Minister Seethakka and Speaker Prasad in Adivasis Day Celebrations : తరతరాలుగా ఆదివాసీలు పోరాటాలు చేశారు కానీ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నారని శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క అన్నారు. తాండాలు, గూడేలు బాగుపడినప్పుడే సమాజం అభివృద్ధి చెందినట్లని పేర్కొన్నారు. శుక్రవారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని కొమురంభీం భవన్లో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడారు. ఎస్టీల కోసం బడ్జెట్లో 17 వేల కోట్ల రూపాయలను కేటాయించామని సీతక్క తెలిపారు. మారుమూల ప్రాంతాల్లో రెండు పూటల తిండి దొరకక సాగుతున్న జీవితాలెన్నో ఉన్నాయని, వారి అభివృద్ధికై ప్రతీ అధికారి పాటుపడాలని సూచించారు. కేంద్రం 2022లో తెచ్చిన అటవీ హక్కుల చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వ పర్మిషన్ ఉంటే చాలని, ఇష్టారీతిన మైనింగ్ వ్యాపారం చేస్తూ రోడ్లు వేయటానికి మాత్రం అనుమతించడం లేదని విమర్శించారు.
'తాండాలు, గూడేలు బాగుపడినప్పుడే సమాజం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినట్లు. తరతరాలుగా ఒక దిక్కు జాతుల అణచివేత ఉంటుంది, మరోదిక్కు ప్రాంతాల అణచివేత ఉంటుంది. ఇలాంటి సమాజం ఇప్పుడు మనముందు ఉంది. అందుక అనుగుణంగా ఈ సమాజంలో ఎవరు ఏ ప్రాంతంలో ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారో, వారి ఏం కావాలో వంటి ప్రణాళిక రూపొందించాల్సిన అవసరం ఉంది'-సీతక్క, శిశు సంక్షేమశాఖ మంత్రి
ఆదివాసీల అభివృద్ధి కోసం ప్రభుత్వం పని చేస్తోంది : జీవవైవిధ్యాన్ని కాపాడే గొప్ప వ్యక్తులు ఆదివాసీలని, వారి అభివృద్ధి కోసం ప్రభుత్వం పని చేస్తోందని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను, ఆదివాసీ సంఘాలను మంత్రి సీతక్క, స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ సత్కరించారు.
'గత పదేళ్లలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నేతలు ఆర్థిక విధ్వంసాన్ని సృష్టించారు. భూ విధ్వంసాన్ని, అడవి విధ్వంసాన్ని, ఇసుక విధ్వంసాన్ని చేసి రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు. మీ అందరి సహకారంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రం పురోగతి చెందుతోంది. ఎన్ని అప్పులు ఉన్నా రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం ముందుంది'- గడ్డం ప్రసాద్ కుమార్, స్పీకర్