Minister Seethakka On Anganwadi Workers : శాసనసభ సమావేశాల్లో బడ్జెట్ పద్దులపై చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యే కోవ లక్ష్మీకి సమాధానం ఇచ్చిన మంత్రి సీతక్క అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల రిటైర్మెంట్ సందర్భంగా ఇచ్చే ప్రోత్సాహకాలు పెంచబోతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్‌కు రూ.2 లక్షలు, ఆయాలకు రూ.లక్ష రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందిస్తామని చెప్పారు. ఈ ప్రభుత్వం అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటుందని తెలిపారు.
పోడు భూముల అవకతవకలపై విచారణ : అలాగే పోడు భూముల అవకతవకలపై న్యాయ విచారణ జరగాల్సిందిగా డిమాండ్ చేశారు. పోడు భూములను చట్టానికి విరుద్దంగా వందల ఎకరాలు ఆక్రమించారని వారిపై విచారణ జరిపి భూమిలేని పేదవాళ్లకు ఇవ్వాలని అన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్నా ఎస్టీలకు మీరేమీ చేయలేదని బీఆర్ఎస్ను ఉద్దేశిస్తూ విమర్శించారు. పదేళ్ల పాలనలో ఎంతమంది ఎస్టీలకు ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. గత పాలనలో ఎస్టీలకు ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదని మండిపడ్డారు. గత ప్రభుత్వం జూలై 2020 ఆసరా పింఛన్ ఇవ్వలేదని అబద్ధాలను అద్భుతంగా ఆవిష్కరించడంలో బీఆర్‌ఎస్ దిట్టని అన్నారు.
"అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల రిటైర్మెంట్ ప్రోత్సాహకాలు పెంచుతున్నాము. గత ప్రభుత్వం అంగన్‌వాడీ టీచర్లను మోసం చేసింది. మా ప్రభుత్వం అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటుంది. పోడు భూముల అవకతవకలపై న్యాయ విచారణ చేయాలి. వందల ఎకరాల పోడు భూములు ఉన్న వారి నుంచి భూమిని తీసుకొని పేదవాళ్లకు ఇవ్వాలి." -మంత్రి సీతక్క
స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాలు : బీఆర్ఎస్ నాయకులు పదేపదే తన తల్లిదండ్రలకు భూమి ఇచ్చామంటున్నారని, తన తల్లిదండ్రులకు చట్టప్రకారమే పోడుభూముల హక్కు వచ్చిందని స్పష్టం చేశారు. తమవి అడవిని ఆధారంగా చేసుకుని బతికే కుటుంబాలని, ఆ భూమిపై సంప్రదాయంగా వచ్చిన హక్కు అది అని సీతక్క పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన భూమి కాదని తేల్చి చెప్పారు. మరోవైపు ఆగస్టు 5 నుంచి 13 వరకు గ్రామాల్లో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాలు ఉంటాయని ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని సీతక్క తెలిపారు. పల్లెల ప్రగతి కోసం చేపట్టే కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పాల్గొనాలని సూచించారు.
రిజిస్ట్రేషన్ ఛార్జీల్లో మహిళలకు 50శాతం రాయితీ అంశం సర్కార్ పరిశీలనలో ఉంది : సీతక్క