Minister Seethakka Reacts On Smita Sabharwal Tweet : దివ్యాంగులపై ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్ వ్యాఖ్యలు తగవని మంత్రి సీతక్క అన్నారు. వికలాంగ సోదరులను కించపరిచే వ్యాఖ్యలని మండిపడ్డారు. సీఎల్పీ కార్యాలయంలో మంత్రి సీతక్క ఇష్టాగోష్టిగా మాట్లాడారు. స్మితా సభర్వాల్ వ్యాఖ్యల వెనుక వేరే ఆలోచన కనిపిస్తోందన్నారు. ఆమెకు ఫ్యూడల్ భావజాలం ఉందని, ఆమె తన మానసిక ఆలోచన విధానాన్ని మార్చుకోవాలని సూచించారు. తను అభిప్రాయాన్ని వ్యక్తిగతంగా ఉంచుకోవాలని చెప్పారు.
ఒక అధికారి ఫిజికల్ ఫిట్నెస్ గురించి స్మితా సభర్వాల్ స్పందించడం తప్పుగా పేర్కొన్న సీతక్క క్షేత్రస్థాయిలో పర్యటన చేసే ఉద్యోగాలకు ఆఫీసులో చేసే ఉద్యోగానికి తేడా తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. స్మితా సభర్వాల్ వ్యాఖ్యలు సీఎం దృష్టికి వెళ్లి ఉంటాయని అభిప్రాయపడిన మంత్రి, తాను కూడా ఈ విషయంపై సీఎంతో చర్చిస్తానని స్పష్టం చేశారు. ఫిజికల్ ఫిట్నెస్ అనేది దేవుడు ఇచ్చేదని ఐఏఎస్, ఐపీఎస్ పని వేరని వివరించారు.
అనాదిగా ఒక మనస్తత్వం ఉన్న వారికి ఇలాంటి ఆలోచనలు వస్తాయన్న మంత్రి సీతక్క, ఇప్పటికైనా ఇలాంటి ఆలోచనలు మానుకోవాలని తెలిపారు. అంగవైకల్యంతో ఎంతోమంది గొప్ప స్థానాలకు వెళ్లారని గుర్తుచేసిన ఆమె ఇతరుల సమర్ధత గుర్తించేందుకు కృషి చేయాలని చెప్పారు. ఇలాంటి వైకల్యం గురించి ఆలోచించే వారికే మానసిక వైకల్యం ఉంటుందని సీతక్క అన్నారు.
సవాల్ ప్రతిసవాల్ : మరోవైపు దివ్యాంగుల రిజర్వేషన్లపై ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్ పెట్టిన ట్వీట్ తీవ్ర దుమారం లేపిన విషయం తెలిసిందే. ఆమెపై సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ ఛైర్మన్ బాలలత ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దివ్యాంగుల సంఘాలు స్మితా సభర్వాల్‌పై ఫైర్ అయ్యారు. దివ్యాంగులందరికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎక్స్‌లో ఆమె పెట్టిన ట్వీట్ తొలగించకపోతే అమరణ నిరాహార దీక్ష చేపడతామని అన్నారు. అనంతరం బాలలత స్మితా సభర్వాల్‌కు ఇద్దరం పరీక్షలు రాద్దాం అంటూ సవాల్ విసిరారు.
I would take on her odd challenge but doubt UPSC will permit me due to my advanced age 😄
— Smita Sabharwal (@SmitaSabharwal) July 23, 2024
Since @sudhakarudumula you are her spokesperson pls do ask her only one Question -
To what use has she put her privilege of Disability Quota ?
To run coaching institutes or to serve the… https://t.co/sXmuLY0TkU
దీనిపై స్పందించిన స్మితా సభర్వాల్ సివిల్స్ పరీక్ష రాసేందుకు మళ్లీ తాను సిద్ధమేనని కానీ వయో పరిమితి దాటినందున పరీక్ష రాసేందుకు యూపీఎస్సీ అనుమతిస్తుందానే అనే అనుమానం ఉందన్నారు. దివ్యాంగుల కోటాలో ఉద్యోగం పొందిన బాలలతకు ఆ జాబ్, ఫీల్డ్ వర్క్‌తో ప్రజలకు సేవ చేయడానికి ఉపయోగపడిందా లేక కోచింగ్ కేంద్రం నడపడానికా అంటూ ప్రశ్నించారు. మరోవైపు స్మితా సభర్వాల్ వ్యాఖ్యలపై స్పందించిన ఏపీ సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ యూపీఎస్సీ అథ్లెటిక్స్ నియామకం చేపట్టడం లేదని విమర్శించారు.
ఆ వార్తలన్నీ అవాస్తవం - తన ట్వీట్‌పై స్మితా సభర్వాల్ క్లారిటీ