IT Park and Five Star Hotel Setup in East Hyderabad : త్వరలోనే తూర్పు హైదరాబాద్‌లో ఐటీ పార్కును ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. దీనిపై ప్రభుత్వం ఇప్పటికే ఓ నిర్ణయం తీసుకుందని చెప్పారు. అందరితోనూ సంప్రదింపులు జరిపి అనుసంధానమైన స్థలాన్ని ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. త్వరలోనే ఒక పాలసీ నిర్ణయం కూడా తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ మేరకు ఈస్ట్ హైదరాబాద్ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వివరించారు. ఉప్పల్ భగాయత్‌లోని హెచ్‌ఎండీఏ లే అవుట్‌లో క్రెడాయ్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరిగే ఈస్ట్ హైదరాబాద్ ప్రాపర్టీ షో శుక్రవారం ప్రారంభమైంది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి శ్రీధర్‌బాబు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నగరంలో ఉన్నట్టుగా ఈస్ట్‌లోనూ ప్రధానమైన కన్వెన్షన్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈస్ట్‌లో ఐదు నక్షత్రాల హోటళ్ల ఏర్పాటుకు సంబంధించి అధ్యయనం చేయిస్తామని పేర్కొన్నారు. దాని ప్రకారం స్థలాన్ని గుర్తించి హోటల్ రంగాన్ని తీర్చిదిద్దుతామని చెప్పారు. నగర నలువైపులా అభివృద్ధికి కృషి చేస్తున్నట్టుగా తెలిపారు. త్వరలోనే క్వీన్స్ అనే అంతర్జాతీయ సంస్థను ఈస్ట్‌వైపు తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు వివరించారు. మల్టీనేషన్ సంస్థలను, కంపెనీలను సైతం ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వివరించారు.
సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ పరిశ్రమలను తెచ్చేలా : హైదరాబాద్ మహానగర అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి కృషి చేస్తోందని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వమే మెట్రో రైలును అందుబాటులోకి తెచ్చిందని గుర్తుచేశారు. 20, 30 ఏళ్లను దృష్టిలో ఉంచుకుని మెట్రోరైళ్లను తెచ్చామని తెలిపారు. దీంతో పబ్లిక్ రవాణాకు ఓ రూపం వచ్చిందని వ్యాఖ్యానించారు. మెట్రో రైలు విస్తరణకు కూడా తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఓఆర్‌ఆర్ నుంచి ఆర్‌ఆర్‌ఆర్ వరకు రేడియల్ రోడ్లను అభివృద్ధి చేస్తామని, ఈ రెండింటి మధ్యలో సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ పరిశ్రమలను తెచ్చేలా కృషి చేస్తున్నామని వివరించారు.
హైదరాబాద్ అభివృద్ధిలో అందరి పాత్ర అవసరమని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. హైదరాబాద్ సాంకేతికంగా, వాణిజ్య, వ్యాపార పరంగానే కాకుండా ప్రజల జీవన నైపుణ్యాలను సైతం పెంపొందించేలా కృషి చేస్తున్నామని తెలిపారు. మంచి పనులు గత ప్రభుత్వాలు చేస్తే దానికి రెట్టింపుతో మంచి చేసేందుకు ఆలోచన చేస్తామని చెప్పారు. గత ప్రభుత్వం లుక్ ఈస్ట్ అని ప్రస్తావించిందని, అయినా దానికి తగ్గట్టుగా అడుగులు వేయలేదని పేర్కొన్నారు. ఏ రోజు ప్రభుత్వ పరంగా వేలం వేసినా ఆస్తులకు సంబంధించి ఆ రోజు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని తెలిపారు. దీంతో అందరిలోనూ నమ్మకం సన్నగిల్లిందని వ్యాఖ్యానించారు.
ఫోర్త్‌సిటీ అభివృద్ధి దిశగా : గత ప్రభుత్వం ఏ హామీలు ఇచ్చిందో, రాజకీయాలలోకి పోకుండా ఆస్తుల అభివృద్ధి, రియల్ ఎస్టేట్‌కు సంబంధించి, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి, పన్నుల విషయంలో మినహాయింపులు, మూసీనది పక్కన వేలంలో కొన్న స్థలాల విషయాలలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు తమ సర్కార్ కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. నాణ్యమైన నిర్మాణం జరిగితే దానికి తగ్గట్లుగా ధరలు ఉండాలని పేర్కొన్నారు. ఫోర్త్‌సిటీ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని, అందులో భాగంగా స్కిల్ వర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. రాబోయే రోజుల్లో నిర్మాణ రంగానికి కావాల్సిన నైపుణ్యాన్ని ఇక్కడ శిక్షణలో నేర్పించనున్నట్లు తెలిపారు.
హైదరాబాద్‌లో పెట్టుబడుల విస్తరణకు అమెజాన్ సంస్థ సుముఖత - amazon investments in Hyderabad