన్న అసెంబ్లీ ఘటనపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నల్ల బ్యాడ్జీలతో శాసనసభకు వచ్చారు. సభాపతి నల్ల డ్రెస్‌తో రావడంపై హరీష్‌రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమకు మద్దతుగా నల్ల డ్రస్‌తో వచ్చిన స్పీకర్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.
అసెంబ్లీలో స్కిల్ యూనివర్సిటీ బిల్లును ప్రవేశ పెట్టిన మంత్రి శ్రీధర్ బాబు